Delhi Unlocking : దేశ రాజధాని హస్తినలో కరోనా అన్ లాక్ షురూ చేసిన సీఎం కేజ్రీవాల్.. షాపులు, ఆఫీస్‌లకు వెసులుబాట్లు ఇలా..
సరి-బేసి సంఖ్య విధానంలో మార్కెట్స్, మాల్స్ , ప్రభుత్వ, ప్రయివేటు ఆఫీస్‌ల పునఃప్రారంభానికి సోమవారం నుంచి అనుమతులిచ్చారు..
Arvind Kejriwal Announces Gradual Unlock In Delhi : దేశ రాజధాని ఢిల్లీలో అన్ లాక్ ప్రక్రియను షురూ చేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. సడలింపులు, మినహాయింపులతో లాక్ డౌన్ కొనసాగించేదిశగా విధాన రూపకల్పన చేశారు. సరి-బేసి సంఖ్య విధానంలో మార్కెట్స్, మాల్స్ , ప్రభుత్వ, ప్రయివేటు ఆఫీస్‌ల పునఃప్రారంభానికి సోమవారం నుంచి అనుమతులిచ్చారు. 50% సిబ్బందితో ప్రైవేట్ కార్యాలయాల నిర్వహణకు అనుమతి ఇవ్వగా, గ్రూప్ – ఏ ప్రభుత్వ కార్యాలయాలు 100%, గ్రూప్-బీ కార్యాలయాలు 50% సిబ్బందితో నిర్వహించాలని పేర్కొన్నారు. కొవిడ్-19 థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవుతున్నామన్న కేజ్రీవాల్.. పీడియాట్రిక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని. 420 టన్నుల ఆక్సిజన్ నిల్వ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
కరోనా నూతన వేరియంట్ల నిర్ధారణకు రెండు ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ కేసులు ఇవాళ 400 కన్నా తక్కువే వచ్చాయని, పాజిటివిటీ రేటు 0.5 శాతంగా ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్పారు. దీంతో లాక్ డౌన్ ను క్రమంగా ఎత్తేస్తున్నామన్నారు. ఇప్పటికే అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టామని, క్రమ క్రమంగా మరిన్ని సడలింపులను ఇస్తామని ప్రకటించారు.
అన్ లాక్ నిబంధనల ప్రకారం సోమవారం నుంచి షాపింగ్ మాళ్లు, మార్కెట్లను ఉదయం పదింటి నుంచి సాయంత్రం 8 గంటలకు తెరవొచ్చని తెలిపారు. ప్రైవేటు ఆఫీసులను 50 శాతం సిబ్బందితో నడుపుకోవచ్చని.. అయితే, వీలైనంత వరకు ఇంటి నుంచే పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని సూచించారు. 50 శాతం సామర్థ్యంతో ఢిల్లీ మెట్రో నడుస్తుందన్నారు. ఈ కామర్స్ సేవలనూ ప్రారంభించుకోవచ్చని చెప్పారు.