AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేడి లేదా చల్లని.. చలికాలంలో ఏ నీళ్లతో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది..?

Cold vs Hot Water Bath: చలికాలం వచ్చేసింది.. ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి నీటితో స్నానం చేయడం చాలా మందికి అలవాటు. అయితే చలికాలంలో స్నానానికి వేడి నీటిని వాడడం సరైనదేనా..? లేదంటే చల్ల నీళ్లే మంచివా..? అనే సందేహాలు చాలా మందికి వస్తాయి. చర్మం, ఆరోగ్యానికి ఏది మంచిదో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వేడి లేదా చల్లని..  చలికాలంలో ఏ నీళ్లతో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది..?
Cold Vs Hot Water Bath
Krishna S
|

Updated on: Nov 12, 2025 | 6:59 AM

Share

చలికాలంలో వేడి నీటితో స్నానం చేయడం వలన శరీరానికి రిలీఫ్ ఉంటుంది. కండరాల నొప్పులు, అలసట నుండి విముక్తి కలుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఇది తాత్కాలికంగా హాయిగా అనిపించినప్పటికీ, దీని వలన కొన్ని అనారోగ్యాలు సంభవించే ప్రమాదం ఉంది.

చర్మానికి ప్రమాదం

అతిగా వేడి నీరు చర్మం సహజ రక్షణ పొరలను దెబ్బతీస్తుంది. దీని ఫలితంగా చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చర్మం ఇప్పటికే పొడిగా ఉన్నవారు వేడి నీటిని వాడితే, అది చర్మశోథ, తామర ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది చర్మం యొక్క సహజ నూనెలను తొలగిస్తుంది. వేడి నీరు జుట్టును కూడా దెబ్బతీసి పొడిగా మార్చే అవకాశం ఉంది.

చల్లటి నీరు ప్రాణాంతకమా..?

అధిక చలిలో శరీరంపై అకస్మాత్తుగా చల్లటి నీరు పడితే అది ప్రమాదకరం కావచ్చు. శరీరం అతి చల్లటి నీటిని తాకినప్పుడు, రక్త నాళాలు వెంటనే సంకోచిస్తాయి. దీని వల్ల రక్తపోటు, గుండె స్పందన రేటు అకస్మాత్తుగా పెరిగి, ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

గోరువెచ్చని నీరే ఉత్తమం

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చలికాలంలో స్నానం చేయడానికి గోరువెచ్చని నీరు అత్యంత ఉత్తమమైనది. గోరువెచ్చని నీరు చల్లదనాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో చర్మానికి హాని కలిగించకుండా సహజ నూనెలను కాపాడుతుంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. వైద్యులు సూచించినట్లు, శీతాకాలంలో అయినా వేసవిలో అయినా స్నానానికి గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. అతి వేడి నీటిని నివారించాలి. చలికాలంలో స్నానం చేసిన వెంటనే చర్మం పొడిబారకుండా ఉండటానికి తప్పనిసరిగా మాయిశ్చరైజర్‌‌ను ఉపయోగించాలి.

బోరుబావుల నీరు వాడటం సురక్షితమేనా?

గ్రామీణ ప్రాంతాలలో కొన్నిసార్లు చేతి పంపులు లేదా బోరుబావుల నుండి వచ్చే నీరు వెచ్చగా ఉంటుంది. దీనితో వేడి చేయకుండా స్నానం చేస్తారు. అయినప్పటికీ ఈ నీటి వలన కొన్నిసార్లు చర్మపు చికాకు, దురద సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఉపయోగిస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

ఈ చలికాలంలో మీ చర్మం, గుండె ఆరోగ్యం కోసం అతి వేడి స్నానాలకు దూరంగా ఉండండి. గోరువెచ్చని నీటితో స్నానం చేసి, మాయిశ్చరైజర్ వాడటం ద్వారా చలికాలపు పొడిబారడం నుండి మీ చర్మాన్ని రక్షించుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..