అసలు ఏమనాలిరా మిమ్మల్ని.. సగటు మనిషిని ఇంతలా మోసం చేస్తున్నారు..
తినే తిండి, తాగే పానీయాలే కాదు.. సుస్తీ చేస్తే వేసుకునే మెడిసిన్స్‌లో కూడా గోల్‌మాల్ జరుగుతోంది. మార్కెట్లో కొనే మందుల్లో ఏది నకిలీ, ఏది అసలు తెలీక జనంలో గందరగోళం, ఆందోళన. కాదేదీ కల్తీకి అనర్హం అన్న రీతిలో రెచ్చిపోతున్నారు నేరగాళ్లు.

ఫైన ఫోటో చూస్తున్నారుగా.. ఎంత చక్కగా ఎంత పరిశుభ్రంగా ఉందో… చూడ్డానికి అదిఏదో పిండిమర ఆడించే ప్రాంతంలా కనిపిస్తోంది కదా! మీరు నమ్మేరు నమ్మకపోయేరు.. ఇదొక ఫార్మా కంపెనీ. చర్మవ్యాధికి డాక్టర్లు రాసిచ్చే కొన్ని ఆయింట్‌మెంట్లు ఇక్కడే తయారయ్యేది. మైదాపిండికి కొన్ని రకాల కెమికల్స్ కలిపితే క్రీములు రెడీ. మెడిసిన్ ఏ కంపోజిషన్‌లో కలుపుతారు, పాకెట్ మీద బ్రాండ్ నేమ్, ఎమ్మార్పీ, ఎక్స్‌పైరీ డేటు అన్నీ చూస్తాం. కానీ, వాటి తయారీ విధానం, అమ్మకంపై నిఘా లేకపోతే ఏమవుతుందో ఇదిగో ఈ నకిలీ డ్రగ్ ఫ్యాక్టరీని చూస్తే తెలిసిపోతుంది.
దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని ఓ ఫ్యాక్టరీని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించి, పక్కా సాంకేతిక ఆధారాలతో దాడులు చేపట్టారు. Betnovate-C, Clop-G లాంటి కొన్ని Schedule-H మెడిసిన్స్ ఇక్కడ దొరికాయి. అలర్జీల్లాంటి చర్మవ్యాధులొస్తే డాక్టర్లు రాసిచ్చే క్రీములివి. కాకపోతే, వాటి మీద లేబుల్సే కరెక్ట్.. లోపలుండే మెడిసిన్ మాత్రం ఫేక్. కొన్ని ప్రమాదకరమైన నాసిరకమైన కెమికల్స్ కలిసి వీటిని తయారు చేస్తున్నారు.
గౌరవ్ భగత్, విశాల్‌గుప్తా అనే ఇద్దరిని అరెస్టు చేశారు. సరైన లైసెన్సుల్లేకుండా యూనిట్ నడుపుతున్నట్టు తేల్చారు. BNS డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 2 కోట్ల 30 లక్షల విలువైన డ్రగ్స్‌తో పాటు ముడి పదార్థాలు, కొంత మెషినరీ, ఖాళీ డబ్బాలు, ప్యాకేజింగ్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఫ్యాక్టరీ కేరాఫ్ మాత్రం ఘజియాబాద్‌లోని లోనీ ప్రాంతం. ఇక్కడి నుంచి ఆన్‌లైన్ ద్వారా దేశంలోని అనేక నగరాలకు ఈ మందులు అమ్ముడౌతున్నట్టు తెలుస్తోంది. వీళ్లకు ఇంకా ఎన్నిచోట్ల బ్రాంచ్‌లున్నాయని ఆరా తీస్తోంది ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్. ఫేక్ మెడిసిన్ రాకెట్‌ని మొత్తాన్ని ఛేదించి, సప్లయ్ చెయిన్‌ని నిర్మూలిస్తామని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్.
ఇప్పటివరకు ఈ నకిలీ క్రీములు ఎక్కడెక్కడికి సరఫరా అయ్యాయ్.. ఎక్కడెక్కడ అమ్ముడయ్యాయ్.. వాటిని వాడినవాళ్లలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయా..? ఇది కదా అసలు ఫికర్. ఎలర్జీని తగ్గించుకోడానికి క్రీములు వాడితే, ఆ క్రీములతోనే కొత్త ఎలర్జీలు పుట్టుకొస్తే…? ముఖ్యంగా ఢిల్లీ జనాలు బెంబేలెత్తిపోతున్నారు.




