AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: 2023లో రాహుల్ పెళ్లి చేసుకుంటారా..? అమ్మాయి అలా ఉండాలంటూ కండిషన్స్..

రాహుల్ 2023లో పెళ్లి చేసుకుంటారా..? పప్పన్నం పెడతారా..? అనే విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సుధీర్ఘంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Rahul Gandhi: 2023లో రాహుల్ పెళ్లి చేసుకుంటారా..? అమ్మాయి అలా ఉండాలంటూ కండిషన్స్..
Rahul Gandhi
Shaik Madar Saheb
|

Updated on: Dec 29, 2022 | 2:51 PM

Share

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రాహుల్ గాంధీ.. పెళ్లి గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. 50 ఏళ్లు దాటినా పెళ్లి ఊసెత్తని రాహుల్.. వివాహ వేడుకపై తరచూ ఎన్నో వార్త కథనాలు.. మరెన్నో ప్రచారాలు.. వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో రాహుల్ తనకు ఎలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటారు.. అనే విషయంపై ఫుల్ క్లారిటీ ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో రాహుల్ 2023లో పెళ్లి చేసుకుంటారా..? పప్పన్నం పెడతారా..? అనే విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సుధీర్ఘంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన రాహుల్ పాదయాత్ర ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. ప్రస్తుతం ఈ యాత్రకు స్వల్ప విరామం ఇచ్చారు. మళ్లీ జనవరి 3 నుంచి భారత్ జోడో యాత్ర మొదలు కానుంది. ఈ క్రమంలో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి, తన అభిరుచుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి.. రాహుల్ ప్రముఖంగా ప్రస్తావించారు. తనకు నాయనమ్మ అంటే ఎంతో ప్రేమని, తనకు మరో మాతృమూర్తి లాంటి వారని పేర్కొన్నారు. ఈ సమయంలో కాబోయే భార్య ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు రాహుల్‌ తనదైన శైలిలో జవాబిచ్చారు. ‘‘ఇది ఆసక్తికర ప్రశ్న.. నానమ్మ వంటి సుగుణాలున్న మహిళ అయితే నాకు అభ్యంతరం లేదు.. కానీ, అమ్మ, నానమ్మలో ఉన్న లక్షణాలు కలిగినవారైతే ఇంకా మంచిది’’ అంటూ వ్యాఖ్యానించారు. తల్లి సోనియా గాంధీ, నానామ్మ ఇందిరా గాంధీ.. ఇద్దరి గుణాలు కలగలిసిన భాగస్వామి అయితే జీవితంలో స్థిరపడేందుకు ఇష్టపడతానంటూ రాహుల్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఇతర అభిరుచులను కూడా పంచుకున్నారు.

తనకు కార్లపై అంతగా మోజు లేదని.. మోటార్ సైకిళ్లు నడపడం అంటే ఇష్టమని తెలిపారు. ‘‘నాకు కార్లంటే ఇష్టం లేదు.. సొంతకారు కూడా లేదు.. ఇంట్లో సీఆర్‌-వీ ఉన్నా.. అది అమ్మది. కార్లంటే అంతగా ఆసక్తి లేకున్నా వాటికి వచ్చే సాంకేతిక సమస్యలు మాత్రం 90 శాతం తెలుసు. వాటిని రిపేర్‌ చేస్తా. వేగంగా వెళ్లడం ఇష్టం. గాలిలో, నీటిలో, నేలమీద వేగంగా దూసుకెళ్లే ఆలోచనను ఇష్టపడతా’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘మోటారు బైక్‌లపై ఆసక్తి లేదు, కానీ నాకు మోటారు బైక్‌లు నడపడంలో ఆసక్తి ఉంది’’ అని తెలిపారు.

స్వశక్తితో నడిపించే సైక్లింగ్‌ అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. ఎన్‌ఫీల్డ్‌ బైక్ నచ్చదని పేర్కొన్న రాహుల్.. ఆ బైక్‌ బ్రేకులు లేదా బ్యాలెన్స్‌ అంటే ఎంతోమందికి ఇష్టమని తెలిపారు. కానీ, తనకు ఆర్‌1 కంటే ఎక్కువగా ఓల్డ్‌ లాంబ్రెట్టా చాలా నచ్చుతుందని.. కానీ దాన్ని నడపాలంటే కష్టమని తెలిపారు. లండన్‌లో పనిచేసే కాలంలో అప్రిలియా ఆర్‌ఎస్‌ 250 బైక్‌ ఉండేది. అదంటే తనకు అమితమైన ప్రేమని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఎలక్ట్రిక్ స్కూటర్‌ని నడిపాను, కానీ ఎప్పుడూ ఎలక్ట్రిక్ బైక్‌ను నడపలేదని రాహుల్ తెలిపారు. చైనీస్ కంపెనీ స్కూటర్ల గురించి ప్రస్తావిస్తూ.. ఎలక్ట్రిక్ మోటార్లతో సైకిల్స్, పర్వత బైక్‌లు కూడా ఉన్నాయని.. ఇది చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్.. చాలా బాగున్నాయి అంటూ పేర్కొన్నారు.

వాటిని పట్టించుకోను..

ఈ ఇంటర్వూలో తనపై వచ్చే నిందలు, విమర్శలు, ‘పప్పూ’ వంటి వ్యాఖ్యలపై కూడా రాహుల్ స్పందించారు. ‘‘నేను పట్టించుకోను.. నన్ను తిట్టినా.. కొట్టినా.. నేను మాత్రం ఎవరినీ ద్వేషించను. అదొక చెడు ప్రచారం.. వారి జీవితంలో ఏదీ జరగక, జీవితంలో బంధుత్వాలు సరిగా లేక కొందరు చాలా బాధ పడుతుంటారు. అందుకే అలాంటివారు ఎదుటివారిని దూషించడం, దుర్భషలాడటం చేస్తుంటారు. అయినా ఫర్వాలేదు.. నన్ను ఎంత తిట్టినా స్వాగతిస్తా.. ద్వేషించను.. నాకెన్ని పేర్లు పెట్టినా లెక్కచేయను’’ అంటూ వ్యాఖ్యానించారు.

దీంతోపాటు భారత్ లో ఎలక్ట్రిక్‌ వాహనాలు మొదలు.. డ్రోన్‌ విప్లవం వంటి ఎన్నో అంశాలపైనా రాహుల్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. EV విప్లవానికి పునాది అవసరం.. మనం ఎక్కడా లేము అంటూ పేర్కొన్నారు. బ్యాటరీలు, మోటార్లు మరియు మౌలిక సదుపాయాలను ఉత్పత్తి చేయడానికి సరైన పునాది లేదని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..