Delhi Rains: ఢిల్లీలో వరద కష్టాలు.. మళ్లీ ముంచెత్తుతున్న వర్షాలు.. 10 వేల సాయం ప్రకటించిన సీఎం..
ఢిల్లీలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. యమునా నది ప్రవాహం తగ్గుముఖం పట్టినప్పటికి ఇంకా చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఇవాళ కూడా భారీ వర్షం పడటంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. వరదలో చిక్కుకున్న ప్రాంతాల్లో నీటిని తోడేయడానికి అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు.
ఢిల్లీలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. యమునా నది ప్రవాహం తగ్గుముఖం పట్టినప్పటికి ఇంకా చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఇవాళ కూడా భారీ వర్షం పడటంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. వరదలో చిక్కుకున్న ప్రాంతాల్లో నీటిని తోడేయడానికి అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు. అయితే, వరద బాధితులకు రూ. 10వేల చొప్పున సాయం ప్రకటించారు సీఎం కేజ్రీవాల్.
ఢిల్లీలో నేవీ కూడా చాలా ప్రాంతాల్లో వరదనీటిని తోడేస్తొంది. ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నదీ తీరాన ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటిలోనే బిక్కుబిక్కుమంటున్నాయి. ఇప్పటికే వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్యవసర సేవల కార్యాలయాలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలను మూసివేశారు. రహదారులపై భారీగా వర్షం నీరు జమ కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇళ్లు, ఆస్పత్రులు, శ్మశానవాటికల్లోకీ వరద నీరు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. రిలీఫ్ క్యాంప్‌ల్లో ఉన్న వరదబాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వరధ బాధితులకు ధైర్యం చెప్పారు సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో ఇప్పటికి కూడా రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. ఇళ్లు, ఆస్పత్రులు, శ్మశానవాటికలు, షెల్టర్ హోమ్ లోకి కూడా వరద నీరు చేరింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాజ్‌ఘాట్ నుంచి సచివాలయం రోడ్డంతా వర్షం నీటితో నిండిపోయింది.
ఇండియా గేట్, మయూర్ విహార్, కాశ్మీరీ గేట్, ఐటిఒ, మజ్ను కటిలా, లోహపూల్, సరితా విహార్, సివిల్ లైన్స్ ప్రాంతాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఈ ప్రాంతాల్లో వరద నీరు బయటకు వెళ్లాలంటే మరో రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు ఎర్రకోట వెనుక ప్రాంతం వరదకు గురైంది. అయితే, మరో ఐదు రోజుల పాటు వర్షాలు ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత స్థానాలకు తరలించేందుకు చర్యలు వేగవంతం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..