BJP: పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్.. ఎవ్వరూ ఊహించని రీతిలో నిర్ణయాలు
ఛత్తీస్‌గఢ్‌లో రమణ్ సింగ్ స్పీకర్ పదవికి అంగీకరించడంతో అక్కడ వివాదం లేకుండా పోయింది. మధ్యప్రదేశ్‌లో తనను సీఎం చేయకున్నా సైలెంట్ అయిపోయారు శివరాజ్‌సింగ్ చౌహాన్. అయితే మధ్యప్రదేశ్ వీడబోనని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 29 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేయడమే లక్ష్యమని శివరాజ్ గతంలో ప్రకటించారు. మరో మూడు నెలల్లో లోక్‌సభ..

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించి అధికారం దక్కించుకున్న బీజేపీ ముఖ్యమంత్రుల ఎంపికలో పాత పద్ధతులకు స్వస్తి చెప్పింది. ఎవ్వరూ ఊహించని రీతిలో వ్యూహాలు అమలు చేస్తూ కొత్తవారిని సీఎంలుగా ఎంపిక చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనుడైన విష్ణు దేవ్ సాయ్‌ను సీఎంగా, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం రమణ్ సింగ్‌ను స్పీకర్‌గా చేశారు. మధ్యప్రదేశ్‌లో మాజీ విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మరో ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను స్పీకర్‌గా ప్రకటించారు. గిరిజనులకు, యాదవులకు, ఇతర సామాజికవర్గాల వారికి కీలక పోస్టులు కేటాయించడం ద్వారా బీజేపీ కేంద్ర నాయకత్వం సోషల్ ఇంజినీరింగ్ అమలు చేసినట్లైంది. రాజస్థాన్‌లో కూడా ఇదే ఫార్ములా అప్లై చేస్తూ ఎవ్వరూ ఊహించని వారిని ముఖ్యమంత్రిగా చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో రమణ్ సింగ్ స్పీకర్ పదవికి అంగీకరించడంతో అక్కడ వివాదం లేకుండా పోయింది. మధ్యప్రదేశ్‌లో తనను సీఎం చేయకున్నా సైలెంట్ అయిపోయారు శివరాజ్‌సింగ్ చౌహాన్. అయితే మధ్యప్రదేశ్ వీడబోనని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 29 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేయడమే లక్ష్యమని శివరాజ్ గతంలో ప్రకటించారు. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో శివరాజ్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశమే లేదు. అధిష్టానం కోరుకుంటే పార్టీ జాతీయ నాయకత్వ బాధ్యతలు తీసుకునేందుకు శివరాజ్ ఆసక్తిగా ఉన్నారా లేదా అనేది ఇంకా వెల్లడి కాలేదు.
బీజేపీ కేంద్ర నాయకత్వ దూకుడు చూస్తుంటే రాజస్థాన్‌లోనూ ఊహించని అభ్యర్థే సీఎం అయ్యేలా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రచారంలో ఉన్న మాజీ సీఎం వసుంధరతో సహా దిగ్గజాలను బీజేపీ జాతీయ నాయకత్వం పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలోనూ ఫలానా వాళ్లను సీఎం చేస్తామని బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రకటించలేదు. అందుకే మూడు రాష్ట్రాల్లోనూ విజయఢంకా మోగించగలిగారనేది విశ్లేషకుల అంచనా.
శివరాజ్‌సింగ్ చౌహాన్, వసుంధరా రాజే వంటి సీనియర్లను పక్కనపెడితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో మెజార్టీ స్థానాలు గెలవడం కష్టంగా మారొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని 29 స్థానాలకు గాను 28 చోట్ల, రాజస్థాన్‌లోని 25 స్థానాలకు గాను 24 చోట్ల బీజేపీ నెగ్గింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని యోచిస్తోన్న బీజేపీ కేంద్ర నాయకత్వం.. సీనియర్లు సమస్యగా మారకుండా ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తుందో చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి