Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2025: వేతన జీవులకు ఊరట కలిగేనా..? ఇవ్వాల్టి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు..

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 16 బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెడుతారు. కేంద్ర బడ్జెట్‌ను రేపు ప్రవేశపెడుతారు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌. తెలుగు రాష్ట్రాల ఎంపీలు పలు డిమాండ్లను లేవనెత్తబోతున్నారు. ఇవ్వాళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

Union Budget 2025: వేతన జీవులకు ఊరట కలిగేనా..? ఇవ్వాల్టి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు..
Union Budget 2025
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 31, 2025 | 6:57 AM

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇవ్వాల్టి నుంచి ( 31 జనవరి, 2025) ప్రారంభం కానున్నాయి. బడ్జెట్‌తో పాటు ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎజెండా సిద్ధం చేసింది. పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆనవాయితీగా నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో తమ ఎజెండాను కేంద్రం తెలియజేసింది. ప్రతిపక్షాలు మాట్లాడేందుకు తగిన సమయం కేటాయిస్తామని, అయితే సభను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ప్రతిపక్షాలను ప్రభుత్వం కోరింది. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శనివారం ఉదయం గం.11.00కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్‌ సమావేశాల్లో ఆర్థిక బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, వక్ఫ్‌ సవరణ బిల్లుతో సహా మొత్తం 16 బిల్లులను పార్లమెంట్​లో ప్రవేశ పెట్టనున్నారు. రెండు విడతలు జరిగే ఈ సమావేశాల్లో తొలి విడత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి. తొలిరోజు ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశ పెడతారు. శుక్రవారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి.

గతంలో ఉభయ సభలు ప్రస్తుత సంవిధాన్ సదన్ సెంట్రల్ హాలులో కార్యక్రమం జరిగేది. ఉభయ సభల సభ్యులు కూర్చునేంత పెద్దగా లోక్‌సభలో సీటింగ్ ఏర్పాటు ఉంది కాబట్టి.. రాష్ట్రపతి ప్రసంగం కొత్త భవనంలో లోక్‌సభలోనే జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ఆర్థిక సర్వే టేబుల్ చేయనున్నారు. బడ్జెట్‌ను నిర్మల ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వసారి కావడం గమనార్హం. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీయే సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్‌ ఇదే.

ఈసారి మిత్రపక్షాల డిమాండ్లకు.. బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత లభించే అవకాశం

ఎన్డీఏ మూడోసారి ప్రభుత్వాన్ని మిత్రపక్షాల మద్దతుతో ఏర్పాటుచేసింది కాబట్టి ఈసారి మిత్రపక్షాల డిమాండ్లకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ అప్పట్లోనే వివిధ రాజకీయ పార్టీలు కేంద్రంపై విమర్శలు చేశాయి. అయినా సరే.. మిత్రపక్షాలను సంతృప్తిపరిచే క్రమంలో కేంద్రం తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ (యునైడెట్) పార్టీలు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు కోరిన డిమాండ్లను నెరవేర్చుతూ ముందుకెళ్తోంది.

ప్రజలకు చెందిన అన్ని సమస్యలను లేవనెత్తుతాం..

మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష ఇండి కూటమి ప్రజలకు చెందిన అన్ని సమస్యలను లేవనెత్తుతుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మహా కుంభమేళా తొక్కిసలాట ఘటన, వీఐపీ సంస్కృతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల దుస్థితిని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ తెలిపారు. ఇండి కూటమి పక్షాలను కలుపుకుని సామాన్య ప్రజల సమస్యల్ని పార్లమెంటులో లేవనెత్తుతామని ఆయన చెప్పారు. కచ్చతీవు అంశాన్ని అన్నాడీఎంకే ప్రస్తావించింది. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ను సభలో ప్రస్తావిస్తామని బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర చెప్పారు. వక్ఫ్‌ బిల్లుపై జేపీసీ నివేదికను వ్యతిరేకిస్తున్నట్లు పలు పార్టీలు వెల్లడించాయి.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఆల్ పార్టీ మీటింగ్‌లో బీఆర్ఎస్ నుంచి ఎవరూ హాజరుకాలేదు. కేఆర్ సురేష్ రెడ్డి హాజరుకావాల్సినప్పటికీ.. అనివార్య కారణాలతో తాను హాజరుకాలేకపోతున్నానని లేఖ ద్వారా ఆయన తెలియజేశారు. అంతేకాదు, అఖిలపక్ష సమావేశంలో తమ పార్టీ లేవనెత్తాల్సిన అంశాలను లేఖలోనే పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం, జనసేన పార్టీలు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సహాయంపై కృతజ్ఞతలు తెలియజేశారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీల్లో అపరిష్కృతంగా ఉన్న అంశాలను త్వరగా పూర్తిచేయాలని ఆల్ పార్టీ సమావేశంలో కోరినట్టు తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర జలశక్తి శాఖపై ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై స్వల్పకాలిక చర్చను పెట్టి కేంద్రం సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మార్గదర్శి చిట్స్ అవకతవకలు సహారా కుంభకోణం కంటే పెద్దవని, అందులో డిపాజిటర్లకు రక్షణ కల్పించాలని అన్నారు. ఈ అంశంపై కూడా పార్లమెంటులో చర్చకు తాము పట్టుబడతామని తెలిపారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరగనున్నాయి. ఈ బడ్జెట్‌లోనైనా ప్రత్యక్ష పన్నుల (ఆదాయపు పన్ను) శ్లాబ్ సడలించి మధ్యతరగతి వేతన జీవులకు ఊరట కల్గిస్తారా అని దేశంలోని ఉద్యోగవర్గాలు ఎదురుచూస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. ఈ సవాళ్ల మధ్య కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను సజావుగా నిర్వహించడం కత్తిమీద సాములా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..