ఇస్రో గూఢచర్యం కేసులో పాకిస్తాన్ ప్రమేయం.. కేరళ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో సీబీఐ అనుమానం
ఇస్రో గూఢచర్యం కేసులో పాకిస్తాన్ ప్రమేయం ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేరళ హైకోర్టుకు సమర్పించిన తమ అఫిడవిట్ లో పేర్కొంది.
ఇస్రో గూఢచర్యం కేసులో పాకిస్తాన్ ప్రమేయం ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేరళ హైకోర్టుకు సమర్పించిన తమ అఫిడవిట్ లో పేర్కొంది. కొంతమంది మాజీ అధికారులతో లాలూచీ పడిఉండవచ్చునని అభిప్రాయపడింది. ఈ కేసులో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి శ్రీకుమార్ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్ ను తిరస్కరించాలని సీబీఐ అధికారులు అభ్యర్థించారు. అయితే ఆయనను సోమవారం వరకు అరెస్టు చేయరాదని కోర్టు ఆదేశించింది. 1994 నాటి ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇస్రోకు చెందిన ప్రముఖ శాస్త్రజ్ఞుడు నంబి నారాయణన్ ను, మరో ఇద్దరినీ ఆ నాడు అరెస్టు చేయగా తన అరెస్టును సవాలు చేస్తూ ఆయన అప్పట్లో కోర్టుకెక్కారు. 1995 లో ఆయనను విడుదల చేసినప్పటికీ ఆయన సుదీర్ఘ కాలం న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. చివరకు ఆయనను ఇన్నాళ్లుగా వేధిస్తూ వచ్చారని,మానసికంగా ఎంతో క్షోభ పెట్టారని అంటూ.. ఆయనకు రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు 2018 లో తీర్పునిచ్చింది.
ఆయనను, మరికొందరిని ఈ కేసులో ఇరికించడానికి శ్రీకుమార్ కుట్ర పన్నారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నామని పేర్కొంది. ఇస్రో గూఢచర్యానికి సంబందించి పలు డాక్యుమెంట్లను తారుమారు చేసేందుకు మొత్తం 18 మంది కుట్ర పన్నారని, వీరిలో కేరళ మాజీ పోలీసు అధికారులు, ఐబీ అధికారులు కూడా ఉన్నారని పేర్కొంటూ సీబీఐ తన చార్జిషీట్ ను దాఖలు చేసింది. అటు-ఈ కేసులో ఇద్దరు మాజీ పోలీసు అధికారులకు కోర్టు రెండు వారాల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. నిజానికి వీరిద్దరిపైనా వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని సీబీఐ వెల్లడించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: పాకిస్తాన్ లో ఆ పెళ్లికూతురు ధరించిన లెహెంగా ఎన్ని కేజీల బరువంటే..? పేలిపోయిన నెటిజన్ల జోకులు, కామెంట్లు