మలేషియా టూర్‌కు బయలుదేరిన విద్యార్థి.. లగేజీకి ఎక్స్‌ట్రా ఛార్జెస్ కట్టలేక ఏం చేశాడో తెలిస్తే షాక్..

మలేషియాకు వెళ్తున్న ఓ విద్యార్థి అధిక బ్యాగేజీ ఫీజు కట్టలేక బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బట్టలు, ఆహారాన్ని ప్యాకింగ్ చేసి వదిలేశాడు. ఎయిర్ ఏషియా గ్రౌండ్ స్టాఫ్ విద్యార్థికి..

మలేషియా టూర్‌కు బయలుదేరిన విద్యార్థి.. లగేజీకి ఎక్స్‌ట్రా ఛార్జెస్ కట్టలేక ఏం చేశాడో తెలిస్తే షాక్..
Kempegowda Airport
Follow us

|

Updated on: Mar 14, 2023 | 11:37 AM

మలేషియాకు వెళ్తున్న ఓ విద్యార్థి అధిక బ్యాగేజీ ఫీజు కట్టలేక బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బట్టలు, ఆహారాన్ని ప్యాకింగ్ చేసి వదిలేశాడు. ఎయిర్ ఏషియా గ్రౌండ్ స్టాఫ్ విద్యార్థికి అదనపు బ్యాగేజీ ఫీజుగా కిలోకు రూ.2,000 చెల్లించాలని చెప్పారు. అయితే, ఎయిర్‌ఏషియా అధికారిక పోర్టల్‌లో కిలోకు రూ.500 ఉందని సదరు విద్యార్థి వారితో వాదించగా.. అతను తప్పుడు వెబ్‌సైట్‌లో సమాచారాన్ని చూసినట్లు నిర్ధారించారు. ఓవర్ వెయిట్ లగేజీ కిలోకు 2,000 రూపాయలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. దాంతో ఆ డబ్బు చెల్లించలేక విద్యార్థి తన బట్టలు, ఫుడ్ ప్యాకెట్లలో కొన్నింటిని ఎయిర్‌పోర్టులోనే వదిలేశాడు. అనంతరం మలేషియా వెళ్లిపోయాడు. అయితే, సదరు విద్యార్థి ఎయిర్ ఏషియాపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు.

పూర్తివివరాలు ఇలా ఉన్నాయి. బెళగావికి చెందిన కార్తీక్ సూరజ్ పాటిల్ (23) విశ్వేశ్వరయ్య టెక్నోలాజికల్ యూనివర్శిటీ (VTU) నుండి కెమికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. మలేషియాలోని పెరాక్ విశ్వవిద్యాలయంలో పరిశోధనా ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం, సూరజ్ పాటిల్ బెంగళూరు నుండి కౌలాలంపూర్‌కు ఎయిర్‌ఏషియా ఫ్లైట్‌ను బుక్ చేసి, చెక్-ఇన్ కోసం 20 కిలోల లగేజీని ప్యాక్ చేసి, మార్చి 5, ఆదివారం రాత్రి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నాడు.

‘‘ఎయిర్ ఏషియా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ప్రతి ప్రయాణీకుడు 15 కిలోల బ్యాగేజీని తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. అంతకు మించితే ప్రతి కిలోకు రూ. 500 అదనపు రుసుము వసూలు చేయబడుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకునే.. 5 కిలోల అదనపు సామాను ప్యాక్ చేసి మొత్తం 20 కిలోల లగేజీ వెంట తెచ్చుకున్నాను. కానీ విమాన సిబ్బంది నా సూట్‌కేస్‌ని తనిఖీ చేసి షాక్ ఇచ్చారు. ఎక్స్‌ట్రా లగేజీ తీసుకెళ్లాలంటే కిలోకు రూ.2,000 చెల్లించాల్సి ఉంటుందని బెంగళూరు విమానాశ్రయంలో ఎయిర్‌ఏషియా ఎగ్జిక్యూటివ్ తెలిపారు. అదనపు సామాను కోసం రూ.10,000 చెల్లించే పరిస్థితిలో నేను లేను. అందుకే నా లగేజీని 20 కిలోల నుండి 15 కిలోలకు తగ్గించి, బెంగళూరు విమానాశ్రయంలో బట్టలు, ఆహారాన్ని వదిలిపెట్టాను.’ అని బాధిత విద్యార్థి పాటిల్ వాపోయాడు.

ఇవి కూడా చదవండి

విద్యార్థిదే తప్పు.. వివరణ ఇచ్చిన ఎయిర్ ఏషియా..

ఈ ఘటనపై ఎయిర్ ఏషియా వివరణ ఇచ్చింది. ఛార్జీల విషయంలో గందరగోళం కారణంగా అదనపు బ్యాగేజీ ఛార్జీల విషయంలో పాటిల్ మాదిరిగానే మరికొందరు ఎయిర్ ఏషియా ప్రయాణికులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారని అధికారిక వర్గాలు ధృవీకరించాయి. దేశీయ ప్రయాణాలు చేసే విద్యార్థులు, ప్రయాణికులు airasia.co.in సైట్‌ని సందర్శించాలని సూచించారు. దేశీయ విమాన ప్రయాణాల్లో ఎక్స్‌ట్రా లగేజీ కిలోకు రూ. 500 బ్యాగేజీ ఛార్జీ ఉంటుందని, అంతర్జాతీయ ప్రయాణాలు సాగించే విద్యార్థులు అంతర్జాతీయ పోర్టల్‌ airasia.com ను సందర్శించాలని సూచించారు. అంతర్జాతీయ ప్రయాణాలకు అదనపు బ్యాగేజీ ఛార్జీ కిలోకు రూ.2,200గా స్పష్టంగా ఉంటుంది. విమానయాన సంస్థ తప్పేమీ లేదని, బెంగళూరు ఎయిర్‌పోర్టు సిబ్బంది సక్రమంగా వ్యవహరించారని అధికారులు తెలిపారు. దేశీయ విమానాలు, అంతర్జాతీయ విమానాలకు అదనపు బ్యాగేజీ ఛార్జీలు భిన్నంగా ఉంటాయని వివరించారు. సరైన వెబ్‌సైట్‌ను సందర్శించి సరైన సమాచారాన్ని పొందాలని ఎయిర్‌ఏషియా స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..