దేశంలో కనుమరుగవుతున్న కాంగ్రె ‘ష్’!

వరుసగా ఎదురవుతున్న ఓటములతో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. ఇటీవలి ఢిల్లీ ఓటమి ఆ పార్టీలో ఆత్మవలోకనం చేసుకోవాల్సిన అవసరాన్ని ఎత్తి చూపింది. కానీ ఆ పార్టీ నేతలు ఢిల్లీలో ఆప్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

దేశంలో కనుమరుగవుతున్న కాంగ్రె 'ష్'!
Follow us

|

Updated on: Feb 18, 2020 | 11:11 AM

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు ముగిశాయి… హస్తినరాజు ఎవరనేది తేలిపోయింది.. ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం కూడా చేశారు.. ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న 70 స్థానాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఏకంగా 62 స్థానాలను గెల్చుకుంది.. మిగిలిన ఎనిమిది సీట్లలో ఎందుకు ఓడిపోయాం అన్నదానిపై సమీక్ష సమావేశాలను జరిపారు కేజ్రీవాల్‌.. కేంద్రంలో అధికారంలో ఉంటూ కూడా ఎనిమిది స్థానాలకే ఎందుకు పరిమితమయ్యామన్నదానిపై అంతర్మధనం చేసుకుంటోంది భారతీయ జనతాపార్టీ.. మరో జాతీయపార్టీ కాంగ్రెస్‌ను చూస్తుంటూనే కాసింత జాలేస్తోంది… భారతదేశానికి గుండెకాయలాంటి ఢిల్లీలో ఎన్నికలు జరిగితే కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేకపోవడం కాంగ్రెస్‌ పతనావస్థకు అద్దం పడుతోంది…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది కాంగ్రెస్‌… అసలు ఈ దేశాన్ని అత్యంత సుదీర్ఘకాలం పాటు తిరుగులేకుండా పాలించిన పార్టీయేనా ఇది అని అనిపిస్తోంది కూడా! కొన్ని రాష్ట్రాలలో స్థానిక పరిస్థితుల కారణంగా కాంగ్రెస్‌కు అధికారం దక్కింది తప్ప.. ఆ పార్టీ పూర్వ వైభవాన్ని సంపాదించలేకపోతున్నది.. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో అధికారంలోకి రాలేదని కారణంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. అదే సమయంలో కాంగ్రెస్‌ క్యాడర్‌ కూడా డీలా పడింది.. కార్యకర్తల్లో నిస్తేజం ఆవరించింది…

సోనియాగాంధీ నేతృత్వంలోనే కాంగ్రెస్‌పార్టీ ఢిల్లీ ఎన్నికలకు వెళ్లినా.. ఆశించిన విధంగా ఫలితాలు రాలేదంటే ఎవరి వైఫల్యం అనుకోవాలి? ఓటమి బాధ్యతను నెత్తినేసుకున్న ఢిల్లీ పీసీసీ ఇన్‌ఛార్జ్ వెంటనే తన పదవికి రాజీనామా చేశారు.. దేశ రాజధాని ఢిల్లీలో ఒకప్పుడు వరుసగా మూడుసార్లువిజయం సాధించి హాట్రిక్‌తో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన కాంగ్రెస్‌పార్టీ ఇటీవలి కాలంలో వరుస పరాభవాలను చవిచూస్తోంది… దివంగత నేత, ఒకప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ హయాంలోనే కాంగ్రెస్‌ పతనం ప్రారంభమయ్యిందని సుభాష్‌ చోప్రా విమర్శించేసరికి స్వపక్షం నుంచే ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. ఆ తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారనుకోండి.. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. పార్టీలో కొందరు వ్యక్తులు పనిగట్టుకుని తనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని… కాంగ్రెస్‌ ఘోర పరాజయం వెనుక ఎవరున్నారో తనకు తెలుసంటూ ఏఐసీసీ ఢిల్లీ మాజీ ఇన్‌ఛార్జ్ పీసీ చాకో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి..

మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు కూడా ఆ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి . ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయాన్ని తానూ స్వాగతిస్తున్నట్టు చిదంబరం ప్రకటించిన కొద్దిసేపటికే ఢిల్లీ కాంగ్రెస్ మహిళా నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్టా ముఖర్జీ ఆ వ్యాఖ్యలను తప్పు పట్టారు . బీజేపీని ఓడించే బాధ్యతను ప్రాంతీయపార్టీలకు అప్పగించారా..? అని ఆమె చిదంబరంను ఉద్దేశించి ప్రశ్నించారు.. అసలు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన దగ్గరనుంచే ఢిల్లీ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి… కాంగ్రెస్‌లో పెద్ద తలకాయలేవీ ప్రచారంలో పాల్గొనలేదు.. ఎన్నికలన్న తర్వాత గెలుపోటములు సహజం.. అయితే ఎన్నికలను ఎంత సీరియస్‌ తీసుకున్నారు? అక్కడి ప్రజల కోసం ఏ మాత్రం శ్రద్ధ చూపించారు? అన్నవాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిందే! ఆ విషయాల్లో కూడా కాంగ్రెస్‌పార్టీ దారుణంగా విఫలమైంది.

ఎన్నికల్లో కనీసం శ్రద్ధగా ప్రచారం కూడా నిర్వహించకుండా ఉదాసీనంగా ఉండిపోయింది. చేతగానితనం కంటే అత్యంత ప్రమాదకరమైన లక్షణం ఉదాసీనత. ఎన్నికల్లో అభ్యర్థులను మోహరించడం గానీ.. ప్రచారం చేయడంలో గానీ కాంగ్రెస్ పార్టీకి ఏ దశలోనూ సీరియస్‌నెస్ కనిపించలేదు. మోదీ ప్రభుత్వ ఇటీవలి నిర్ణయాల పట్ల దేశ వ్యాప్తంగా పోరాటాలు చేస్తాం అని ప్రకటిస్తున్న పార్టీ , దేశమంతా మోదీ నిర్ణయాలను వ్యతిరేకించాలని పిలుపు ఇస్తున్నపార్టీ… ఎన్నికల రూపేణా వచ్చిన మంచి అవకాశాన్ని వినియోగించకోలేకపోయింది అంటే ఎవరిని తప్పు పట్టాలి? నిజానికి మోదీ తీసుకునే నిర్ణయాలు కంటే కాంగ్రెస్ పార్టీ అచేతనత్వమే దేశానికి ఎక్కువ ప్రమాదకరం..మరి రానున్న ఎన్నికలలో కూడా ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తే… కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కూడా రావచ్చని విశ్లేషకులు అంటున్నారు.

-శేరి సురేశ్ టీవీ9 ప్రతినిధి, ఢిల్లీ