కోవిన్ రిజిస్ట్రేషన్ సమయంపై అయోమయం, కచ్చితమైన టైమ్ ప్రకటించిన కేంద్రం
కోవిడ్ వ్యాక్సిన్ 19 కి సంబంధించి కోవిన్ రిజిస్ట్రేషన్ పై దేశవ్యాప్తంగా ప్రజల్లో అయోమయం నెలకొంది. ఈ సమయం తెలియక అనేకమంది గందరగోళంలో పడ్డారు. అయితే బుధవారం సాయంత్రం...

కోవిడ్ వ్యాక్సిన్ 19 కి సంబంధించి కోవిన్ రిజిస్ట్రేషన్ పై దేశవ్యాప్తంగా ప్రజల్లో అయోమయం నెలకొంది. ఈ సమయం తెలియక అనేకమంది గందరగోళంలో పడ్డారు. అయితే బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 28 న కోవిద్ వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని మొదట ప్రకటించడంతో చాలామంది అర్ధరాత్రి 12 గంటల నుంచి రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ వారి ప్రయత్నం వృధా అయింది. 18 ఏళ్ళు పైబడినవారందరికీ కోవిన్ రిజిస్ట్రేషన్ (ఆరోగ్యసేతు యాప్, ఉమంగ్ యాప్) 28 వ తేదీ 4 గంటలకు లాంచ్ అవుతుందని స్పష్టమైంది. వ్యాక్సిన్ కేంద్రాల విషయంలో అపాయింట్ మెంట్లకు సంబంధించి రాష్ట్ర, ప్రైవేటు సెంటర్ల వద్ద సమాచారం ఉంటుంది. 18 ఏళ్ళు పైబడినవారికందరికీ మే 1 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రం చేబట్టింది.
నేషనల్ వ్యాక్సినేషన్ మూడో దశ కింద వ్యాక్సిన్ ఉత్పాదక సంస్థలు తమ నెలవారీ డోసుల్లో 50 శాతాన్ని కేంద్రానికి, మిగతా 50 శాతాన్ని రాష్ట్రాలకు, ఓపెన్ మార్కెట్ కి విడుదల చేస్తాయి. అయితే ఈ మూడు ధరల విధానాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కేంద్రానికి ఒక ధర, రాష్ట్రాలకు మరో ధర ఎందుకు ఉండాలని ప్రశ్నించాయి. కానీ కేంద్రం మాత్రం ముందు కుదుర్చుకున్న ఒప్పందం మేరకే తమకు వ్యాక్సిన్ ఉత్పాదక సంస్థలు దీన్ని విడుదల చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఇది హేతుబద్దమేనని పేర్కొంది. సీరం సంస్థ తమ కోవిషీల్డ్ టీకామందు విషయంలోను. భారత్ బయో టెక్ తమ కొవ్యాగ్జిన్ వ్యాక్సిన్ విషయంలోను వేర్వేరు ధరలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ మే 2 నుంచి ఈ ధరలు అమలులోకి రానున్నాయి.కాగా తొలి, రెండో దశల మాదిరి రిజిస్ట్రేషన్ కోవిన్ వెబ్ సైట్ ద్వారా జరుగుతుందని, కానీ ఈ దశలో వాక్-ఇన్ రిజిస్ట్రేషన్ ఉండదని ప్రభుత్వం పేర్కొంది. దేశంలో లక్షలాది మంది యువకులు తమ రిజిస్ట్రేషన్ కోసం వేచి ఉన్నారు.



