AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముందు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో చేయండి.. రాహుల్ గాంధీకి ప్రశాంత్ కిషోర్ సూటి ప్రశ్న..!

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ సహా మరికొన్ని ప్రాంతీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే కులగణన, రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకొస్తున్నారు. రాహుల్ డిమాండ్లపై అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) సారథి భారతీయ జనతా పార్టీ (BJP) మౌనమే సమాధానం అన్నట్టుగా వ్యవహరిస్తోంది.

ముందు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో చేయండి.. రాహుల్ గాంధీకి ప్రశాంత్ కిషోర్ సూటి ప్రశ్న..!
Prashant Kishor, Rahul Gandhi (File Photos)
Mahatma Kodiyar
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 30, 2024 | 1:41 PM

Share

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ సహా మరికొన్ని ప్రాంతీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే కులగణన, రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకొస్తున్నారు. రాహుల్ డిమాండ్లపై అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) సారథి భారతీయ జనతా పార్టీ (BJP) మౌనమే సమాధానం అన్నట్టుగా వ్యవహరిస్తోంది. కులగణన పట్ల ఆ పార్టీ సానుకూలంగా లేదని ఎవరికైనా అర్థమవుతోంది. పైకి కారణాలు చెప్పకపోయినా.. దాని వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అన్న భావనలో అధికార పార్టీ ఉంది. కుల గణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం వారికి వాటా ఇవ్వాలంటూ రాహుల్ గాంధీ నినదిస్తుంటే.. అల్పసంఖ్యాక కులాలు తీవ్రంగా నష్టపోతాయన్న భావనలో కొందరు సామాజిక నిపుణులున్నారు. తాజాగా కులగణన విషయంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, రాజకీయ నాయకుడు ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన కేవలం ఏ వర్గం ప్రజలు ఎంత సంఖ్యలోనే ఉన్నారో తెలుస్తుంది తప్ప, ఆ గణాంకాలతో పేదరికం నిర్మూలించలేమని అన్నారు. ఒకవేళ కులగణన నిజంగానే అంత ఉపయోగకరం అనుకుంటే ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటకలో కులగణన చేపట్టి పేదరికాన్ని నిర్మూలించాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు.

ఎన్డీఏ మిత్రపక్షం ఒత్తిడి

అధికార ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న జనతాదళ్ (యునైటెడ్) సైతం కులగణన కోసం ఒత్తిడి చేస్తోంది. గురువారం ఢిల్లీలో జరిగిన “పార్లమెంటరీ కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఓబీసీ” సమావేశంలో ఈ అంశాన్ని నొక్కి చెప్పింది. బీజేపీ ఎంపీ గణేశ్ సింగ్ నేతృత్వంలో ఉభయ సభలకు చెందిన 30 మంది పార్లమెంట్ సభ్యుల కమిటీ సమావేశంలో మెజారిటీ సభ్యులు కుల గణన కోసం పట్టుబట్టినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఇప్పటికే పెండింగులో ఉన్న జనగణనతో పాటు కులాలవారీగా జనాభా లెక్కలు సేకరించడంపై కేంద్ర హోంశాఖను సంప్రదించాలని నిర్ణయించినట్టు తెలిసింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కులగణన అంశాన్ని ఒక అస్త్రంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌తో పాటు ద్రావిడ మున్నేట్ర కళగం (DMK), సమాజ్‌వాదీ పార్టీ (SP), రాష్ట్రీయ జనతా దళ్ (RJD) వంటి పార్టీలు ఈ అంశంపై పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. కులగణనతో వెనుకబడిన వర్గాలు విస్తృత ప్రయోజనం ఉంటుందన్న భావన కలిగించడంలో ఆ పార్టీలు కొంతమేర సఫలమయ్యాయి.

ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఆయా వర్గాల ఓట్లు బీజేపీకి దూరం కావడానికి ఇదే కారణమని కమలదళ అగ్రనేతలు సైతం ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఓబీసీ వెల్ఫేర్ కమిటీ సమావేశంలో డీఎంకే నేత టీఆర్ బాలు ఈ అంశాన్ని లేవనెత్తగా, ఇదే కమిటీలో సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ నేత మాణిక్కం టాగోర్ సైతం కులగణన కోసం పట్టుబట్టినట్టు తెలిసింది. ఈ సమయంలోనే జేడీ(యూ) నే గిరిధర్ యాదవ్ సైతం కులగణన అంశాన్ని ప్రస్తావిస్తూ 2023లో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తమ రాష్ట్రంలో కులగణన కసరత్తుకు రూపకల్పన చేశారని గుర్తుచేశారు. జేడీ(యూ) ఆ తర్వాత ఎన్డీఏలో చేరినప్పటికీ కులగణన విషయంలో వెనక్కి తగ్గలేదు. మొత్తంగా ప్రతిపక్షాల ఒత్తిడికి తోడు మిత్రపక్ష జేడీ(యూ) సైతం డిమాండ్ చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం సైతం కులగణనపై ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి