AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీ ఎన్నికలకు BJP మాస్టర్ ప్లాన్.. జాతీయ కార్యవర్గంలో అగ్రపీఠం ఆ రాష్ట్రానికే..

బీజేపీ ప్రకటించిన కొత్త జాతీయ కార్యవర్గంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు భారీ ప్రాధాన్యం దక్కింది. కీలక పదవుల్లో యూపీకి చెందిన ఎనిమిది మందికి చోటు కల్పించగా, తెలంగాణ నుంచి ఒక్కరికీ అవకాశం లభించలేదు. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ జాతీయ కార్యవర్గంలో యూపీకి అత్యధిక ప్రాధాన్యత కల్పించినట్లు రాజకీయ విశ్లేషణలు సూచిస్తున్నాయి.

యూపీ ఎన్నికలకు BJP మాస్టర్ ప్లాన్.. జాతీయ కార్యవర్గంలో అగ్రపీఠం ఆ రాష్ట్రానికే..
Hm Amit Shah And Pm Narendra Modi (File Photo)
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Aug 17, 2026 | 5:48 PM

Share

భారతీయ జనతా పార్టీ (BJP) ప్రకటించిన కొత్త జాతీయ కార్యవర్గాన్ని పరిశీలిస్తే ఆ పార్టీ ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. నితిన్ నబీన్ తన కొత్త టీమ్‌లో యూపీకి సింహభాగం కట్టబెట్టగా, తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కరికి కూడా చోటు కల్పించలేదు. జాబితాలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్న హరీష్ ద్వివేది, స్మృతి ఇరానీ, జాతీయ కార్యదర్శులుగా ఉన్న భోలా సింగ్, సంగీత యాదవ్, జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్న రేఖా వర్మ, డా. తారిఖ్ మన్సూర్ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే. వీరితో పాటు ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా అమర్‌పాల్‌ మౌర్య, మైనారిటీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా కున్వర్ వాషిత్ అలీని నితిన్ నబీన్ ఎంపిక చేశారు. పరిమిత సంఖ్యలో ఏర్పాటు చేసుకున్న జాతీయ కార్యవర్గంలో యూపీ నుంచి ఏకంగా 8 మందికి కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక వ్యూహం 2027లో జరగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే అని అర్థమవుతోంది.

2027లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వారిలో ముఖ్యంగా ఓబీసీ మోర్చాకు అమర్‌పాల్ మౌర్యను ఎంపిక చేయడం వ్యూహాత్మకంగా చూడొచ్చు. తెలంగాణకు చెందిన డా. కే. లక్ష్మణ్ స్థానంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓబీసీ నేత అమర్‌పాల్ మౌర్యకు జాతీయ ఓబీసీ మోర్చా పగ్గాలు అప్పగించడం వెనుక ఆ రాష్ట్రంలో సామాజిక సమీకరణాలను బలోపేతం చేసే లక్ష్యం కనిపిస్తోంది. మౌర్య, కుష్వాహ, శాక్య, సైని వంటి ప్రభావవంతమైన వెనుకబడిన వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు తెలుస్తోంది.

ఈ నియామకం ఎందుకు కీలకం?

2014 నుంచి యూపీలో బీజేపీకి అండగా నిలిచిన ఓబీసీ ఓటు బ్యాంకులో 2024 లోక్‌సభ ఎన్నికల్లో కొంత చీలిక వచ్చింది. ఓబీసీ వర్గాల్లో యాదవులు సమాజ్‌వాదీ పార్టీ వెంట నిలవగా, యాదవేతర OBC వర్గాలు కాషాయదళానికి వెన్నుదన్నుగా నిలిచాయి. సమాజ్‌వాదీ పార్టీ ‘PDA’ (వెనుకబడిన వర్గాలు, దళిత వర్గాలు, మైనార్టీ వర్గాలు) పేరుతో అమలు చేసిన వ్యూహం 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటుబ్యాంకుకు గండి పెట్టి గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. ఈ క్రమంలో తాము చేజార్చుకున్న యాదవేతర ఓబీసీ వర్గాలను మళ్లీ తమవైపు తిప్పుకునే వ్యూహాల్లో కమలనాథులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే మౌర్య వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యులు అమర్‌పాల్ మౌర్యను ఎంపిక చేసినట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

యూపీ రాజకీయాల్లో కేశవ్‌ప్రసాద్ మౌర్య తర్వాత జాతీయ స్థాయిలో మౌర్య సామాజిక వర్గానికి చెందిన కీలక నేతగా అమర్‌పాల్ మౌర్య ఎదిగారు. గతంలో యూపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో నాన్-యాదవ్ ఓబీసీ ఓట్లను మళ్లీ బీజేపీ వైపు తిప్పుకోవడానికి ఈ నియామకం ఉపయోగపడుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది.

మరోవైపు కేంద్ర మంత్రిగా పనిచేసిన స్మృతి ఇరానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఓడించి యావద్దేశం దృష్టిని ఆకట్టుకున్నారు. మాటకారితనంతో పార్టీలో మంచి వక్తగా పేరుగాంచిన ఆమె జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టడం ద్వారా యూపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఆమె సేవలను పార్టీ మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఆమెతో పాటు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన హరీష్ ద్వివేదికి కూడా జాతీయ ప్రధాన కార్యర్శిగా బాధ్యతలు అప్పగించగా.. యువ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సంగీతా యాదవ్‌కు జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా ఈ జాతీయ బృందంలో 40 ఏళ్ల లోపు వయసున్న వారు 6 గురు, 40–49 ఏళ్ల మధ్య వయసున్న వారు 15 మంది, మరియు 50–59 ఏళ్ల మధ్య వయసున్న వారు 21 మంది ఉన్నారు.

Follow Us