Covid Third Wave: అక్టోబర్ – నవంబర్‌లో కరోనా థర్డ్‌వేవ్.. కీలక విషయాలు వెల్లడించిన కాన్పూర్ శాస్త్రవేత్త
Covid Third Wave: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించింది. సెకండ్ వేవ్ తర్వాత థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని..
Covid Third Wave: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించింది. సెకండ్ వేవ్ తర్వాత థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరింత ఆందోళన నెలకొంది. కరోనా కట్టడి తర్వాత దేశంలో అన్ని రంగాలు తెరుచుకుని తమతమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇక ఇప్పుడున్న కరోనా వేరియంట్ల కన్నా మరింత ప్రమాదకరమైన వేరియంట్ సెప్టెంబర్‌లో బయటపడితే దేశంలో కరోనా థర్డ్‌వేవ్ వచ్చే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ హెచ్చరించారు. ఒకవేళ అలా జరిగితే రాబోయే అక్టోబర్– నవంబర్ మధ్య కాలంలో దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ఉధృతి కనిపిస్తుందని ఆయన అంచనా వేశారు. అయితే ఎంత ప్రమాదకరమైన వేరియంట్‌తో థర్డ్‌వేవ్ వచ్చినా, దాని తీవ్రత సెకండ్ వేవ్ కన్నా చాలా తక్కువగా ఉంటుందని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. కరోనా మేథమేటికల్ మోడలింగ్‌లో ఆయన నిపుణుడు. దేశంలో ఇన్‌ఫెక్షన్ల పెరుగుదలను అంచనా వేసే ముగ్గురు సభ్యుల బృందంలో అగర్వాల్ ఒకరు. సెప్టెంబర్‌లో కొత్త వేరియంట్ ఏదీ రాకపోతే మాత్రం ఎలాంటి థర్డ్ వేవ్ రాదని ఆయన తెలిపారు.
థర్డ్‌వేవ్ ఉధృతిలో రోజుకు లక్ష కేసులు:
కాగా, ఒక వేళ థర్డ్‌వేవ్ వచ్చినట్లయితే దేశ వ్యాప్తంగా రోజుకు లక్ష పాజిటివ్ కేసుల చొప్పున నమోదయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. సెకండ్‌వేవ్ వ్యాప్తిలో దేశీయంగా రోజుకు 4 లక్షల కేసులు నమోదైన విషయం తెలిసిందే. ‘న్యూ మ్యూటెంట్ రాకున్నా, కొత్త వేరియంట్ కనిపించకున్నా యథాతథ స్థితి ఉంటుంది. కొత్త వేరియంట్ సెప్టెంబర్ నాటికి బయటపడితే థర్డ్‌వేవ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.’ అని అగర్వాల్ వెల్లడించారు. కొత్త వేరియంట్, తద్వారా థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాలు 1/33 వంతులని ఆయన అంచనా వేశారు.
ఇప్పటివరకు డెల్టాను మించిన ప్రమాదకరమైన వేరియంట్ ఇంకా బయటపడలేదు. డెల్టా కారణంగా థర్డ్‌వేవ్ ఆరంభమైనా, కొత్త వేరియంట్ పుట్టకపోవడంతో ఉధృతి కొనసాగడం లేదని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం దేశీయంగా నమోదైతున్న కేసులు కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతున్నాయి. రోజుకు 40వేల వరకు నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా తక్కువగానే ఉన్నాయి. రానున్న రెండు నెలల్లో థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచించడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. థర్డ్‌వేవ్ ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు చేపట్టాలని సూచించింది కేంద్రం.
థర్డ్‌వేవ్ నేపథ్యంలో ప్రజలు మరింతగా జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం మార్చిపోవద్దని సూచిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉంటే.. థర్డ్‌వేవ్ రానివ్వకుండా చేసుకోవచ్చని సూచిస్తోంది కేంద్రం.