AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar: బీహార్‌లో అమానుషం.. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై అధికారి విచక్షణారహిత దాడి.. షాకింగ్ వీడియో

బీహార్ లో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం నితీష్ కుమార్ హామీ ఇచ్చి వారం రోజులు గడవక ముందే.. తమకు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీచేయాలంటూ నిరసన తెలుపుతున్న వారిపై అధికారులు మానవత్వం లేకుండా లాఠీలతో..

Bihar: బీహార్‌లో అమానుషం.. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై అధికారి విచక్షణారహిత దాడి.. షాకింగ్ వీడియో
Adm Could Be Seen Thrashing
Amarnadh Daneti
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 22, 2022 | 6:46 PM

Share

Bihar:  బీహార్ లో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం నితీష్ కుమార్ హామీ ఇచ్చి వారం రోజులు గడవక ముందే.. తమకు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీచేయాలంటూ నిరసన తెలుపుతున్న వారిపై అధికారులు మానవత్వం లేకుండా లాఠీలతో విరుచుకుపడటం సంచలనం రేపుతోంది. ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలంటూ నిరుద్యోగులు జాతీయ జెండాలు పట్టుకుని ఈరోజు పాట్నాలో ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా పాట్నా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (లా అండ్ ఆర్డర్) కెకె.సింగ్ జాతీయ జెండా చేతితో పట్టుకున్న ఓ ఆందోళన కారుడిని లాఠీతో కొట్టిన వీడియో కలకలం రేపుతోంది. కర్రతో కొట్టిన తర్వాత మరికొంతమంది అధికారులు ఆవ్యక్తిని ఈడ్చుకుంటూ వెళ్తున్నట్లు వీడియో స్పష్టంగా కనపడుతోంది. ఇదే సమయంలో ఆందోళన కారులను నియంత్రించడానికి పోలీసులు వాటర్ క్యాన్ లను ప్రయోగించారు. కొద్దిరోజుల కిందటే 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్ ప్రకటించారు. దీనిని సమర్థిస్తూ సీఎం నితీష్ కుమార్ ఈనెల 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చేసిన ప్రసంగంలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు.. మరో 10లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈనేపథ్యంలో త్వరితగతిన ఉద్యోగ ప్రకటన జారీచేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో అధికారులు వ్యవహరిచిన తీరు పలు విమర్శలకు తావిస్తోంది.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జాప్యాన్ని నిరసిస్తూ వందలాది మంది పాట్నాలోని డాక్ బంగ్లా చౌరస్తా వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు. దీంతో అక్కడే ఉన్న పాట్నా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కెకె.సింగ్ జాతీయ జెండా పట్టుకుని నిరసన తెలుపుతున్న యువకుడిని కర్రతో తీవ్రంగా కొట్టిన వీడియో వైరల్ గా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఈఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ జిల్లా మేజిస్ట్రేట్ తో మాట్లాడి.. ఘటనపై తక్షణమే దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లు ఉపముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈఘటనపై విచారణకు ముగ్గురితో ప్రత్యేక కమిటిని జిల్లా మేజిస్ట్రేట్ నియమించారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ మహాఘట్ బంధన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..