AP Special Status: కేంద్ర హోంశాఖ అజెండాలో ప్రత్యేక హోదా.. ఈ నెల 17న చర్చలకు రావాలని ఏపీకి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లకు మరో ముందడుగు పడింది. కేంద్ర హోంశాఖ ఎంజెండాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికిప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు.
Andhra Pradesh Special Status: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లకు మరో ముందడుగు పడింది. కేంద్ర హోంశాఖ ఎంజెండాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికిప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. ఈ మేరకు ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఈ నెల 17న చర్చలకు రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆహ్వానం పంపించింది. హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రధాని నరేంద్రమోడీని కలిసి ఏపీ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోడీని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.
ఈ నెల 17 న ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ సమావేశం కావాలని నిర్ణయించింది.ఈ సందర్భంగా 9 అంశాలపై చర్చించాలని హోంశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, బ్యాంక్ బ్యాలన్‌లు, డిపాజిట్లు, విద్యుత్ పంపిణీ, విద్యుత్ బకాయిలు, ఆదాయ లోటు, ఏపీలో ఉన్న 7 వెనుక బడిన జిల్లాలకు నిధులు, ప్రత్యేక హోదా, పన్నుల ప్రోత్సాహకాలు వంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
ఏపీ, తెలంగాణ మధ్య పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్రం సమావేశం నిర్వహించనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈనెల 8న జరిగిన సమావేశంలో కేంద్ర హోంశాఖ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా ఏపీ నుంచి ఎస్.ఎస్.రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణారావు ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈనెల 17న ఉదయం 11 గం.కు కమిటీ తొలి భేటీ నిర్వహణకు కేంద్రం సిద్ధమైంది. ప్రధానంగా ప్రత్యేక హోదా, పన్ను అంశాల్లో సవరణలు, వనరుల వ్యత్యాసం, ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన.. తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కుః అంబటి రాంబాబు
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చంద్రబాబు అన్నారు. కానీ..సీఎం జగన్ హోదా సాధిస్తామని చెప్పారు. ఇదే దిశగా ప్రత్యేక హోదాపై కేంద్రం త్రిసభ్య కమిటీ వేసింది..ఇది శుభ పరిణామమని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ప్రధానిని కలిసిన ప్రతిసారి హోదా ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. వైఎస్ఆర్ సీపీ కృషి వల్లనే కేంద్రం హోదా పరిశీలిస్తోందని తెలిపారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అన్న ఆయన.. హోదా సాధించడానికి వైఎస్ఆర్ సీపీ సర్వశక్తులూ ఒడ్డుతుందన్నారు. విభజన హామీల అమలకు వైఎస్‌ఆర్ సీపీ ఎంపీలు పోరాడుతున్నారన్న ఆయన.. వైఎస్ఆర్ సీపీ పోరాట ఫలితమే ప్రత్యేక హోదా మళ్లీ తెర మీదకు వచ్చిందన్నారు. చంద్రబాబు ప్యాకేజీ తీసుకుని..హోదా వద్దన్నారని విమర్శించారు.
Read Also…. Visakhapatnam: అమెరికాలో విశాఖ యువకుడి దారుణ హత్య.. శోక సంద్రంలో కుటుంబ సభ్యులు..