Farmers Protest: రైతు ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి.. వారి ప్రభావం నుండి బయటకు వస్తేగానీ అంటూ..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.

Farmers Protest: రైతు ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి.. వారి ప్రభావం నుండి బయటకు వస్తేగానీ అంటూ..
Follow us

|

Updated on: Dec 12, 2020 | 8:06 PM

Farmers Protest: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. శనివారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతు సంఘాలు మావోయిస్టుల ప్రభావం నుండి విముక్తి పొందాలని వ్యాఖ్యానించారు. మావోల ప్రభావం నుండి రైతులు బయటకు వస్తేగానీ, చట్టాలు దేశ ప్రయోజనాలకు లోబడి ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకుంటారని అన్నారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం 24 గంటలూ సంసిద్ధంగా ఉందన్నారు. నూతన చట్టాలపై రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పియూష్ గోయల్ పునరుద్ఘాటించారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 17 రోజులుగా రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. వీరి ఆందోళనలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా రైతులతో చర్చలు జరిపింది. అయితే ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో ఏమాత్రం పురోగతి సాధించలేదు. ఫలితంగా రైతులు తమ పోరును ఇంకా కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రైతు ఉద్యమంపై కేంద్ర మంత్రులు రోజుకొకరు చొప్పున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. రైతు ఉద్యమం వెనుక పాకిస్తాన్, చైనా ప్రభావం ఉందని ఒక మంత్రి అంటే.. మావోయిస్టులే రైతులను నడిపిస్తున్నారంటూ మరొక  మంత్రి అంటూ రైతుల ఉద్యమాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు.