Delhi High Court: జడ్జి కొంపముంచిన అగ్నిప్రమాదం! ఇళ్లంతా నోట్ల కట్టలే.. ఫైర్ సిబ్బంది షాక్! అంతా బ్లాక్ మనీ..
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక దళం భారీ మొత్తంలో నగదును కనుగొంది. ఈ ఘటన తరువాత, ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అక్రమార్జన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది, అభిశంసన ప్రక్రియ కూడా పరిశీలనలో ఉంది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడటానికి ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కొలీజియం కోరింది.

ఓ న్యాయమూర్తి ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైర్ సిబ్బందికి కళ్లు బైర్లు కమ్మేలా ఇళ్లంతా నోట్ల కట్టలే కనిపించాయి. అది చూసి వాళ్లు షాక్ అయ్యారు. అదంతా ప్రభుత్వానికి లెక్క చూపని డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంతకీ ఇళ్లంతా నోట్ల కట్టలతో నింపేసిన ఆ న్యాయమూర్తి ఎవరంటే.. ఢిల్లీ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ. జస్టిస్ వర్మ నగరంలో లేని సమయంలో ఆయన అధికారిక నివాసంలో మంటలు చెలరేగాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.
మంటలను ఆర్పిన తర్వాత, అగ్నిమాపక దళ సిబ్బంది బంగ్లాలోని వివిధ గదుల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు కనుగొన్నారు. అయితే జడ్జి ఇంట్లో భారీ మొత్తంలో నగదు బయటపడటంతో భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా కొలీజియం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జస్టిస్ వర్మను తిరిగి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అక్కడ ఆయన గతంలో అక్టోబర్ 2021 వరకు పనిచేశారు. అక్రమార్జన విషయంలో జస్టిస్ వర్మపై దర్యాప్తుకు ఆదేశించడంతో పాటు అభిశంసన ప్రక్రియపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. జస్టిస్ వర్మను బదిలీ చేయడం వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింటుందని, న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం సన్నగిల్లుతుందని కొలీజియంలోని కొందరు న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. జస్టిస్ వర్మ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని వారు కోరారు. ఒక వేళ రాజీనామాకు ఆయన నిరాకరిస్తే, పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
అందుకు నియమాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.. ఏదైనా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై అవినీతి, దుష్ప్రవర్తన, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలను దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు 1999లో ఒక అంతర్గత విధానాన్ని రూపొందించింది. ప్రధాన న్యాయమూర్తి ముందుగా నిందితుడైన న్యాయమూర్తి నుండి వివరణ కోరుతారు. ప్రతిస్పందన సంతృప్తికరంగా లేకుంటే లేదా సమగ్ర దర్యాప్తు అవసరమైతే, చీఫ్ జస్టిస్‌తో పాటు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడిన అంతర్గత ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలి. దర్యాప్తు ఫలితం ఆధారంగా, సంబంధిత న్యాయమూర్తిని రాజీనామా చేయమని లేదా అభిశంసనను ఎదుర్కోవాలని కోరవచ్చు. మరి ఈ విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..