B.S.Yediyurappa: కర్ణాటక అధికార బీజేపీలో రాజుకుంటున్న అసమ్మతి సెగ.. యడ్యూరప్పకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల గళం..!

కర్నాటకలో రాజకీయాల్లో మరోసారి మెల్లగా అసమ్మతి సెగ రాజుకున్నట్లు కనిపిస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్పకు పదవీ గండం పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

B.S.Yediyurappa: కర్ణాటక అధికార బీజేపీలో రాజుకుంటున్న అసమ్మతి సెగ.. యడ్యూరప్పకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల గళం..!
B.s.yediyurappa
Follow us

|

Updated on: May 29, 2021 | 2:44 PM

B.S.Yediyurappa: కర్నాటకలో రాజకీయాల్లో మరోసారి మెల్లగా అసమ్మతి సెగ రాజుకున్నట్లు కనిపిస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్పకు పదవీ గండం పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్ అధికారికంగా ముగిశాక వచ్చే నెల ఏడో తేదీన ఈ విషయంపై స్పష్టత రావచ్చని భారతీయ జనతా పార్టీ వర్గాలు గుసగుజలాడుకుంటున్నాయి.

ఇప్పటికే పెద్ద సంఖ్యలో బీజేపీ శాసనసభ్యులు సీఎం యడ్యూరప్పకు వ్యతిరేకంగా కూటమి కట్టినట్లు తెలుస్తోంది. వీరు ఇటీవలి కాలంలో ఢిల్లీకి కూడా వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర ముఖ్యనేతలతో భేటీ అయ్యినట్లు సమాచారం. కర్నాటకలో సీఎంను మార్చాల్సిన ఆవశ్యకతను వివరించారని వినవస్తోంది. కేంద్రం కూడా ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు జూన్ ఏడో తేదీ తర్వాత ఒక నిర్ణయం తీసుకుందామని వారికి చెప్పినట్లు సమాచారం.

యడ్యూరప్ప కర్ణాటక లోనే సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి. దక్షిణాదిలో ముఖ్యంగా కర్ణాటకలో అధికారంలోకి రావడానికి ఆయన ఎంతో కృషీ చేశారు. ఇప్పటికి ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు. మూడుసార్లు ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. ఎనిమిది సార్లుగా ఓటమి లేకుండా అసెంబ్లీకి ఎన్నికవుతూ వస్తున్నారు. అయితే, ఇటీవల యడ్యూరప్ప ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులకు నచ్చకపోవడం వల్లనే వారు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని రాజకీయవర్గాలు చెప్తున్నాయి.

ఇటీవల యడ్యూరప్ప ప్రభుత్వం బళ్లారిలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీకి దాదాపు నాలుగు వేల ఎకరాల భూమిని కేటాయించింది. అది మెజారిటీ బీజేపీ ఎమ్మెల్యేలకు రుచించలేదు. జనతాదళ్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ ప్రతిపాదన రూపుదిద్దుకుంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ దీన్ని వ్యతిరేకించింది. అదే బీజేపీ ఇప్పుడు పవర్ లోకి రాగానే ఈ భూ పందారం చేయడాన్ని కొందరు శాసనసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో నలుగురు పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేస్తూ సీఎంకు నేరుగానే లేఖ రాశారు. ఇది బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని, పార్టీకి చెడ్డపేరు వస్తుందని వారంతా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా యడ్యూరప్ప స్పందించలేదు.

అంతేగాకుండా ముఖ్యమంత్రి పార్టీ ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్న అసంతృప్తి మరికొందరిలో ఉంది. కరోనా సంక్షోభంలో ఎమ్మెల్యేలు తమకు ముఖ్యులైన వారికి పడకల కోసం చేసిన సిఫార్సులు కూడా చెల్లలేదని, అధికారులు ఇలా వ్యవహరించడానికి కారణం ముఖ్యమంత్రి వారికి ఇచ్చిన ఆదేశాలే అని మరికొందరు వాపోతున్నారు. ఒక ఎమ్మెల్యేగా తమకు గౌరవం విలువ అధికారం ఏమీ లేవని వారు చెప్పారు. ఈ కోవకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు నలభై మంది వరకు ఉన్నారని, త్వరలోనే వారు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కూడా ప్రారంభించనున్నట్లు జాతీయ మీడియా చెబుతోంది. ఇప్పటికే యడ్యూరప్పపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో లాక్‌డౌన్ తరువాత తేలనుంది.

Read Also….  Etela Rajender Yagam: గ్రహశాంతి చేయించుకుంటున్న మాజీ మంత్రి.. ఆరుగురు పండితులతో యాగాలు, పూజలు.. కారణం అదేనా..!