AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electricity Crisis: దేశంలో ముంచుకొస్తున్న మరో ముప్పు.. 38ఏళ్ల గరిష్టానికి డిమాండ్.. గుబులు రేపుతున్న విద్యుత్ సంక్షోభం!

దేశానికి ముంచుకొస్తున్న మరో ముప్పు గుబులు రేపుతోంది. విద్యుత్ సంక్షోభం ముప్పు ముంచుకొస్తోంది. బొగ్గు ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసే థర్మల్ పవర్ ప్లాంట్లను ఆ బొగ్గు కొరత వెంటాడుతోంది.

Electricity Crisis: దేశంలో ముంచుకొస్తున్న మరో ముప్పు.. 38ఏళ్ల గరిష్టానికి డిమాండ్.. గుబులు రేపుతున్న విద్యుత్ సంక్షోభం!
Power Crisis
Balaraju Goud
|

Updated on: Apr 20, 2022 | 11:09 AM

Share

Coal and Electricity Crisis: దేశానికి ముంచుకొస్తున్న మరో ముప్పు గుబులు రేపుతోంది. విద్యుత్ సంక్షోభం ముప్పు ముంచుకొస్తోంది. బొగ్గు ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసే థర్మల్ పవర్ ప్లాంట్లను ఆ బొగ్గు కొరత వెంటాడుతోంది. చాలా విద్యుత్ కేంద్రాల్లో బఫర్ స్టోరేజీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. ఒక్కటి రెండ్రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బొగ్గు ఉత్పత్తి, సరఫరాలోనూ సమస్యలు ఉన్న నేపథ్యంలో దేశంలో ఈ థర్మల్ ఉత్పత్తి మీద ఆధారపడిన ప్రాంతాలన్నీ చీకట్లు అలుముకునే ముప్పు కనిపిస్తోంది. బొగ్గు నిల్వలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నా.. సాధ్యపడడం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. గడిచిన కొన్నాళ్లుగా పవర్ ప్లాంట్స్‌లో బొగ్గు బఫర్ స్టాక్‌ను ఐదారు నెలలకు సరిపడా పెంచాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ, మూడ్రోజులకు మించి స్టాక్ పెట్టలేకపోతున్నామని పేర్కొ్ంది

దేశం విద్యుత్ సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది. దేశంలోని అతిపెద్ద బొగ్గు కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్ ఈ కాలంలో విద్యుత్ కంపెనీలకు 14.2 శాతం ఎక్కువ బొగ్గును సరఫరా చేసింది. డిమాండ్‌కు అనుగుణంగా థర్మల్ పవర్ స్టేషన్లు ఏప్రిల్ నెలలో 9.5 శాతం ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. అయినప్పటికీ, దాదాపు 12 రాష్ట్రాల ముందు విద్యుత్ సంక్షోభం మరింత ప్రమాదకరంగా మారింది. ఏప్రిల్ మొదటి 15 రోజుల గురించి మాట్లాడితే, దేశంలోని థర్మల్ పవర్ స్టేషన్లలో సగటు బొగ్గు నిల్వలు 9.6 రోజుల నుండి 8.4 రోజులకు తగ్గాయి. ఏప్రిల్ 2022లో కంపెనీ ఇప్పటివరకు అత్యధికంగా బొగ్గును ఉత్పత్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది.

2022 ఏప్రిల్‌ మొదటి 15 రోజుల్లో దేశంలో విద్యుత్‌ డిమాండ్‌ గత 38 ఏళ్లలో అత్యధిక స్థాయిలో ఉందని విద్యుత్‌ రంగ ఇంజినీర్ల సంఘం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల్లో 3.7 శాతం నుంచి 8.7 శాతం వరకు విద్యుత్ కోతలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ డిమాండ్ 21 వేల మెగావాట్లు కాగా, సరఫరా 20 వేల మెగావాట్లు. బొగ్గు రవాణాకు వ్యాగన్ల కొరత అతిపెద్ద కారణమని సంస్థ పేర్కొంది. అన్ని ప్లాంట్‌లకు తగినంత బొగ్గును రవాణా చేయడానికి 453 రైల్వే రేకులు అవసరమని, అయితే కొన్ని రోజుల క్రితం వరకు 379 రేకులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఇప్పుడు వారి సంఖ్య 415కి పెరిగింది.

కోల్ ఇండియా 2021 ఏప్రిల్‌లో 14.3 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయగా, 2022 ఏప్రిల్‌లో ఇప్పటివరకు రోజుకు 16.4 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేస్తోంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ నెలలో 27 శాతం ఎక్కువ బొగ్గు వెలికితీశారు. ఏప్రిల్ 1-15, 2021 కంటే 9.4 శాతం ఎక్కువ బొగ్గు లభ్యత కారణంగా థర్మల్ పవర్ ప్లాంట్లు ఏప్రిల్ 1 – 15 మధ్య 3.5 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి.

ఇదిలావుంటే, విద్యుత్ రేటు విషయంలో హర్యానా ప్రభుత్వం, అదానీ గ్రూప్ మధ్య వివాదం నెలకొంది. 2008లో అదానీ గ్రూప్ హర్యానా ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే 25 సంవత్సరాలకు యూనిట్‌కు రూ.3.36 చొప్పున విద్యుత్‌ను అందించడానికి ఎంవోయూ కుదుర్చుకుంది. అయితే, అదానీ గ్రూప్ అదనపు విద్యుత్ రేట్లు అడుగుతున్నందున గత ఏడాది కాలంగా ఈ ఒప్పందం ప్రకారం హర్యానాకు విద్యుత్ ఇవ్వడం లేదు. మరోవైపు దిగుమతి చేసుకున్న బొగ్గును విద్యుత్తు ఉత్పత్తికి వినియోగించాల్సి ఉంటుందని, అది ఖరీదైనదని అదానీ గ్రూప్ వాదిస్తోంది. దీంతో రేట్లు పెంచాల్సిన అవశ్యకత ఏర్పడింది.

విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్, బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌లతో సమావేశమయ్యారు. గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు లభ్యత, ప్రస్తుత విద్యుత్ డిమాండ్లపై మంత్రులు చర్చించారు.

Read Also…  Stock Market: మార్కెట్ వరుస నష్టాలకు బ్రేక్.. జోరుమీదున్న పవర్, ఆటో, ఆయిల్&గ్యాస్ షేర్లు..