పైకి చూసి మంచి పోరడు అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే గుండె ఆగుద్ది..
ఊరు, పేరు, మకాం మార్చినా సరే.. పోలీసులు ఏమైనా తక్కువా.. చాకచక్యంగా ట్రేస్ చేసి పట్టేశారు. పై ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసి మోసపోవద్దు.. పక్కా జాదుగాడు. ఇంతకీ ఈ కేసు వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.

1998లో తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటన అప్పట్లో యావద్దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నాటి భారతీయ జనతా పార్టీ (BJP) అగ్రనేత లాల్ కృష్ణ అడ్వాణీ హత్యకు సైతం ఉగ్రవాదులు కుట్రపన్నారు. ఇది జరిగిన రెండున్నర దశాబ్దాలు దాటి దాదాపు 3 దశాబ్దాలు కావొస్తోంది. కానీ బాంబుపేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదుల్లో కొందరు మాత్రం ఊరు, పేరు, మకాం అన్నీ మార్చేశారు. దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా దేశంలోనే దర్జాగా మారుపేరుతో బ్రతికేశారు. ఏళ్లు గడిచాయి. దశాబ్దాలుగా మారాయి. ఇక తమ జాడ ఎవరూ పసిగట్టలేరు అన్న ధీమాలో ఉండగా.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సహా వివిధ దర్యాప్తు సంస్థలు ఒక్కసారిగా జూలు విదిలించాయి. కోయంబత్తూరు బాంబు పేలుళ్లతో ప్రమేయం ఉండి, అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్న ఉగ్రవాదుల జాడ పసిగట్టాయి. తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప పట్టణంలో ఇద్దరు ఉగ్రవాదులను తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అబూబకర్ సిద్ధిఖి అలియాస్ నాగూర్, మహ్మద్ అలీ అలియాస్ షేక్ మన్సూర్‌గా గుర్తించారు. ఈ ఇద్దరూ కడపలో బట్టలు కుట్టే దుకాణంతో పాటు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో దేశం నలుమూలల నుంచి వచ్చి స్థిరపడేవారు ఉంటారు. వారిలో కలిసిపోయి ఇన్నేళ్లుగా తమ గుట్టు బయటపడకుండా చూసుకున్నారు. కానీ ఎక్కడో తగిలిన తీగ లాగితే.. గుట్టు మొత్తం రట్టయింది. పైగా రెండున్నర దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులతో పోల్చుకుంటే దర్యాప్తు సంస్థలకు, నిఘా సంస్థలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తోడైంది. అదే మొత్తానికి కలుగులో దాగిన ఈ ఉగ్రవాదులను పట్టించింది.
ఇది కేవలం కడప కథ మాత్రమే కాదు. దాదాపు ఇదే తరహాలో తాజాగా కర్ణాటకలోని విజయపురలో మరొక ఉగ్రవాదిని తమిళనాడు కోయంబత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడు సిద్ధిఖీ రాజ్‌గా గుర్తించారు. పేలుళ్ల తర్వాత, తమిళనాడు నుంచి పారిపోయిన నిందితుడు సిద్ధిఖీ రాజ్ గత 27 సంవత్సరాలుగా వేర్వేరు ప్రదేశాల్లో దాక్కున్నాడు. చివరకు విజయపుర నగరంలో స్థిరపడ్డాడు. చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేటకు చెందిన సిద్ధిఖీ రాజ్, 1998లో కోయంబత్తూరులో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో కీలక నిందితుడు. నిందితుడు సిద్ధిఖీ రాజ్ హుబ్బళ్లికి చెందిన ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. వరుస పేలుళ్ల తర్వాత అనేక ప్రాంతాలకు మకాం మార్చుకుంటూ పోయిన సిద్ధిఖీ.. గత 12 సంవత్సరాలుగా విజయపురలో ఒకేచోట కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించాడు.
అతని కోసం వెతుకుతున్న పోలీసులు, నిందితుడు సిద్ధిఖీ రాజ్ విజయపురలో దాక్కున్నట్లు గుర్తించారు. వెంటనే విజయపురానికి చేరుకున్న పోలీసులు నిందితుడు సిద్ధిఖీ రాజ్‌ను గుర్తించి, అరెస్టు చేసి తీసుకెళ్లారు. కోయంబత్తూరు వరుస బాంబు పేలుళ్లతో సహా వివిధ కేసుల్లో సిద్దిఖీ రాజ్ వాంటెడ్‌గా ఉన్నాడు. అతడిపై మత ఘర్షణలు, హత్యకు సంబంధించిన అనేక కేసులు ఉన్నాయి. ఇదే కేసులో కొన్ని వారాల క్రితం ప్రధాన నిందితుడు సాదిక్ అరెస్టుతో మిగతావారి జాడ దర్యాప్తు సంస్థలు పసిగట్టాయి. అలా తలా ఒక మూలకు వెళ్లి అజ్ఞాత జీవితం గడుపుతున్న ఉగ్రవాదులను వరుసగా అరెస్టు చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి.
కోయంబత్తూరు బాంబు పేలుళ్ల కేసు ఏమిటి?
1998 ఫిబ్రవరి 14న కోయంబత్తూరులో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. పేలుళ్లలో 59 మంది మరణించగా, దాదాపు 231 మంది గాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోయంబత్తూరు వెళ్లిన బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీని హత్య చేయడానికి కూడా ఉగ్రవాదులు కుట్రపన్నినట్టు పోలీసులు గుర్తించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




