Rs 2000 Notes: నోట్ల ఉపసంహరణకు మూర్ఖపు కారణాలు.. RBI నిర్ణయాన్ని తప్పుబట్టిన పి.చిదంబరం
రూ.2,000 నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ ఇచ్చిన వివరణతో పూర్తిగా విభేదిస్తున్నట్లు ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్పష్టంచేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడేందుకు ముంబైలో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2,000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టేందుకు, ఉపసంహరించుకోవడానికి ఆర్బీఐ చెప్పిన రెండు కారణాలు సంతృప్తికలిగించడం లేవన్నారు.
రూ.2,000 నోట్లను ఉపసంహరణపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.2,000 నోట్లను తీసుకురావడం వెర్రి ఆలోచనగా ఎద్దేవా చేసిన ఆయన.. ఇప్పుడు దాన్ని ఉపసంహరణకు మూర్ఖపు కారణాలను ఆర్బీఐ చెబుతోందన్నారు. రూ.2,000 నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ ఇచ్చిన వివరణతో పూర్తిగా విభేదిస్తున్నట్లు ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన స్పష్టంచేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడేందుకు ముంబైలో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2,000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టేందుకు, ఉపసంహరించుకోవడానికి ఆర్బీఐ చెప్పిన రెండు కారణాలు సంతృప్తికలిగించడం లేదన్నారు.
తక్షణ అవసరాల కోసమంటూ 2,000 రూపాయల నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టిందని.. అయితే 15-20 రోజుల్లోనే ఈ నోటును వినియోగించేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదన్నారు. దుకాణదారులు ఈ నోట్లను తీసుకునేందుకు నిరాకరించారని అన్నారు. బ్యాంకులో క్యాషియర్లు రూ.2000 నోట్లు ఇస్తే.. చాలా మంది కస్టమర్లు వాటిని తీసుకునేందుకు నిరాకరించి, రూ.100 నోట్లు ఇవ్వాలని కోరారని గుర్తుచేశారు. చాలా చోట్ల 2000 నోట్లు చెల్లుబాటు కాని పరిస్థితి నెలకొందని చిదంబరం పేర్కొన్నారు. 2016 నంబరులో పెద్ద నోట్లు (రూ.1,000, రూ.500) రద్దు తర్వాత ఆర్బీఐ రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టడం తెలిసిందే.
ఆర్బీఐ ముద్రించిన రూ.2000 నోట్లలో 50 శాతం మేరకు ప్రజా వినియోగానికి రాలేదని.. అవి బ్యాంకుల దగ్గరే ఉండిపోయాయని చిదంబరం అన్నారు. 2000 రూపాయల నోట్ల జీవన ప్రమాణం నాలుగైదు ఏళ్లే ఉంటుందని ఆర్బీఐ చెబుతోందని.. అయితే రూ.2000 నోట్లు పెద్దగా చేతులు మారిన దాఖలాలు లేవన్నారు. అయితే రూ.100, రూ.50 నోట్లు నిత్యం వందలాది మంది చేతులు మారుతున్నాయని.. మరి వాటిని ఎందుకు ఉపసంహరించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని.. మూర్ఖపు నిర్ణయమని ఎద్దేవా చేశారు. తన నిర్ణయానికి ఆర్బీఐ వెర్రి కారణాలు చెబుతోందని విమర్శించారు. రూ.2000 నోట్లను ప్రవేశపెట్టడం మూర్ఖపు నిర్ణయమని అంగీకరించేందుకు ఆర్బీఐ సిద్ధంగా లేదన్నారు.
ఏ దేశం కరెన్సీ నోటును ప్రవేశపెట్టి కొంతకాలానికే దాన్ని ఉపసంహరించుకుందని ప్రశ్నించిన చిదంబరం.. అమెరికాలో 100 డాలర్ల కరెన్సీ నోటు 100 సంవత్సరాలకు పైగా చలామణిలో ఉందన్నారు. బ్రిటన్‌లో 50 పౌండ్ల నోటు 100 ఏళ్లుగా చలామణిలో ఉందన్నారు. మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు తర్వాత నెలరోజుల్లోనే 500 రూపాయల నోట్లను మళ్లీ ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ఇప్పుడు 1000 రూపాయల నోట్లను మళ్లీ ప్రవేశపెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. అయితే కరెన్సీ నోట్ల పరిచయం-ఉపసంహరణ మన కరెన్సీ సమగ్రత, స్థిరత్వాన్ని ప్రభావితం చేసే అవకాశముందన్నారు. కరెన్సీని నిర్వహించడానికి ఇది సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..