నెలకు 85 లక్షల డోసుల వ్యాక్సిన్ ఇవ్వండి, ప్రజలందరికీ 3 నెలల్లో వ్యాక్సినేషన్ చేస్తాం , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
నెలకు తమకు 85 లక్షల డోసుల వ్యాక్సిన్ ఇచ్చిన పక్షంలో ఢిల్లీ ప్రజలందరికీ 3 నెలల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం ప్రతి రోజూ లక్ష వ్యాక్సిన్ డోసులు ఇస్తున్నట్టు ఆయన చెప్పారు
నెలకు తమకు 85 లక్షల డోసుల వ్యాక్సిన్ ఇచ్చిన పక్షంలో ఢిల్లీ ప్రజలందరికీ 3 నెలల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం ప్రతి రోజూ లక్ష వ్యాక్సిన్ డోసులు ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. పొరుగునున్న ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్, సోనిపట్ తదితర జిల్లాలనుంచి ప్రజలు ఇక్కడికి వఛ్చి వ్యాక్సిన్ తీసుకుంటున్నారని, ఇక్కడ ఏర్పాట్లు బాగుండడమే ఇందుకు కారణమని ఆయన చెప్పారు. కానీ తమ వద్ద తగినన్ని టీకామందులు లేకపోవడం ఓ కొరతగా మారిందన్నారు. నగరంలో 18-44 ఏళ్ళ మధ్యగల వయస్కులు కోటిమంది ఉన్నారని, మూడు నెలల కాలానికి గాను తమకు 2.6 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరమని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.థర్డ్ వేవ్ కోవిడ్ తప్పదని అంటున్నారని, అందువల్ల వ్యాక్సిన్ డ్రైవ్ ని వేగవంతం చేయాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం 18-44 ఏళ్ళ మధ్య వయస్సు వారికి నగరంలోని సుమారు 100 స్కూళ్లలో వ్యాక్సిన్ ఇస్తున్నామని ఆయన చెప్పారు.ఈ సంఖ్యను 300 కి పెంచాలన్న లక్ష్యం ఉందన్నారు. ఇప్పుడు తమ నగరానికి వ్యాక్సిన్ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఆక్సిజన్ బెడ్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ప్రతి రోగికీ ఈ సౌకర్యం లభిస్తుందన్నారు. ఢిల్లీకి ప్రతి రోజూ 700 టన్నుల ఆక్సిజన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్నిఆదేశించిన సంగతి విదితమే. దీంతో ఈ నగరానికి ప్రాణవాయువు కొరత తీరింది.ఇలా ఉండగా గత 24 గంటల్లో ఢిల్లీ నగరంలో 341 మంది కోవిడ్ రోగులు మరణించారు. 19,832 కేసులు నమోదయ్యాయి. మొత్తం 91 వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇక దేశంలో మొత్తంకేసుల సంఖ్య 4,01,078 కేసులు నమోదయ్యాయి.4,187 మంది రోగులు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,38,270 కి పెరిగింది. రికవరీ రేటు కూడా తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాల నుంచి ఇండియాకు భారీ ఎత్తున సాయం అందుతున్నా దాన్ని వినియోగించుకోవడంలో చాలా జాప్యం జరుగుతోంది. అసలు ఈ సాయమంతా విమానాశ్రయాల్లోనే మూలుగుతోందా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. దీని వినియోగానికి కేంద్రం పకడ్బందీ ఏర్పాట్లు చేయడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Rain Alert: చల్లని కబురు.. ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజులపాటు వర్షాలు.. ఎక్కడెక్కడ అంటే..?