Rahul Gandhi: అమెరికా పర్యటనకు వెళ్లనున్న రాహుల్ గాంధీ.. ఎప్పుడంటే
కాంగ్రెస్ అగ్రనేత, వైనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. దాదాపు 10 రోజుల పాటు ఆయన అమెరికాలోని పలు నగరాలను సందర్శించనున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ముందు రాహుల్ చేపడుతున్న ఈ యాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కాంగ్రెస్ అగ్రనేత, వైనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. మే 31న బయలుదేరనున్న ఆయన దాదాపు 10 రోజుల పాటు అక్కడ పలు నగరాలను సందర్శించనున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ముందు రాహుల్ చేపడుతున్న ఈ యాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్లమెంట్ సభ్యత్వం రద్దైన తర్వాత రాహుల్ చేపడుతున్న తొలి విదేశీ యాత్ర ఇదే. అయితే ఈ పర్యటనలో భాగంగా జూన్ 4న న్యూయార్క్ మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో నిర్వహించే ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. ఈ ర్యాలీలో దాదాపు 5 వేల మంది NRIలు పాల్గొంటారని సమాచారం. ఈ పర్యటనలో రాజకీయ నాయకులు, ఎంటర్‌ప్రెన్యూర్స్, వ్యాపార దిగ్గజాలతోనూ రాహల్ గాంధీ భేటీ అవుతారు.
మరో వైపు వచ్చే నెలలోనే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ప్రధాని గౌరవార్థం జూన్ 22న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయనకు విందు ఇవ్వనున్నారు. అయితే ఈ పర్యటనల ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని వైట్ హౌస్ ఇప్పటికే ప్రకటించింది. గత మార్చిలో బ్రిటన్ పర్యటన సందర్భంగా లండన్ క్యాంబ్రిడ్జి యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండియాలో తీవ్ర రాజకీయ దుమారం సృష్టించాయి. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని పార్లమెంట్‌లో బీజేపీ సభ్యులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీ అమెరికా పర్యటన, అక్కడ ఆయన పాల్గొనే కార్యక్రమాలపై ఇండియాలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




