Medicine: ఆగస్టు 15న దేశ ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం.. భారీగా తగ్గనున్న ఔషధాల ధరలు..

Medicine: 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు తీపి కబురు చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రజలు ఆరోగ్యానికి చేస్తున్న ఖర్చును భారీగా తగ్గించే దిశగా కేంద్ర అడుగులు వేస్తోంది...

Medicine: ఆగస్టు 15న దేశ ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం.. భారీగా తగ్గనున్న ఔషధాల ధరలు..
Follow us

|

Updated on: Jul 24, 2022 | 7:49 AM

Medicine: 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు తీపి కబురు చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రజలు ఆరోగ్యానికి చేస్తున్న ఖర్చును భారీగా తగ్గించే దిశగా కేంద్ర అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే క్యాన్సర్, మధుమేహంతో పాటు హృదయ సంబంధిత వ్యాధులకు ఉపయోగించే ఔషధాల ధరలను గణనీయంగా తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15న కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఈ విషయమై ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రతిపాదనాలు సిద్ధం చేయగా, అధికారిక ప్రకటన చేయడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కొన్ని రకాల ఔషధాల ధరలపై కేంద్రం ఆందోళన చెందుతోందని, వాటిని నియంత్రించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఔషధాల ధర ఏకంగా 70 శాతం తగ్గే అవకాశం ఉందని సమాచారం. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్ (NLEM )ని కూడా సవరించడానికి కేంద్రం కృషి చేస్తోంది. అంతేకాకుండా రోగులు దీర్ఘకాలం పాటు ఉపయోగించే మందులపై అధికంగా ఉన్న వాణిజ్య మార్జిన్లను పరిమితం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఔషధాల ధరల నియంత్రణపై చర్చించేందుకు జూలై 26న ఫార్మా పరిశ్రమ ప్రతినిధులతో సమావేశానికి ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండానియా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఔషధాల కోసం చేసే ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం డ్రగ్స్‌ ధరల నియంత్రణ సంస్థ 355 రకాల ఔషధాల ధరలను నియంత్రిస్తోంది. ఇందులో భాగంగానే హోల్‌సేల్‌ వ్యాపారులకు 8 శాతం, చిల్లర వ్యాపారులకు 16 శాతం చొప్పున షెడ్యూల్ చేసిన ఔషధాలపై మార్జిన్లను నియత్రించారు. ఆరోగ్యంపై చేస్తోన్న ఖర్చులో అగ్ర భాగం ఔషధాలకే కావడం గమనార్హం. మరి సామాన్యులకు ఊరట కలిగించే ఔషధాల ధరల తగ్గింపుపై ఎలాంటి ప్రకటన వస్తుందో తెలియాలంటే ఆగస్టు 15 వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..