Mani Shankar Aiyar: ఆ రెండిటికీ వారే కారణం.. కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..

గాంధీ కుటంబంపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో తన ఎదుగుదలతో పాటు పతనానికి కూడా గాంధీ కుటుంబమే కారణమని వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో సోనియా గాంధీని నేరుగా ఒక్కసారి కూడా కలవలేకపోయినట్లు ఆవేదన వ్యక్తంచేశారు. రాహుల్ గాంధీని కేవలం ఒకసారి మాత్రమే కలిసినట్లు వెల్లడించారు.

Mani Shankar Aiyar: ఆ రెండిటికీ వారే కారణం.. కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..
Mani Shankar Aiyar
Follow us
Janardhan Veluru

|

Updated on: Dec 15, 2024 | 8:53 PM

గాంధీ కుటుంబంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ ( సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో తన ఎదుగుదలతో పాటు పతనానికి కూడా గాంధీ కుటుంబమే కారణమన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని గత 10 ఏళ్లుగా నేరుగా కలవలేకపోయినట్లు చెప్పారు. ఆమెను నేరుగా కలిసేందుకు చాలాసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు. రాహుల్ గాంధీతో ఒకసారి, ప్రియాంక గాంధీతో ఒకట్రెండు సార్లు మాత్రమే కలిసి మాట్లాడినట్లు 83 ఏళ్ల మణిశంకర్ అయ్యర్ పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తాను పార్టీ నుంచి సస్పెన్షన్‌లో ఉన్నందున.. జూన్ మాసంలో ప్రియాంక గాంధీకి ఫోన్ చేసి రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్ తెలియజేయాలని కోరినట్లు తెలిపారు. ప్రియాంక గాంధీ కొన్నిసార్లు ఫోన్‌లో మాట్లాడుతుంటారని వెల్లడించారు. పార్టీలో తన స్థానానికి సంబంధించి తాను పార్టీ అధిష్టానానికి లేఖలు రాసినా.. దానికి స్పందన లభించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసిన అయ్యర్

అందుకే తన రాజకీయ ఎదుగుదలకు, పతనానికి గాంధీ కుటుంబమే కారణమని తాను భావిస్తున్నట్లు అయ్యర్ పేర్కొన్నారు. అదే సమయంలో బీజేపీలో చేరే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టంచేశారు.

ప్రధాని మోదీని చాయ్‌వాలా అనలేదు: అయ్యర్

కాగా తాను ప్రధాని నరేంద్ర మోదీని చాయ్‌వాలా అని ఎప్పుడూ అనలేదని మణిశంకర్‌ అయ్యర్‌ అన్నారు. జగ్గర్‌నాట్ ప్రచురించిన ఎ మావెరిక్ ఇన్ పాలిటిక్స్ అనే కొత్త పుస్తకంలో ఆయన 2014నాటి వివాదాన్ని ప్రస్తావించారు. తాను ‘చాయ్‌వాలా’ అని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పుకున్నారని అన్నారు. అయితే చాయ్‌వాలా దేశ ప్రధాని అయ్యేందుకు అనర్హుడని తాను అవమానించినట్లు రాజకీయ జిమ్మిక్కులో భాగంగా తనపై దుష్ప్రచారం చేశారని అన్నారు. అయితే ఈ విషయంలో తన వివరణ అడగకుండానే.. నిజానిజాలు నిర్ధారించుకోకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.