Centre Revives: డిజిటల్ మీడియా సంస్థలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. డిజిటల్ మీడియా నియంత్రణకు కొత్త చట్టం..
డిజిటల్ మీడియాపై నియంత్రణకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లను ప్రవేశపెట్టబోతున్నారు. డిజిటల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తపై నిఘా ఉండబోతోంది. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే కఠినచర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరిస్తోంది.
దేశంలో ఇప్పుడు అడ్డగోలుగా యూట్యూబ్ ఛానెళ్లు పెరిగిపోయాయి. ఫేక్ వార్తలు , అర్ధసత్యాలు ఈ ఛానెళ్లలో కన్పిస్తున్నాయి. కాని ఇకపై డిజిటల్ మీడియా అంటూ ఇష్టమొచ్చిన వార్తలు ప్రసారం చేస్తే నడవదు. పార్లమెంట్‌లో డిజిటల్ మీడియా నియంత్రణ చట్టాన్ని తెచ్చేందుకు కేంద్రం రెడీ అయ్యింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టే అవకాశముంది.రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియడికల్ బిల్లు కింద నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లపై కఠిన చర్యలకు రంగం సిద్దమవుతోంది. బ్రిటీష్ కాలం నాటి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆమ్ బుక్స్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టాన్ని కేంద్రం తీసుకొస్తోంది.
పత్రికల లాగే డిజిటల్ మీడియా సంస్థలకు కూడా రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాబోతోంది. డిజిటల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తపై నియంత్రణ ఉంటుంది. డిజిటల్ మీడియా సంస్థలకు తమ కార్యకలాపాలను ప్రారంభించిన 90 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది. దేశంలో పత్రికలపై నియంత్రణకు రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ సంస్థ ఉంది.
ఇంటర్నెట్ , మొబైల్ , కంప్యూటర్లు వచ్చే అన్ని వార్తలపై నియంత్రణకు కేంద్రం డ్రాఫ్ట్‌ను తయారు చేసింది. వచ్చే వారం పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. ప్రస్తుతం దేశంలో డిజిటల్ మీడియాపై ఎలాంటి నియంత్రణ లేదు. అందుకే యూట్యాబ్ ఛానెళ్ల పేరుతో తమకు ఇష్టం వచ్చిన రీతిలో కొంతమంది వార్తలను అప్‌లోడ్ చేస్తున్నారు. నచ్చని వాళ్లపై అసత్య ప్రచారం చేస్తున్నారు.
విపక్షాలు మాత్రం ఈ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లను టార్గెట్ చేసేందుకే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. పత్రికా స్వేచ్చను హరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి.
కేంద్రం మాత్రం విమర్శలను తప్పుపడుతోంది. డిజిటల్ మీడియా పేరుతో వస్తున్న తప్పుడు వార్తలను నియంత్రించేందుకే ఈ చట్టాన్ని తీసుకొస్తునట్టు స్పష్టం చేసింది.