Coronavirus: కోవిడ్ కొత్త వేరియంట్‌పై అలర్ట్.. వారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి: కేంద్రం
మరోసారి కరోనా మహమ్మారి బుసలు కొట్టేందుకు సిద్ధమవుతోంది. చైనాలో మొదలైన ఈ కరోనా.. ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేసింది. కరోనా..
మరోసారి కరోనా మహమ్మారి బుసలు కొట్టేందుకు సిద్ధమవుతోంది. చైనాలో మొదలైన ఈ కరోనా.. ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేసింది. కరోనా కట్టడికి చేపట్టిన చర్యల వల్ల ప్రస్తుతం అదుపులో ఉంది. లాక్‌డౌన్, ఇతర ఆంక్షలు, యుద్ధ ప్రాతిపదికన కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వల్ల కరోనా తగ్గుముఖం పట్టింది. అయితే ఈ మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లతో దాడులు చేస్తోంది. థర్డ్‌వేవ్ ముగిసింది. ఇప్పుడు ఫోర్త్‌వేవ్‌లో కొత్త వేరియంట్ బీఎఫ్.7 వస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాండవియా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త వైరస్ దేశంలోకి రానివ్వకుండా చేపట్టిన చర్యలపై చర్చించారు.
ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేయాలని సూచించారు. దీంతో ఎయిర్ సువిధ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. కోవిడ్‌పై సమీక్ష నేపథ్యంలో విదేశీ ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని అన్నారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్ తప్పని సరి అని మంత్రి స్పష్టం చేశారు. అయితే ఇందులో పాజిటివ్ వస్తే క్వారంటైన్‌కు తరలించాలని అధికారులకు సూచించారు.
దేశంలో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. కోవిడ్-19 నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ లభ్యతపై ఆరా తీస్తోంది. ప్రతివారం ఆక్సిజన్ లభ్యతపై సమీక్షించాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. ఆస్పత్రుల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించింది. అవసరాలకు తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లతో పాటు బ్యాకప్ స్టాక్ కూడా ఏర్పాటు చేసుకోవాలని, లైఫ్ సపోర్ట్ పరికరాలైన వెంటిలేటర్లు, బైపాప్ యంత్రాలు, SpO2 సిస్టమ్స్ తగినన్ని అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం రాష్ట్రాలను సూచించింది. రాష్ట్రాల్లో ఆక్సిజన్ కంట్రోల్ రూమ్స్ ను మళ్లీ ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ అజ్ఞాని రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి