Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main 2025 April Session: ఇవాళ్టి నుంచి జేఈఈ మెయిన్‌ రెండో విడత దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీలివే

మొత్తం ఐదు రోజుల పాటు నిర్వహించిన జేఈఈ మెయిన్ 2025 తొలి విడత పరీక్షలు గురువారం (జనవరి 30 వ తేదీ)తో ముగిశాయి. ఈ పరీక్షల ఆన్సర్ కీ మరో రెండు మూడు రోజుల్లో విడుదలవనుంది. అనంతరం త్వరలోనే ఫలితాలు కూడా వెల్లడిస్తారు. ఇక ఇవాళ్టి నుంచి జేఈఈ మెయిన్ రెండో విడత ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి..

JEE Main 2025 April Session: ఇవాళ్టి నుంచి జేఈఈ మెయిన్‌ రెండో విడత దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీలివే
JEE Main 2025 April Session
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 02, 2025 | 8:01 AM

హైదరాబాద్‌, జనవరి 31: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్‌-2025 తొలి విడత పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్‌ 1 పరీక్షలు, జనవరి 30న పేపర్ 2 పరీక్ష జరిగాయి. మొత్తం ఐదు రోజులపాటు రోజుకు రెండు విడతల్లో మొత్తం 10 సెషన్లలో ఈ పరీక్షలు జరిగాయి. అన్ని సెషన్లతో పోల్చితే ఈ నెల 28న ఉదయం జరిగిన పరీక్ష కఠినమని అనుకున్నామని, కానీ జనవరి 29న రెండో షిఫ్ట్‌ ప్రశ్నపత్రంలో మూడు సబ్జెక్టుల ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మూడు నాలుగు రోజుల్లో ప్రాథమిక కీ విడుదల చేసే అవకాశం ఉంది. దానిపై అభ్యంతరాలను స్వీకరించి పర్సంటైల్‌ స్కోర్‌ను ఫిబ్రవరి 12న ప్రకటించనున్నారు.

ఇక జేఈఈ మెయిన్‌ 2025 రెండో విడత (ఏప్రిల్‌ సెషన్‌) పరీక్షలకు దరఖాస్తులు శుక్రవారం (జనవరి 31) నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీ దరఖాస్తుకు తుది గడువు. ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ పరీక్షలు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు.. ఇలా రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. తొలి విడత పరీక్షలకు దేశ వ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా.. మలి విడతలో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు విడతల్లో వచ్చిన ర్యాంకుల్లో తొలి 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అనుమతిస్తారన్న సంగతి తెలిసిందే. మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఉంటుంది. జేఈఈ మెయిన్‌ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, అడ్వాన్స్‌డ్‌ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు పొందొచ్చు.

కాగా దేశ వ్యాప్తంగా ఉన్న 31 ఎన్‌ఐటీల్లో గత ఏడాది సుమారు 24 వేలు సీట్లు, 23 ఐఐటీల్లో 17,600, ట్రిపుల్‌ఐటీల్లో దాదాపు 8500 సీట్లు, ఇతర విద్యాసంస్థల్లో 57 వేల సీట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ జేఈఈ మెయిన్‌ రాసిన ప్రతి వంద మందిలో నలుగురికి మాత్రమే సీట్లు దక్కుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.