నా 13 ఏళ్ళ వయస్సులో ఏం జరిగిందంటే..?
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ తన 13 ఏళ్ళ వయస్సులో..బస్సులో తనకు కలిగిన ఓ అనుభవం గురించి చెప్పి రాజ్యసభను నిర్ఘాంతపరిచారు. లైంగిక నేరాలనుంచి పిల్లలను రక్షించే సవరణ బిల్లు (పోక్సో అమెండ్ మెంట్) పై చర్చ సందర్భంగా ఆయన ఒకప్పుడు తనకు కలిగిన దారుణ స్వీయానుభవాన్ని వివరించారు. (బాలలపై లైంగికవేధింపులు, అత్యాచారాలకు పాల్పడేవారికి మరణ శిక్షతో సహా అత్యంత కఠిన చర్యలు తీసుకోవడానికి ఈ సవరణ బిల్లు నిర్దేశిస్తోంది). ఈ బిల్లుపై చర్చ సందర్భంగా […]
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ తన 13 ఏళ్ళ వయస్సులో..బస్సులో తనకు కలిగిన ఓ అనుభవం గురించి చెప్పి రాజ్యసభను నిర్ఘాంతపరిచారు. లైంగిక నేరాలనుంచి పిల్లలను రక్షించే సవరణ బిల్లు (పోక్సో అమెండ్ మెంట్) పై చర్చ సందర్భంగా ఆయన ఒకప్పుడు తనకు కలిగిన దారుణ స్వీయానుభవాన్ని వివరించారు. (బాలలపై లైంగికవేధింపులు, అత్యాచారాలకు పాల్పడేవారికి మరణ శిక్షతో సహా అత్యంత కఠిన చర్యలు తీసుకోవడానికి ఈ సవరణ బిల్లు నిర్దేశిస్తోంది). ఈ బిల్లుపై చర్చ సందర్భంగా సుదీర్ఘంగా డెరెక్ మాట్లాడారు.’ అసలు ఇలాంటి నేరాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి ? ఇంటినుంచే.. ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉన్నవారు వీటిపై మాట్లాడడం మొదలు పెట్టాలి. చర్చలకు శ్రీకారం చుట్టాలి. పిల్లల మీద లైంగిక నేరాలను అదుపు చేయాలంటే..బాలలు కూడా తమకు కలిగే ఇలాంటి నేరాలు, అత్యాచారాల గురించి ధైర్యంగా చెప్పడానికి ముందుకు వచ్చేలా చూడాలి.. ‘ అని 58 ఏళ్ళ డెరెక్ అన్నారు. ఈ సందర్భంగా నా గుండెల్లోనుంచి ఉబికి వఛ్చిన ఉద్వేగం, బాధ, కలవరంతో మాట్లాడుతున్నా..ఇది నా కుటుంబానికి తెలుసు. కానీ ఈ దేశానికీ తెలియాలి. నాకు 13 ఏళ్ళ వయస్సు ఉండగా.. ఒకరోజు క్రిక్కిరిసిన జనంతో కూడిన బస్సులో ప్రయాణిస్తున్నా.. షార్ట్ ప్యాంట్స్, టీ-షర్ట్ ధరించి టెన్నిస్ ప్రాక్టీస్ చేసి ఆ బస్సులో వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి నాపై లైంగిక దాడి జరిపాడు. నేనా విషయాన్ని ఎవరికీ చెప్పలేకపోయా. ఆ ఘటన నుంచి తేరుకునేందుకు నాకు చాలాకాలం పట్టింది.. ‘ అని డెరెక్ పేర్కొన్నారు. మనం ప్రజలకు చేరువ కావాలంటే ఇలాంటి అంశాలను హైలైట్ చేసేందుకు ఈ ఫోరమ్ (సభ) ను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంత ఎక్కువగా మాట్లాడుకుంటే అంతగా పిల్లలను కాపాడుకోగలుగుతాం అన్నారాయన. తాను శిక్ష గురించి మాట్లాడడం లేదని, మొదట ఈ విధమైన నేరాలను నివారించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. బాలలపై నేరాల అదుపు మీద ఇతర సభ్యులు కూడా ప్రస్తావించాలని ఆయన కోరారు. కాగా-డెరెక్ చేసిన వ్యాఖ్యల పట్ల మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ.. 46 ఏళ్ళ అనంతరం ఈ సభ్యుడు చెప్పిన వాస్తవాన్ని అంతా అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక పిల్లాడిపై సెక్స్యువల్ ఎబ్యూజ్ ప్రభావం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతోందని ఆమె వ్యాఖ్యానించారు. అటు-పోక్సో చట్ట సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.