Dail 112 : అత్యవసర డయల్ 100 నెంబర్ మారుతోంది.. ఇకపై దేశవ్యాప్తంగా ఒక్కటే నెంబర్.. “112”

Helpline Number 112: అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఇకపై ‘డయల్‌ 112’ వినియోగంలోకి రానుంది.

Dail 112 : అత్యవసర డయల్ 100 నెంబర్ మారుతోంది.. ఇకపై దేశవ్యాప్తంగా ఒక్కటే నెంబర్.. “112”
India Emergency Helpline Number
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 06, 2021 | 9:50 AM

India Emergency Helpline Number 112: అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఇకపై ‘డయల్‌ 112’ వినియోగంలోకి రానుంది. దేశ వ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నెంబర్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 112 నెంబర్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న డయల్ 100 స్థానంలో దీనిని తీసుకొచ్చారు. దీనిపై ప్రచారం కల్పించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ అవగాహన కల్పించేందుకు సిద్దమైంది.

అమెరికా దేశంలో అమలులో ఉన్న 911 తరహాలో మన దేశవ్యాప్తంగా ఒకే అత్యవసర నంబర్‌ ఉండాలని రెండేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పూర్తి స్థాయిలో ప్రచారంలోకి తీసుకురావాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ భావిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఒకటి, రెండు నెలల్లో డయల్‌ 112పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్‌ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే.. 10 నిమిషాల్లో అత్యవసర స్పందన బృందం (ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం) సంఘటన స్థలాలకు చేరుకుంటోంది. ఈ సమయాన్ని పట్టణ ప్రాంతాల్లో 8 నిమిషాలకు తగ్గించనున్నారు.

మరో రెండు నెలలపాటు పాత నెంబరే.. ఇక, మరో రెండు నెలల వరకు డయల్ 100 అందుబాటులో ఉండనున్నట్లు పోలీసు శాఖ వెల్లడించింది. డయల్ 100కి ఫోన్ చేసినా అది ఆటోమేటిక్‌గా 112కి ట్రాన్స్‌ఫర్ అయ్యేలా చేస్తున్నారు. ఇక, ఈ నెల చివరివరకు 112కు సంబందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ అధికారులు, కంట్రోల్ రూంలో పనిచేసేవారికి నేర్పాలని సూచించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ప్రజలకు అర్ధమయ్యే విధంగా హోర్డింగ్స్, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించింది.

ప్రత్యేక కంట్రోల్‌ రూంలు ఏర్పాటు షురూ! కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ ఏడాది ప్రారంభం నుంచి డయల్‌ 112పై ప్రచారం చేపట్టాయి. వందల మంది ఒకేసారి ఫోన్‌ చేసినా స్వీకరించేలా ప్రత్యేక కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశాయి. సామాన్యులకు అవగాహన కలిగేందుకు కర్ణాటకలో పోలీస్‌ వాహనాలపై 112 స్టిక్కర్లను అతికించారు. ప్రధాన కూడళ్ల వద్ద ప్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని చెన్నై, మదురై నగరాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయనున్నారు. మహారాష్ట్రలో వీలైనంత త్వరగా డయల్‌ 112ను అందుబాటులోకి తీసుకువస్తామని ఆ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి ఎస్‌.పటేల్‌ ఇటీవల ప్రకటించారు.

112 ఎందుకు?.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాలా దేశాలు అత్యవసర సేవల కోసం ఒకే నెంబర్ వాడుతున్నాయి. మన దేశంలోనూ ఇలాంటి నంబరు ఉండాలని కేంద్ర ప్రభుత్వం యోచించింది. ప్రస్తుతం మనం పోలీస్‌కు 100, అంబులెన్స్‌కు 108, అగ్నిమాపక శాఖకు 101 ఉపయోగిస్తున్నారు. వీటన్నింటితో పాటు.. విపత్తు నివారణ, గృహహింస, వేధింపుల బాధితులకు సేవలందించేందుకు ఒకే నంబరు ఉండాలని నిర్ణయం తీసుకుంది.

అయితే, దేశవ్యాప్తంగా ఒకే నెంబర్ తీసుకురావడానికి ముందు అన్ని రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం చర్చించింది. ఆ తర్వాత 112ను అత్యవసర సహాయ నెంబర్ గా ప్రకటించింది. ఇకపై ఎమర్జెన్సీకి ఈ 112నే వాడనున్నారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించాలని కేంద్రం తెలిపింది. అన్ని రాష్ట్రాలతో సంప్రదించిన అనంతరం రెండేళ్ల క్రితం 112 నంబరును వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. సాంకేతిక సమస్యలు, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు, చేర్పుల కారణంగా నాలుగైదు రాష్ట్రాలు మినహా ఎక్కడా 112 నంబరు అమలు కావడం లేదు. దీంతో హోం మంత్రిత్వశాఖ గతేడాది చివర్లో అన్ని రాష్ట్రాలను సంప్రదించి మార్చిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించింది. అప్పటి నుంచి ప్రజలు, బాధితులు 100, 108, 101 ఇలా ఏ అత్యవసర సేవలకు ఫోన్‌ చేసినా దానంతట అదే 112కు అనుసంధానమవుతోంది. ఈ ఏడాది అక్టోబరు నాటికల్లా అన్ని అత్యవసర సేవలకు 112 నంబరుకు కాల్‌ చేసేలా చర్యలు చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Read Also… India Coronavirus: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. గత 24గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?