సేఫ్టీ పిన్‌కు ఆ రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా..? దీని వెనుకున్న సైన్స్ తెలిస్తే బిత్తరపోతారు..
కేవలం 15 డాలర్ల అప్పు తీర్చడం కోసం పుట్టిన ఒక చిన్న ఐడియా.. ప్రపంచాన్నే ఎలా మార్చేసిందో తెలుసా? కాలం మారినా, టెక్నాలజీ ఎంత పెరిగినా.. గత 175 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అస్సలు డిజైన్ మారని ఒకే ఒక్క వస్తువు సేఫ్టీ పిన్. బట్టలు ఊడిపోకుండా పట్టుకునే ఈ చిన్న పిన్ వెనుక అద్భుతమైన ఫిజిక్స్ దాగి ఉంది. అసలు దానికి వెనక రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా..?

మన నిత్యజీవితంలో బట్టలు ఊడిపోకుండా ఉండటానికైనా, అత్యవసర సమయాల్లో దేన్నైనా తాత్కాలికంగా జతచేయడానికైనా సేఫ్టీ పిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ చిన్న పిన్ చరిత్ర చాలా పురాతనమైనదని ఎంతమందికి తెలుసు..? దీని మూలాలు కంచుయుగం నాటి ఐరోపాలో ఉన్నట్లుగా చరిత్రకారులు చెబుతారు. రోమన్లు, గ్రీకులు తమ వస్త్రాలను అలంకరించుకోవడానికి, పట్టి ఉంచడానికి దీనిని వాడేవారు. లాటిన్ భాషలో దీనిని ఫిబులే అని పిలిచేవారు. శతాబ్దాల క్రితమే దీని వాడకం ఉన్నప్పటికీ, నేడు మనం చూస్తున్న ఆధునిక సేఫ్టీ పిన్ రూపకల్పన వెనుక ఒక ఆసక్తికరమైన కథ మరియు అద్భుతమైన మెకానిజం దాగి ఉన్నాయి.
అప్పు కోసం సృష్టించి..
మనం ఇప్పుడు వాడుతున్న ఆధునిక సేఫ్టీ పిన్‌ను 1849లో అమెరికాకు చెందిన మెకానిక్, ఆవిష్కర్త వాల్టర్ హంట్ కనుగొన్నారు. అయితే ఈ ఆవిష్కరణ వెనుక ఒక విచిత్రమైన కారణం ఉంది. వాల్టర్ హంట్ తన స్నేహితుడికి కేవలం 15 డాలర్ల అప్పు పడ్డారు. ఆ అప్పును ఎలాగైనా తీర్చాలనే ఆలోచనలో ఉన్న ఆయన, చేతిలో ఉన్న ఒక సాధారణ ఎనిమిది అంగుళాల ఇత్తడి తీగను ముక్కలు చేసి వంచుతూ రకరకాలుగా ప్రయోగాలు చేశారు. అలా ఒక తీగను వంచి, దానికి స్ప్రింగ్ అమర్చి, పదునైన భాగం గుచ్చుకోకుండా ఒక మూత లాంటి నిర్మాణాన్ని సృష్టించారు. ఇదే ప్రపంచంలోనే మొట్టమొదటి సురక్షితమైన పిన్‌గా మారింది. ఆ తర్వాత దీని పేటెంట్ హక్కులను ఆయన కేవలం 400 డాలర్లకు ఒక కంపెనీకి అమ్మేసి తన అప్పు తీర్చుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ కంపెనీ ఈ పిన్స్ ద్వారా మిలియన్ల డాలర్లు సంపాదించడం విశేషం.
చారిత్రకంగా చూస్తే, ఈ పిన్‌లను తయారు చేయడానికి గతంలో రెండు ప్రధాన పద్ధతులను వాడేవారు. వాటిలో మొదటిది ఉత్తర ఐరోపా పద్ధతి. దీని ప్రకారం సూదికి రెండు వేర్వేరు భాగాలు ఉండేవి. కానీ దానికి ఎలాంటి స్ప్రింగ్ ఉండేది కాదు. ఒక సూదికి రంధ్రం ఉంటే, రెండవ సూది ఆ రంధ్రం గుండా వెళ్లి ఒక కొక్కేనికి జతచేయబడి ఉండేది. ఇది చూడటానికి, వాడటానికి చాలా సంక్లిష్టమైన రూపకల్పనగా ఉండేది. దీనికి భిన్నంగా మధ్య ఐరోపా, గ్రీకు, ఇటాలియన్ శైలిలో ఉపయోగించిన సూదులు మన ఆధునిక సేఫ్టీ పిన్‌లను పోలి ఉండేవి. ఈ సూదిని మధ్యలో స్ప్రింగ్ ఉన్న ఒకే ఒక్క తీగతో తయారు చేసేవారు. తీగ ఒక చివర పదునుగా ఉంటే, ఆ పదునైన భాగం బయటకు రాకుండా లాక్ చేయడానికి వీలుగా మరొక చివర వంగి ఉండేది.
రంధ్రం ఎందుకంటే..?
మీరు ఎప్పుడైనా సేఫ్టీ పిన్‌ను దగ్గరగా చూసి ఉంటే, దాని నిర్మాణం, పని చేసే విధానం చాలా సరళంగా ఉన్నప్పటికీ, దాని వెనుక ఉన్న ఫిజిక్స్ చాలా భిన్నంగా ఉంటుందని గమనించవచ్చు. దీనికి రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. ఇవి దాని పనితీరుకు అత్యంత అవసరం. పిన్ అడుగు భాగంలో ఉన్న తీగను ఒక ఉచ్చులా లేదా చుట్టలా వంచుతారు. ఈ రంధ్రం ఒక అద్భుతమైన స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది. ఈ స్ప్రింగే పిన్‌పై నిరంతరం ఒత్తిడిని సృష్టిస్తుంది. మనం పిన్‌ను లాక్ చేసినప్పుడు, ఆ ఒత్తిడి వల్ల పిన్ కొన గట్టిగా పట్టుకోబడుతుంది. ఒకవేళ ఈ అడుగు భాగంలో స్ప్రింగ్ ఒత్తిడి లేకపోతే, పిన్ పదేపదే తెరుచుకుని, ఎదుటివారికి గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే దీనిని సేఫ్టీ పిన్ అని పిలిచారు.
నిజానికి వాల్టర్ హంట్ ఈ పిన్‌ను కనుగొనడానికి ముందే క్లాత్ పిన్స్ ఉండేవి కానీ వాటి పదునైన మునలు బయటకే ఉండటం వల్ల బట్టలు చిరిగిపోవడమే కాకుండా శరీరానికి గుచ్చుకుని రక్తం వచ్చేది. హంట్ కనిపెట్టిన ఈ డిజైన్‌లో పదునైన అంచు సురక్షితంగా లోపల దాగి ఉండటం వల్ల దీనికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభించింది. కాలం మారినా టెక్నాలజీ ఎంత పెరిగినా.. గత 175 ఏళ్లుగా ఈ చిన్న సేఫ్టీ పిన్ డిజైన్‌లో ఎలాంటి మార్పు రాలేదంటేనే దీని అద్భుతమైన రూపకల్పన ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.
