Covid Update News: కరోనా ప్రమాద ఘంటికలు…ఆ నగరంలో హోటళ్లు బంద్..రాత్రిపూట కర్ఫ్యూ
Covid Update News: దేశంలో కరోనా ఉధృతి క్రమంగా పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధికర కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి.
మహారాష్ట్రలో కరోనా ఉధృతి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పూణె నగరంలో కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. రేపటి(శనివారం) నుంచి నగరంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నట్లు పూణె డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావు ప్రకటించారు. సాయంత్రం 6 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు 12 గంటల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. వారం రోజుల తర్వాత వచ్చే శుక్రవారం పరిస్థితిని సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఏడు రోజుల పాటు బార్లు, హటళ్లు, రెస్టారెంట్లు, థియేటర్లను మూసివేయనున్నట్లు తెలిపారు. ఫుడ్ హోం డెలివరీని మాత్రం అనుమతించనున్నట్లు వెల్లడించారు.
వివాహ కార్యక్రమాలు, అంత్యక్రియలు మినహా ఇతర ఏ ఫన్షన్లను అనుమతించబోమని స్పష్టంచేశారు. అంత్యక్రియల్లో అత్యధికంగా 20 మందికి, వివాహ కార్యక్రమాల్లో అత్యధికంగా 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. అలాగే పూణెలోని అన్ని ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలను పూర్తిగా మూసివేయనున్నట్లు సౌరభ్ రావు ప్రకటించారు. ఈ ఆంక్షలు శనివారం ఉదయం నుంచి ఏప్రిల్ 9 తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఇప్పటికే నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్ అమలుచేస్తున్నారు.
కాగా కోవిడ్ ఉధృతి నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని జిల్లాల్లో ఆంక్షలు విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి 8.30 గం.లకు ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరనున్నారు.
ఇవి కూడా చదవండి…రిషబ్ పంత్‌తో రిలేషన్షిప్.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ.. అసలు మ్యాటర్‌ను రివీల్ చేసిన..
Pulwama Attack: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం.. షాకింగ్ వీడియో.!