AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌.. నేడు సుప్రీం కోర్టులో విచారణ!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్‌ వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (55)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం (మార్చ 21) ఆయన నివాసంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ ఆయనను అదుపులోకి తీసుకోవడం..

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌.. నేడు సుప్రీం కోర్టులో విచారణ!
Delhi Cm Arvind Kejriwal
Srilakshmi C
|

Updated on: Mar 22, 2024 | 7:34 AM

Share

న్యూఢిల్లీ, మార్చి 22: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్‌ వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (55)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం (మార్చ 21) ఆయన నివాసంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ ఆయనను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు గురువారం రాత్రికే పిటీషన్‌పై సుప్రీంను అత్యవసర విచారణ కోరగా అది జరగలేదు. కేజ్రీవాల్‌కు ఈ రోజు (శుక్రవారం) ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

కాగా సిట్టింగ్‌ ముఖ్యమంత్రి అరెస్టు కావడం దేశ చరిత్రలోనే తొలిసారి. దీంతో ఈ పరిణామం సంచలనాత్మకంగా మారింది. ఢిల్లీ లిక్కర్‌ కేసు విషయమై ఇప్పటికే తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గతవారం ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం అదనపు డైరెక్టర్‌ నేతృత్వంలో 12 మంది ఈడీ అధికారులు సెర్చ్‌ వారెంట్‌తో ఢిల్లీ ఫ్లాగ్‌స్టాఫ్‌ రోడ్‌లోని కేజ్రీవాల్‌ అధికారిక నివాసానికి చేరుకుని సోదాలు నిర్వహించి సమన్లు అందించారు. అనంతరం రాత్రి 9.11 గంటల సమయంలో ఆయనను అరెస్టు చేశారు. రాత్రి 11 గంటలకు ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేజ్రీవాల్‌ నివాసం వద్ద స్థానికంగా 144 సెక్షన్‌ విధించారు. నినాదాలు చేస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

లిక్కర్‌ స్కామ్‌లో కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటిదాకా 9 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే కేజ్రీవాల్‌ ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. గురువారం కూడా విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. తనకు సమన్లు జారీ చేయడం చట్టవిరుద్ధమని వెళ్లలేదు. ఈడీ తనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ‘రెండు వైపులా వాదనలు విన్నాం. ఈ దశలో ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని’ జస్టిస్ సురేష్ కుమార్ కైట్, జస్టిస్ మనోజ్ జైన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కేజ్రీవాల్‌ అరెస్టు అయినప్పటికీ ఢిల్లీ సీఎంగా కొనసాగుతారని, అవసరమైతే జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఆమ్‌ ఆద్మీ సీనియన్‌ నేత అతీషి ప్రకటించారు. కేజ్రీవాల్‌ అరెస్టును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఖండించారు. ప్రతిపక్ష నేతలను మోదీ ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.