AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Gang War: ఢిల్లీ గ్యాంగ్‌వార్‌లో హతమైన జితేందర్‌ గోగి ఎవరు.? దశాబ్ద కాలంగా టిల్లుతో ఆధిపత్య పోరెందుకు..?

Delhi Gang War: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో శుక్రవారం గ్యాంగ్‌వార్‌ జరిగి మోస్ట్‌వాంటెడ్‌ జితేందర్‌తో పాటు మరో ముగ్గురు హతమయ్యారు..

Delhi Gang War: ఢిల్లీ గ్యాంగ్‌వార్‌లో హతమైన జితేందర్‌ గోగి ఎవరు.? దశాబ్ద కాలంగా టిల్లుతో ఆధిపత్య పోరెందుకు..?
Subhash Goud
|

Updated on: Sep 24, 2021 | 9:26 PM

Share

Delhi Gang War: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో శుక్రవారం గ్యాంగ్‌వార్‌ జరిగి మోస్ట్‌వాంటెడ్‌ జితేందర్‌తో పాటు మరో ముగ్గురు హతమయ్యారు. అడ్వకేట్ ముసుగులో కోర్టు ఆవ‌ర‌ణ‌లోకి వ‌చ్చిన ఇద్దరు దుండ‌గులు.. ఢిల్లీలోనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ జితేంద‌ర్‌ను కాల్చి చంపారు. రెండు గ్యాంగ్‌లు కాల్పులు జరుపుకోవడంతో జితేందర్‌తో పాటు నలుగురు మృతి చెందారు. న్యాయ‌మూర్తి వ‌ద్ద జితేంద‌ర్‌ను ప్రవేశ‌పెట్టేందుకు వ‌చ్చిన స‌మ‌యంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో గ్యాంగ్ స్టర్ జితేంద‌ర్ లాయ‌ర్ కు తీవ్ర గాయాలైన‌ట్లు తెలుస్తోంది. ఏకంగా న్యాయస్థానం ఆవరణలోనే మారణహోమం సృష్టించడం సంచలనంగా మారింది. మోస్ట్‌ వాండెటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ గోగిని కోర్టు ప్రాంగణంలోనే పట్టపగలు ప్రత్యర్థులు దారుణంగా కాల్చి చంపడం సంచనలంగా మారింది. దుండగులు 35 నుంచి 40 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్టు పోలీసులు చెప్పారు.

కాగా, మోస్ట్‌వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ గోగి, టిల్లు తాజ్‌పూరియా ఒకప్పుడు స్నేహితులుగా ఉండేవారు. కాలేజీ స్టూడెంట్‌ యూనియన్‌ ఎన్నికలు వీరిద్దరి మధ్య విభేదాలకు దారితీశాయి. 2010లో ఔటర్‌ ఢిల్లీలో జరిగిన కాలేజీ విద్యార్థి యూనియన్‌ ఎన్నికల్లో వీరిద్దరి మధ్య మొదలైన గొడవలు గ్యాంగ్‌వార్‌గా మారాయి. 2018లో బూరారీ ప్రాంతంలో ఈ రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవల్లో ముగ్గురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. రెండు ముఠాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఇప్పటివరకు 100 మందికి పైగా మరణించారని సమాచారం.

జితేందర్‌ గోగి ఎవరు.?

గ్యాంగ్‌స్టర్‌ జితేంద్ర అలియాన్‌ గోగి.. ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని అలీపూర్‌ ప్రాంతానికి చెందినవాడు. పోలీసులు టాప్‌ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో జితేందర్‌ పేరు ముందుంది. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తను తీహార్‌ జైలు నుంచి బెదిరించడంతో మరింతగా వార్తల్లోకెక్కాడు. జైలు లోపల నుంచే హత్యలకు ప్రణాళికలు రచించినట్లు ఆరోపణలున్నాయి. మూడుసార్లు జైలు నుంచి పారిపోయాడు కూడా. 2016, జూలై 30న బహదూర్‌గఢ్‌లో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. గత సంవత్సరం మార్చి 3న గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 82లో జితేంద్రను పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజు రోహిణి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యేందుకు వెళుతుండగా ప్రత్యర్థుల దాడిలో హతం అయ్యాడు.

దశాబ్ద కాలంగా గ్యాంగ్‌వార్‌:

కాగా, టిల్లు తాజ్‌పురియా కూడా తీహార్‌ జైలులో ఉన్నాడు. జైలు నుంచే ముఠా కార్యాలపాలు నడిపించినట్లు ఆరోపణలున్నాయి. 2010 నుంచి జింతేందర్‌, టిల్లు ముఠాల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నా 2013లో జరిగిన ఘటనతో గ్యాంగ్‌వార్‌ మరింత తీవ్రమైంది. ఢిల్లీకి డాన్‌గా చెప్పుకునే మరో గ్యాంగ్‌స్టర్‌ నీతూ దబోడియా అప్పట్లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. దీంతో జితేంద్ర గోగి, టిల్లు తాజ్‌పురియా మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. దశాబ్ద కాలంగా రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌వార్‌ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్‌ 206లో ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో జితేంద్ర హతమయ్యాడు.

జితేందర్‌పై 19 కేసులు:

రెండు గ్యాంగ్‌ల మధ్య విభేదాలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. కోర్టుకు వచ్చిన జితేందర్‌ టార్గెట్‌గా ఈ కాల్పులు జరిగాయి. అడ్వాకేట్ యూనిఫారమ్స్‌లో వచ్చిన ఇద్దరు ప్రత్యర్థులు కాల్పులకు తెగబడ్డారు. 30 ఏళ్ల జితేందర్‌ గత ఏప్రిల్‌లో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్ట్ ఎంసీవో సీఏ కింద అరెస్టు అయ్యారు. హత్యలు, హత్యాయత్నం సహా మొత్తం 19 కేసులు జితేందర్‌పై ఉన్నాయి.

జితేందర్‌పై రూ.20 లక్షల రివార్డ్‌:

కాగా గ్యాంగ్‌స్టర్ జితేందర్ అలియాస్ గోగిపై ఢిల్లీ ప్రభుత్వం రూ.10 లక్షలు, హర్యానా ప్రభుత్వం రూ.10 లక్షలు మొత్తంగా రూ.20 లక్షలు రివార్డును గతంలో ప్రకటించడం జరిగింది.

ఇవీ కూడా చదవండి:

Gangster Jitender: ఢిల్లీ కోర్టు ఆవరణలో గ్యాంగ్‌వార్‌.. కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌తో పాటు నలుగురు మృతి

Errabelli Dayakar Rao: రోడ్డు ప్రమాదంలో మంత్రి ఎర్రబెల్లికి తప్పిన ముప్పు.. కాన్వాయ్‌ను ఢీకొన్న బైక్‌!