Bihar Assembly Elections: కాంగ్రెస్ కూటమికి ఎంఐఎం భారీ షాక్.. ఒంటరిగా బరిలోకి.. ఫస్ట్ లిస్ట్ రిలీజ్..
బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి ఇది షాక్ అని చెప్పొచ్చు. ఆర్జేడీతో పొత్తుకు తాము ప్రతిపాదనలు పంపినా.. స్పందన రాకపోవడంతో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ఎంఐఎం అధ్యక్షుడు తెలిపారు. ఈ క్రమంలో ఎంఐఎం పార్టీ తమ తొలి జాబితాలో 32 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ముఖ్యంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంపై ఆ పార్టీ దృష్టి పెట్టింది.

బీహార్‌లో మరోసారి కాంగ్రెస్ కూటమికి షాక్ ఇచ్చేందుకు ఎంఐఎం సిద్ధమైంది. గత ఎన్నికల్లో ఓట్లు చీల్చి హస్తం కూటమికి గట్టి ఝలక్ ఇచ్చిన మజ్లీస్.. ఈ సారి కూడా ఎన్నికల బరిలో నిలిచింది. ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 32 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సాధారణంగా ప్రధాన పార్టీలు పాట్నా నుంచి జాబితాలు ప్రకటిస్తుండగా.. ఎంఐఎం ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి ముస్లిం జనాభా అధికంగా ఉన్నకిషన్‌గంజ్‌లోని సింఘియా ప్రాంతంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఈ జాబితాను ప్రకటించడం గమనార్హం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్, జాతీయ ప్రతినిధి ఆదిల్ హుసైన్ కలిసి మీడియా ముందు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.
ఎక్కడెక్కడ పోటీ..?
ఎంఐఎం ప్రకటించిన 32 స్థానాలు మొత్తం 16 జిల్లాలకు చెందినవి. ముఖ్యంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంపై ఆ పార్టీ ప్రధానంగా దృష్టి సారించింది. కిషన్‌గంజ్, కోచాధామన్, బహదుర్‌గంజ్, ఠాకుర్‌గంజ్, అమౌర్, బాయసీ, కస్బా, బలరాంపూర్, ప్రాణ్‌పూర్, మనిహారి, బరారి, కద్వా, హాట్, అరరియా నియోజకవర్గాలు దీన్ని పరిధిలోకి వస్తాయి. సీమాంచల్‌తో పాటు గయా, దర్బంగా, భాగల్పూర్, సివాన్, గోపాల్‌గంజ్ వంటి ఇతర జిల్లాల్లో కూడా అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే లక్ష్యాన్ని ఎంఐఎం స్పష్టం చేసింది.
ఆర్జేడీతో పొత్తు ప్రతిపాదన విఫలం..!
పార్టీ అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్ర రాజకీయాల్లో మూడో ఫ్రంట్‌గా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. సెక్యులర్ ఓట్ల విభజన** జరగకుండా ఉండేందుకు తాము ఆర్జేడీతో పొత్తుకు ప్రతిపాదనలు పంపించామని.. కానీ వారు స్పందించకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమానత్వం, ప్రాంతీయ సమతుల్యతకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. త్వరలో విడుదల చేసే మిగతా జాబితాలలో మహిళలకు గౌరవప్రదమైన ప్రాతినిధ్యం కల్పిస్తామని ఇమాన్ హామీ ఇచ్చారు. ఎంఐఎం ఈ నిర్ణయం ద్వారా సీమాంచల్ ప్రాంతాన్ని తమ మద్దతు బేస్‌గా మార్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఎన్నికల్లో కిషన్‌గంజ్‌లో విజయం సాధించిన ఎంఐఎం, ఈసారి మరిన్ని స్థానాల్లో విజయంపై దృష్టి సారించింది.
ఎంఐఎం ఏకపక్ష నిర్ణయం కారణంగా ముస్లిం ఓట్లు చీలిపోయి ఆర్జేడీ – కాంగ్రెస్ కూటమికి నష్టం జరగడంతో పాటు రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తొలి జాబితా విడుదల బీహార్ ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




