Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Groundwater Contamination: దేశ వ్యాప్తంగా 80 శాతం భూగర్భ జలాలు విషపూరితమే.. షాకింగ్ వివరాలివే..

భూగర్భంలో ఉండే జలం.. జలం కాదు విషమా? దేశ వ్యాప్తంగా 80 శాతం వరకూ జలాలు ఇలాంటివేనా? దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందా? భూగర్భ జలాల్లో విషపూరిత లోహాలు ఉన్నాయా?

Groundwater Contamination: దేశ వ్యాప్తంగా 80 శాతం భూగర్భ జలాలు విషపూరితమే.. షాకింగ్ వివరాలివే..
Ground Water
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 01, 2022 | 5:22 PM

భూగర్భంలో ఉండే జలం.. జలం కాదు విషమా? దేశ వ్యాప్తంగా 80 శాతం వరకూ జలాలు ఇలాంటివేనా? దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందా? భూగర్భ జలాల్లో విషపూరిత లోహాలు ఉన్నాయా? కాలుష్యంలో కూడా భార లోహాలను గుర్తించారా? రాజ్య సభ వేదికగా కేంద్ర ప్రభుత్వం చేసిన తాజా ప్రకటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మరి భూగర్భజలాలు గరళంగా మారడానికి కారణలేంటి? అందుకు నివారణ చర్యలేంటి? ప్రభుత్వం ఏం చెబుతోంది? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.. ఏంచెబుతోంది. భూగర్భజలాలు గరళంగా మారడానికి కారణాలేంటి? నివారణోపాయాలేంటి?

దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో నిర్దేశిత ప్రమాణాల కంటే భూగర్భ జలాల్లో విషపూరిత పదార్థాలు చేరిపోయాయి. ఈ కాలుష్యంలో భార లోహాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రకటన చేసింది సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే. భూగర్భ జలాల విషతుల్యత గురించి.. రాజ్యసభలో వెల్లడించడం దేశ వ్యాప్త చర్చకు దారితీస్తోంది. ఇప్పటి వరకూ భూమిపై ఉండే నీటి కంటే ఎంతో కొంత స్వచ్చత ఉందనుకున్న భూగర్భ జలాల రంగుని ఈ ప్రకటన బయటపెట్టింది. ఈ లెక్కల ప్రకారం ఇప్పటివరకు మనం తాగుతున్న నీరు విషపూరితం. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోని భూగర్భ జలాల్లో విషపూరితమేనని తేలింది. ఇది ఎంతగా అంటే.. గ్రౌండ్ వాటర్ లో 80శాతం విషమేనని తేలింది.

భూగర్భ జలాలు.. కాలుష్యం కోరల్లో చిక్కుకోడానికి పరిశ్రమలే ప్రధాన కారణంగా గుర్తించారు. అనేక పరిశ్రమల వ్యర్థాలు.. ఉద్దేశ్యపూర్వకంగా కాలుష్యాన్ని భూమిలోని పంపిస్తున్నారు. ఇలాంటివన్నీ భూ గర్భ జలాలు.. కలుషితం కావడానికి కారణమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి దారుణమైన పరిస్థితులే. మరీ ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లోని పారిశ్రామిక వాడల దగ్గరున్న స్థితిగతులను బట్టీ చూస్తే.. భూగర్భ జలాలు ఎలా కాలుష్యకారకాలవుతునాయో తెలిసిపోతుంది. బాచుపల్లి, పఠాన్‌ చెరు, బాలానగర్‌, ఎల్బినగర్‌, ఉప్పల్, కూకట్ పల్లి, పాశమైలారం వంటి ప్రాంతాలకెళ్లి చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది. పాశమైలారం ఇస్నాపూర్ లోని చెరువును భూగర్భ జలాలను విషయ తుల్యం చేసే డేంజరస్ స్పాట్ గా గుర్తించారు. ఈ చెరువును చూస్తే చాలు గ్రౌండ్ వాటర్ ఎలా విషతుల్యంగా మారుతుందో తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

