- Telugu News India News Deadly Uttarakhand flash flood cuts off key roads, bad weather hits rescue operations
ప్రకృతి ప్రకోపానికి ఉత్తరకాశీ విలవిల.. పేకమేడల్లా కుప్పకూలిన భవనాలు.. కొట్టుకుపోయిన జనం!
ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్. ఒక్కసారే పది సెంటీమీటర్ల వర్షపాతం. ఆకాశానికి చిల్లుపెడితే కురిసిన కుండపోత. ఆతర్వాత ఎప్పుడూ కనీ వినీ ఎరుగనీ విపత్తు.. ఉత్తరాఖండ్‌లోని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలీ గ్రామం మెరుపు వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది. సముద్రం మీద పడిందా అన్న స్థాయిలో క్లౌడ్ బరస్ట్ అయింది. దీంతో నీరు, అక్కడున్న మట్టి కలిసి పెద్ద ఎత్తున బురద వరద ధరాలిని కప్పేసింది. అందమైన గ్రామం ఇప్పుడు మట్టి దిబ్బను తలపిస్తోంది.
Updated on: Aug 06, 2025 | 12:40 PM

ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉత్తర కాశీలో వరదల కారణంగా ఓ గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. వరదల ధాటికి ఇళ్లు, హోటళ్లు కుప్ప కూలిపోయాయి. అనేకమంది గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద బీభత్సం తీవ్ర విషాదాన్ని నింపింది. అకస్మాత్తుగా ముంచెత్తిన వరదల్లో నలుగురు చనిపోగా.. 60-70 మంది వరకు వరదల్లో చిక్కుకుపోయినట్లు సమాచారం. ఇప్పటి వరకు సహాయక బృందాలు 12 మంది మృతదేహాలను వెలికి తీశాయి. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

వరదల్లో హర్షిల్‌లోని సైనిక శిబిరం కొట్టుకుపోయిగా.. 10 మందికిపైగా జవాన్లు గల్లంతయ్యారు. అయితే ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. వరదల్లో గల్లంతైన వారి గురించి ఇంకా పూర్తి స్థాయిలో కచ్చితమైన సమాచారం లేదంటున్నారు అధికారులు. ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురదతో కూడిన వరద.. కింద ప్రాంతంలోని ధరాళీ గ్రామం వైపుకు దూసుకొచ్చింది. వరద ధాటికి 3, 4 అంతస్తుల భవనాలు సైతం పేక మేడల్లా కూప్పకూలిపోయాయి. వరద ధాటికి కొట్టుకుపోయాయి. వరద తాకిడికి గ్రామంలో 20-25 హెటళ్లు, హోంస్టేలు కూడా కొట్టుకుపోయాయి.

ఆకస్మిక వరదలపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోపం లేకుండా చూడాలని సీఎం పుష్కర్‌సింగ్ ధామికి ఫోన్‌లో సూచించారు. సహాయక చర్యల కోసం 150 మంది సైనికులను సంఘటనా స్థలానికి పంపినట్లు ఆర్మీ వెల్లడించింది.

ఉత్తరకాశీలోని హర్సిల్ ప్రాంతంలోని ఖీర్గఢ్లో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. వరదల వల్ల ఇప్పటికే చాలా మంది ప్రజలు దిగ్బంధంలో ఉన్నారు. పరిస్థితి భయానకంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు సూచించారు.

మరోవైపు ఉత్తరకాశికి 20 కి.మీ ముందు నలు పానిలో పెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీని కారణంగా పర్వతం నుంచి భారీ శిథిలాలు రోడ్డుపై పడి రాకపోకలు బంద్ అయ్యాయి. భట్వారీలో దాదాపు 150 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయిందని, దీని కారణంగా రోడ్డు పూర్తిగా మూసుకుపోయింది. దీంతో అనేక బృందాలు మార్గమధ్యలో చిక్కుకున్నాయి. రక్షణ కోసం ధరాలికి వస్తున్న ITBP జవాన్లు మనేరి సమీపంలో చిక్కుకున్నారు.

. భట్వారీలో దాదాపు 150 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయిందని, దీని కారణంగా రోడ్డు పూర్తిగా మూసుకుపోయింది. దీంతో అనేక బృందాలు మార్గమధ్యలో చిక్కుకున్నాయి. రక్షణ కోసం ధరాలికి వస్తున్న ITBP జవాన్లు మనేరి సమీపంలో చిక్కుకున్నారు.

ఆగస్టు 10 వరకు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో స్థానికులు, పర్యాటకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. కొండ చరియలు విరిగిపడే ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు.




