Delhi: సత్తా చాటిన ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు.. జేఈఈ, నీట్ ర్యాంకులు కొట్టిన స్టూడెంట్స్..
ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. సీబీఎస్ఈ విడుదల చేసిన నీట్, జేఈఈ ఫలితాల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి..
ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. సీబీఎస్ఈ విడుదల చేసిన నీట్, జేఈఈ ఫలితాల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కష్టపడి చదివితే సాధించలేనిది లేదని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యనందిస్తున్నామని వివరించారు. ఫలితంగా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయని వెల్లడించారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో నాణ్యమైన విద్య అందడంతోనే 1,141 మంది విద్యార్థులు జేఈఈ, నీట్ ఎగ్జామ్స్‌లో పాసయ్యారని సీఎం చెప్పారు. ఢిల్లీ త్యాగరాజ్ స్టేడియంలో JEE, NEETలో టాపర్లను నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చదువు మాత్రమే భారతదేశాన్ని ప్రపంచంలో అత్యుత్తమంగా మార్చగలదని చెప్పారు.
నేను ఐఐటీ జేఈఈలో 563వ ర్యాంకు సాధించాను. కానీ ఇవాళ ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి 569 వ ర్యాంకు సాధించిన విద్యార్థిని కలిశాను. నెలకు 12 వేల రూపాయలు సంపాదించే ఒక సెక్యూరిటీ గార్డ్ కుమారుడి ప్రారంభ జీతమే రూ.2 లక్షలు ఉంటోంది. దీని వల్ల ఆ కుటుంబానికి ఉన్న పేదరికం తొలగిపోతుంది. దేశంలో ఉన్న పిల్లలందరూ ఇలా కష్టపడి చదువుకుంటే ప్రతి కుటుంబం కూడా ధనవంతుల కుటుంబం అవుతుంది. గవర్నమెంట్ స్కూల్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టి బడ్జెట్‌లో 25శాతం నిధులు కేటాయించాం. ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉండేలా అక్కడి విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాం.
– అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
కాగా.. దేశంలోనే తొలి వర్చువల్ పాఠశాలను ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ గతంలో ప్రారంభించారు. ఈ స్కూల్ లో చేరేందుకు దేశంలోని 13 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్థులందరూ అర్హులేనని ప్రకటించారు. దూరభారం, బాలికలను పాఠశాలకు పంపించలేకపోవడం వంటి కారణాలతో మధ్యలోనే చదువు మానేసే వారికి, డ్రాపవుట్ గా మారే వారికి ఈ వర్చువల్ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. తరగతులు ఆన్‌లైన్‌లోనే (Online) జరుగుతాయని వివరించారు. విద్యార్థుల అటెండెన్స్, పరీక్షలు వర్చువల్మోడ్లో జరిగుతాయి. కాపీ కొట్టేందుకు అవకాశం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. వర్చువల్ స్కూల్స్‌లో ఇంగ్లీష్, హిందీ మీడియాల్లో టీచింగ్ జరగనుంది.