కేంద్రం చెప్పినట్టు 80శాతం ప్రజలు తాగుతున్న గ్రౌండ్‌ వాటర్‌ విషమనే విషయాన్ని మియాపూర్ లోని ఈ ప్రాంతం నిరూపిస్తోంది. నగర నడిబొడ్డున ఉన్న ఈప్రాంతం.. ఓంకార్‌నగర్‌ బస్తీ. ఇక్కడ కుళాయిలు లేవు. నల్లా నీటికి దూరంగా ఉండటంతో.. గ్రౌండ్‌ వాటర్ పైనే ఈ బస్తీవాసులు ఆధారపడుతున్నారు. ఇళ్ల పక్కనే లోతైన గుంతలు చేసి అందులో నుంచి వచ్చే భూగర్భ జలాలనే ఉపయోగిస్తున్నారు. ఈ నీరు చూస్తే గ్రౌండ్‌ వాటర్‌ ఎలా ఉంది. ప్రజలు ఎలాంటి దుస్థితిలో ఉన్నారో అర్థమవుతుంది. ఇలాంటి విష భూగర్భ జలాల్నే చాలా మంది ప్రజలు వాడుతున్నారు. వాటితోనే అన్ని అవసరాలు తీర్చుకుంటున్నారు. చివరికి తాగడానికి కూడా వీటినే వడపోసి వినియోగిస్తున్నారు. అందుకే అనారోగ్యాలకు గురవుతున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భూగర్భ జలశాఖలు ప్రతి రెండేళ్లకు ఒకసారి శాస్త్రీయమైన లెక్కలు వేస్తున్నాయి. ఈ సైంటిఫిక్ అనాలసీస్‌తో పరిస్థితులను అంచనా వేస్తున్నాయి. ఫీజో మీటర్ల ద్వారా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గణాంకాలు సేకరిస్తున్నామంటున్నామంటోంది తెలంగాణ భూగర్భ జలశాఖ. రాష్ట్ర వ్యాప్తంగా 1296 ఫిజో మీటర్ల సెంటర్లు నుంచి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ను, వాటిలో ఉండే గుణగణాలను అధ్యయనం చేస్తోంది.

యాక్షన్ తీసుకోవాల్సిందే..

చట్టసభల్లో గ్రౌండ్‌ వాటర్ 80శాతం విషంగా మారిందనే ప్రకటనలు కాదు.. దీని నివారణకు కనీస ప్రయత్నం చేయాలంటున్నారు పర్యావరణ వేత్తలు. గ్రౌండ్‌ వాటర్‌ ను విష కాలుష్యం నుంచి పరిరక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలంటున్నారు. సీరియస్ యాక్షన్ లేకపోతే.. భూ గర్భ జలాల రక్షణ సాధ్యం కాదని తేల్చేస్తున్నారు. భూగర్భ జలాల పరిరక్షణకు ఇప్పటికే అనేక మార్గదర్శకాలున్నాయి. ఎక్కడ పడ్డ వర్షపు నీరు అక్కడే ఇంకిపోయేలా ఏర్పాటు చేయాలి. ఇంకుడుగుంతలు, భూమిలోనికి నీరు ఇంజక్ట్ చేసే ఆధునిక పద్దతులను అమలు చేయాలి. మరోవైపు భూమిపై వర్షపు నీటి సైతం కాలుష్యంచేసే పద్ధతులకు చెక్ పెట్టాలంటున్నారు సైంటిస్టులు.

ఏది ఏమైనా.. గ్రౌండ్‌ వాటర్ గరళంగా మారిపోయింది. భవిషత్‌లో ఈ విషపు నీటిని కనీసం తాగడానికే కాదు తాకడానికి కూడా భయపడే పరిస్థితులు వెంటాడ్డం ఖాయం. ఇప్పటికైనా పాతళ గంగను పరిరక్షించేందుకు ప్రతిజ్ఞ చేయాలి. ఇటు ప్రజలు- అటు ప్రభుత్వాలు కంకణం కట్టుకోవాలి. లేకుంటే ఈ విష జలాలు తీసుకుంటూ వెళ్తే.. అది స్లో పాయిజన్ గా మారి.. తీవ్ర అనారోగ్య పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

-టీవీ9 డెస్క్ స్పెషల్

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..