చూస్తే చిన్న చిన్న పొట్లాలే.. వాటి విలువ అక్షరాలా రూ.100 కోట్లు.. మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులౌట్!
పంజాబ్ రాష్ట్ర సరిహద్దు మార్గంలో పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.100 కోట్లకుపైగా విలువ చేసే మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఈ దాడిలో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. జల మార్గాల ద్వారా పాకిస్థాన్ నుంచి డ్రగ్స్‌ను ఈ ముఠా రవాణా చేసుకున్నట్లు తెలుస్తుంది..
చండీగఢ్, అక్టోబర్ 28: పాకిస్థాన్ నుంచి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసే ముఠాను పోలీసులు చాకచక్యంగా అదివారం అరెస్ట్ చేశారు. సరిహద్దుల్లో డ్రగ్స్ రాకెట్‌ను నడుపుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఈ ముఠాను పంజాబ్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వీరి నుంచి దాదాపు105 కిలోల హెరాయిన్‌ను సీజ్ చేశారు. పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ మాట్లాడుతూ..
పాకిస్థాన్ నుంచి డ్రగ్స్‌ను రవాణా చేయడానికి ఈ ముఠా జల మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. తుర్కియే కేంద్రంగా పనిచేసే డ్రగ్స్ స్మగ్లర్ నవ్ భులార్ ముఠాలోని నవ్‌జ్యోత్ సింగ్, లవ్‌ప్రీత్ కుమార్ అనే ఇద్దరిని ఈ ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని అమృత్‌సర్‌లోని బాబా బకాలాలోని గురు తేజ్ బహదూర్ కాలనీ నివాసి నవజ్యోత్ సింగ్, కపుర్తలాలోని కాలా సంఘియాన్ నివాసి లవ్‌ప్రీత్ కుమార్‌గా గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. హెరాయిన్‌తోపాటు సుమారు 32 కిలోల కెఫీన్ ఎన్‌హైడ్రస్, 17 కిలోల డెక్స్‌ట్రోమెథార్ఫాన్ (డీఎంఆర్) అనే నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదక ద్రవ్యాల విలువ రూ.100 కోట్లకు పైగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. హెరాయిన్‌తోపాటు వీటిని కూడా వాడితే ఆ ప్రభావం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని డీజీపీ గౌరవ్ యాదవ్ ఆదివారం చెప్పారు. ఈ దాడిలో డ్రగ్స్‌తోపాటు విదేశీ తయారీ పిస్టళ్లు ఐదు, ఒక నాటు తుపాకీ, టైర్లలోని పెద్ద రబ్బర్ ట్యూబులను స్వాధీనం చేసుకున్నారు. భారీ రబ్బర్ ట్యూబుల ద్వారా పాకిస్తాన్ నుంచి మాదక ద్రవ్యాలను నీటి మార్గం ద్వారా అక్రమంగా రవాణా చేయడానికి స్మగ్లర్లు వినియోగించారు. ఈ డ్రగ్స్ ముఠాలోని ఇతర సభ్యులను పట్టుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని డీజీపీ తెలిపారు.
#Biggest Heroin seizure in #Punjab: In an intelligence-led operation, @PunjabPoliceInd busts a cross-border smuggling racket and apprehends two associates of Foreign-based drug smuggler Navpreet Singh @ Nav Bhullar and recovers 105 Kg Heroin, 31.93 Kg Caffeine Anhydrous, 17 Kg… pic.twitter.com/D8EdVABCCC
— DGP Punjab Police (@DGPPunjabPolice) October 27, 2024
అమృత్‌సర్‌లోని పంజాబ్ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ (CI) బృందానికి పక్కా సమాచారం అందడంతో ఇంటెలిజెన్స్ నేతృత్వంలోని ఈ ఆపరేషన్ నిర్వహించారు. మరియు బాబా బకాలా ప్రాంతంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సిఐ, అమృత్‌సర్, బల్బీర్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక చెక్‌పాయింట్‌ను ఏర్పాటు చేశారు. వీరిద్దరిని అరెస్టు చేసి 7 కిలోల స్వాధీనం చేసుకున్నారు. వీరి కారు నుంచి హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అరెస్టయిన నిందితుల వెల్లడి ప్రకటనల ఆధారంగా, మిగిలిన 98 కిలోల హెరాయిన్‌తో పాటు ఆయుధాలు, కెఫిన్ అన్‌హైడ్రస్, డిఎంఆర్‌లను వారి అద్దె ఇళ్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డిజిపి తెలిపారు. మాదక ద్రవ్యాల రవాణాకు ఉపయోగించిన మార్గంపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.