Rahul Gandhi: భారత్ జోడో యాత్రకు బ్రేక్.. ఒక్కసారిగా కనిపించకుండా పోయిన భద్రతా సిబ్బంది.. చివరకు..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో శుక్రవారం హైడ్రామా నడిచింది. రాహుల్‌కి సెక్యూరిటీ కల్పించడంలో వైఫల్యం జరిగింది. దీంతో పాదయాత్రకు బ్రేక్ పడింది.

Rahul Gandhi: భారత్ జోడో యాత్రకు బ్రేక్.. ఒక్కసారిగా కనిపించకుండా పోయిన భద్రతా సిబ్బంది.. చివరకు..
Bharat Jodo Yatra
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 28, 2023 | 7:08 AM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో శుక్రవారం హైడ్రామా నడిచింది. రాహుల్‌కి సెక్యూరిటీ కల్పించడంలో వైఫల్యం జరిగింది. దీంతో పాదయాత్రకు బ్రేక్ పడింది. ఇలా ఎందుకు జరిగింది.. కారణం ఎవరు..? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. జమ్మూ దాటి కశ్మీర్‌లోకి ప్రవేశించింది. రోజూ లాగే శుక్రవారం కూడా కాంగ్రెస్ యాత్ర మొదలైంది. ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొన్నారు. బనీహాల్‌లో నడుస్తున్న సమయంలో.. అర్ధాంతరంగా యాత్ర ఆగిపోయింది. కశ్మీర్ లోయలో మొత్తం 20 కిలోమీటర్లు రాహుల్ పాదయాత్ర జరగాల్సి ఉంది. బనిహాల్‌లో శుక్రవారం నడక మొదలుపెట్టి కిలోమీటర్ వరకూ యాత్ర సజావుగా జరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కూడా ఆయనతో కలిసి అడుగులు వేశారు. కిలోమీటర్ తర్వాత ఒక్కసారిగా రాహుల్‌కు కల్పించిన సెక్యూరిటీ తగ్గిపోయింది.

భద్రతా సిబ్బంది ఒక్కసారిగా పక్కకు వెళ్లడంతో.. రాహుల్‌పైకి జనం దూసుకువచ్చారు. దీంతో యాత్ర విరమించుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందంటోంది కాంగ్రెస్. అకస్మాత్తుగా సెక్యూరిటీ సిబ్బంది వెళ్లిపోవడానికి కారణం ఎవరంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్. దీనికి పలు కారణాలు కూడా చెప్పారు. ఈ క్రమంలో దక్షిణ కాశ్మీర్‌లోని ఖాజిగుండ్‌లోని హైవే మీదుగా 16 కిలోమీటర్లు నడవడానికి బదులు తదుపరి షెడ్యూల్ స్టాప్‌కు బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణించవలసి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

నేను ప్రత్యేక్ష సాక్షిని..

జమ్మూకశ్మీర్ పోలీసులు కల్పించిన భద్రతా వలయం ఒక్కసారిగా కనిపించకుండా పోయిందని.. నేను ప్రత్యేక్ష సాక్షిని అంటూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు, మాజీ సిఎం ఒమర్‌ అబ్దుల్లా కూడా తెలిపారు. జమ్మూ నుంచి కశ్మీర్‌లోకి అడుగుపెట్టి బనిహాల్‌లోకి ప్రవేశించగానే.. దురదష్టవశాత్తూ యాత్ర రద్దయిందన్నారు.

భద్రత కల్పించడం బాధ్యత..

భద్రత కల్పించడం జమ్ముకాశ్మీర్‌ అధికారుల బాధ్యత అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మిగిలిన రోజుల్లోనైనా యాత్రకు భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. మరోవైపు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. 15 నిమిషాలపాటు సెక్యూరిటీ అధికారులు ఎవరూ లేరని.. ఇది తీవ్రమైన భద్రతా లోపమని.. దీనిపై పోలీసులు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్‌ నేత కెసి వేణుగోపాల్‌ డిమాండ్ చేశారు.

అధికారుల వెర్షన్ ఏంటంటే..

అయితే యాత్రలో ఎలాంటి భద్రతా లోపాలు లేవంటూ జమ్మూకశ్మీర్ పోలీసులు పేర్కొన్నారు. బనిహాల్ నుంచి ఇంతపెద్ద సంఖ్యలో జనం వస్తారని నిర్వాహకులు తమకు చెప్పలేదంటున్నారు. తమకు చెప్పకుండానే యాత్రను ఆపేశారంటున్నారు అధికారులు.

ఈ నెల 30న ముగియనున్న యాత్ర..

కన్యాకుమారి నుంచి మొదలైన ఈ యాత్ర చివరి దశకు చేరుకుంది. ఈ నెల 30న యాత్ర ముగియనుంది. ముగింపు సభ కోసం కాంగ్రెస్ పార్టీ భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ సభ కోసం 24 పార్టీలకు ఆహ్వానం కూడా పంపింది. అయితే.. అనూహ్యంగా నిన్నటి యాత్రలో తాత్కాలిక బ్రేక్ పడటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..