Krishna Water: జల వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం వద్దన్న ఏపీ.. పిటిషన్ మరో బెంచ్‌కు బదిలీ చేసిన చీఫ్ జస్టిస్
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడం ఇప్పుడప్పుడే సర్ధుమణిగేలా లేదు. కృష్ణా జలాల వివాదంలో ఆంధ్రప్రదేశ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.
Supreme Court on Krishna River Water Dispute: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడం ఇప్పుడప్పుడే సర్ధుమణిగేలా లేదు. కృష్ణా జలాల వివాదంలో ఆంధ్రప్రదేశ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. తెలంగాణకు వ్యతిరేకంగా సీఎం జగన్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. గత సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు విని.. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాలకు సీజేఐ సూచించారు. తాను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని పేర్కొన్నారు. పిటిషన్‌పై విచారణ జరుపడం తనకు ఇష్టం లేదని.. విచారణే కోరుకుంటే పిటిషన్‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తానని పేర్కొన్నారు.
సోమవారం నాడు జరిగిన విచారణలో ఈ వివాదానికి మధ్యవర్తిత్వమే మంచిదని రమణ చెప్పిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. న్యాయపరంగానే సమస్యకు పరిష్కారాన్ని కోరుకుంటున్నామని ఏపీ తరపు న్యాయవాది దుష్యంత్ దవే కోర్టుకు తెలిపారు. మరోవైపు.. సీజేఐ ధర్మాసనమే విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సీజేఐ వాదనలు విన్నందుకు రెండు రాష్ట్రాలకు అభ్యంతరం లేదని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఇందుకు జస్టిస్ ఎన్‌వీ రమణ నిరాకరించారు. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సీజేఐ ఎన్వీ రమణ తోసిపుచ్చారు. అనంతరం ఈ కేసును మరో ధర్మాసనానికి సీజేఐ రమణ బదిలీ చేశారు. కాగా.. కృష్ణా ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా జల విద్యుదుత్పత్తి చేస్తోందని, అపెక్స్ కౌన్సిల్ ఆదేశాలను ఉల్లంఘిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.
Read Also… Hyderabad: పోలీసుల వాహనంలో ఒక్కసారిగా మంటలు.. హైదరాబాద్ నడిబొడ్డులో కలకలం..!