కూతురినే ఎరగా.. యాసిడ్ దాడి కేసులో మెంటలెక్కే ట్విస్ట్.. మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా..
ఢిల్లీలో 20 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన యాసిడ్ దాడి కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ప్రధాన నిందితుడిని ఇరికించడానికి ఆ విద్యార్థిని తండ్రి అఖిల్ ఖానే ఈ దాడికి కుట్ర పన్నాడని పోలీసులు తేల్చారు. జితేందర్ అనే వ్యక్తి భార్య పెట్టిన అత్యాచారం కేసు నుంచి తప్పించుకోవడానికే, టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్‌తో కూతురి సహాయంతో ఈ నాటకమాడినట్లు అఖిల్ అంగీకరించాడు.

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర చర్చనీయాంశమైన యాసిడ్ దాడి కేసు ఊహించని మలుపు తిరిగింది. 20 ఏళ్ల ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినిపై జరిగిన దాడి వెనుక అసలు కుట్రదారు ఆ విద్యార్థిని తండ్రేనని పోలీసులు వెల్లడించారు. జితేందర్ అనే వ్యక్తిని ఇరికించడానికే ఈ దాడికి ప్లాన్ చేశానని తండ్రి అఖిల్ ఖాన్ అంగీకరించారు. దీంతో అఖిల్ ఖాన్‌ను పోలీసులు అత్యాచారం కేసులో అరెస్టు చేశారు. అఖిల్ తనను లైంగికంగా హింసిస్తున్నాడంటూ జితేందర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అత్యాచారం కేసు నుండి తప్పించుకునే ప్రయత్నంలో అఖిల్ ఖాన్, అతడి కూతురు కలిసి ఒక యాసిడ్ దాడి కథను కల్పించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో జితేందర్‌తో పాటు అతని ఇద్దరు సహచరులు ఇషాన్, అర్మాన్‌లను ఇరికించాలని ప్లాన్ చేశారు.
ప్రతీకారం కోసం ప్లాన్
జితేందర్ భార్య అత్యాచారం కేసు పెట్టబోతోందన్న విషయం తెలుసుకున్న అఖిల్ ఖాన్.. ప్రతీకారం తీర్చుకునేందుకు జితేందర్‌ను నకిలీ యాసిడ్ దాడి కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నినట్లు తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడి కోసం టాయిలెట్ శుభ్రం చేసే యాసిడ్‌ను కొనుగోలు చేసి, తన తండ్రి సహాయంతో యువతి ఈ దాడికి పాల్పడింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులకు సదరు యువతిపై అనుమానం కలిగింది. యువతి చెప్పిన టైమ్‌లో జితేందర్ వేరే ప్లేస్‌లో ఉన్నట్లు విచారణలో తేల్చారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ సైతం జితేందర్ నిజం చెప్పినట్లు నిరూపించాయి. దీంతో పోలీసులు యువతి తండ్రిని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.
కేసు మలుపు
యాసిడ్ దాడి జరిగినట్లు ఆరోపించిన రెండు రోజుల ముందు.. అక్టోబర్ 24న జితేందర్ భార్య పిసిఆర్ కాల్ చేసి.. అఖిల్ తనను లైంగికంగా వేధించాడని, బ్లాక్ మెయిల్ చేశాడని ఫిర్యాదు చేసింది. 2021-2024 మధ్య కాలంలో అఖిల్ తన ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఈ వేధింపులు జరిగినట్లు ఆమె ఆరోపించింది. ప్రస్తుతం జితేందర్‌ను ఇరికించడానికి కుట్ర పన్నినందుకు, అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో అఖిల్ ఖాన్‌ను అరెస్టు చేశారు. యాసిడ్ దాడికి ఉపయోగించిన మోటార్‌బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




