Nitin Gadkari: ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణుడి ప్రతి రూపం.. సీఎంపై కేంద్ర మంత్రి చెప్పిన మాటలు ఇవే..
చెడును అంతం చేసేందుకు తాను మళ్లీ వస్తానని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను ఆమె తనకు గుర్తు చేసిందని గడ్కరీ చెప్పారు. శ్రీకృష్ణుడిలానే యోగి కూడా మంచివారిని రక్షిస్తూ, దుర్మార్గులను శిక్షిస్తున్నారని కొనియాడారు.

Yogi-Lord Krishna: ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణుడి ప్రతి రూపం.. చెడును అంతం చేసేందుకు ఈ భూమిపైకి వచ్చారు. ఈ మాటలన్నది ఎవరు.. ఎవరి గురించో తెలుసా.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రకటన. రాష్ట్రంలో రూ.13,500 కోట్ల విలువైన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు గోరఖ్‌పూర్ వచ్చిన ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజంలో పేరుకుపోయిన ప్రమాదకరమైన, చెడు ధోరణుల నుంచి ప్రజలను రక్షించేందుకు యోగి కఠిన చర్యలు చేపట్టారని, దేశ ప్రజల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.
గోరఖ్‌పూర్‌లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ త్వరలో అత్యంత సంపన్న రాష్ట్రంగా ఆవిర్భవించనుందన్నారు. పేదరిక నిర్మూలన, ప్రజా సంక్షేమం కోసం రామరాజ్యం ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. శాంతిభద్రతలు, అభివృద్ధిపై యూపీ సీఎంను ప్రశంసిస్తూ గడ్కరీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను శ్రీకృష్ణుడితో పోల్చారు. సమాజానికి హాని కలిగించే దుష్ట ధోరణుల ప్రభావం, అన్యాయం, దౌర్జన్యాల ప్రభావం పెరిగినప్పుడల్లా.. ప్రజలను రక్షించేందుకు అవతారమెత్తాడని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగానే ఉత్తరప్రదేశ్‌లో యోగి జీ ఇక్కడికి వచ్చారని అన్నారు. సామాన్యులను రక్షించేందుకు దుష్టశక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
అమెరికా తరహాలో యూపీ రోడ్లను తయారు చేస్తామని గతంలో చేసిన ప్రకటనలను గుర్తు చేసిన కేంద్ర మంత్రి, 2014 తర్వాత ఉత్తరప్రదేశ్‌లో జాతీయ రహదారుల పొడవు రెండింతలు పెరిగిందని, 2024 చివరి నాటికి రూ. 5 లక్షల కోట్ల విలువైన రోడ్ల పనులు చేపడతామని అన్నారు .
ఈ సందర్భంగా తన భార్యతో జరిగిన ఓ ఆసక్తికర సంభాషణను ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు. యూపీలో ఏం జరుగుతోందని తన భార్య అడిగితే.. నేరాలను అదుపు చేసేందుకు గత ఆరేళ్లలో ఇక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఆమెకు వివరించానని అన్నారు.
తాను చెప్పిన మాటలు విన్న తర్వాత ఆమె ఇలా చెప్పిందని అన్నారు. చెడును అంతం చేసేందుకు తాను మళ్లీ వస్తానని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను ఆమె తనకు గుర్తు చేసిందని గడ్కరీ చెప్పారు. శ్రీకృష్ణుడిలానే యోగి కూడా మంచివారిని రక్షిస్తూ, దుర్మార్గులను శిక్షిస్తున్నారని ప్రశంసించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం