Delhi Blast: ఢిల్లీ పేలుడు వెనుక షాకింగ్ నిజాలు.. ఆ భయంతో బాంబు తరలిస్తుండగా..!
దేశ రాజధాని ఢిల్లీని కుదిపేసిన పేలుడు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పేలుడుకు సూత్రధారిగా భావిస్తున్న డా. ఉమర్ మహ్మద్, ఫరీదాబాద్‌లో తన సహచరులు పట్టుబడటంతో భయాందోళనకు గురయ్యాడు. దీంతో అసంపూర్తి IEDని తరలిస్తుండగా ప్రమాదవశాత్తూ పేలిందా? లేదా పట్టుబడతామనే భయంతో ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన.. అంతకుముందు ఫరీదాబాద్‌లో భగ్నం చేసిన ఉగ్రకుట్రతో ముడిపడి ఉన్నట్లు భద్రతా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఈ పేలుడుకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డా. ఉమర్ మహ్మద్ తన సహచరులు అరెస్ట్ కావడంతో భయాందోళనకు గురై ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ పేలుడులో సుమారు 12 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. పేలిన కారులో డా.ఉమర్ మహ్మద్ ఒంటరిగా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీలు సూచిస్తున్నాయి.
ఫరీదాబాద్‌లోని తన సహచరులు డా. ముజామిల్ షకీల్, డా. ఆదీల్ అహ్మద్ రథర్ అరెస్టు కావడంతో ఉమర్ భయాందోళన చెందాడు. పేలుడు పదార్థాలపై ఆందోళన చెంది తాను కూడా పట్టుబడతాననే భయంతో ఆత్మహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. సంఘటన జరిగిన సమయంలో అసంపూర్తిగా ఉన్న ఐఈడీ బాంబును మరోచోటుకు తరలిస్తుండగా లేదా దానిని రోడ్డుపై విసిరేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్, డిటోనేటర్లను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం డా. ఉమర్ మృతదేహాన్ని ధృవీకరించడానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
డాక్టర్ల ముసుగులో విధ్వంస కుట్ర
ఈ పేలుడుకు కొద్ది గంటల ముందు ఫరీదాబాద్‌లో ఒక భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. అరెస్ట్ అయిన వారిలో డాక్టర్ ఉమర్‌కు సన్నిహితులైన డా. ముజామిల్ షకీల్ డా. ఆదీల్ అహ్మద్ రథర్‌తో పాటు మరికొంత మంది ఉన్నారు. వీరంతా జేష్-ఎ-మహ్మద్, అన్సార్ గజ్వత్-ఉల్-హింద్ వంటి ఉగ్ర సంస్థలకు చెందినవారని అధికారులు చెబుతున్నారు. డా. షకీల్‌కు సంబంధించిన ఇంటి నుంచి సుమారు 2,900 కిలోల IED తయారీకి ఉపయోగపడే పదార్థాలు, రైఫిళ్లు, పిస్టల్స్, టైమర్‌లు, రిమోట్ కంట్రోల్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు తయారుచేసినవని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








