Kerala: అందమైన స్నేక్ బోట్ రేసుకు సర్వం సిద్దం.. ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన పర్యాటక జనం
ఎవరైనా దేవుడు ఎక్కడుంటాడని ప్రశ్నిస్తే... స్వర్గలోకంలో, స్త్రీలలో ఇంకా కేరళలో అని జవాబిచ్చుకోవచ్చు. అసలు గాడ్స్ ఓన్ కంట్రీ అందాలకు ముగ్ధులు కానివారు ఎవరైనా ఉంటే అది వారి దృష్టి లోపమేననుకోవచ్చు..
Nehru Trophy Boat Race: పరుగులు తీసే పడవలను చూసి ఆనందపడని మనిషంటూ ఉంటాడా..? ఉండరంటే ఉండరని బోటు మీద ఒట్టేసి చెప్పొచ్చు. సర్పాకారంలో ఉన్న పడవలు పోటీలు పడి మరీ పరుగులు పెడుతుంటే. ఆ క్రీడా విన్యాసాన్ని, ఆ నైపుణ్యాన్ని చూట్టానికి రెండు కళ్లూ చాలవంటే నమ్మండి. ఏం నమ్మరా..? అయితే ఆదివారం సాయంత్రం కేరళలోని అలపుళలో జరిగే 68వ నెహ్రూ ట్రోఫీ వైభవాన్ని చూసిన తర్వాత చెప్పండి…
కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ ఎందుకయ్యిందంటే ఏం చెప్పాలి..? ఒక్కసారి అక్కడికి వెళ్లి వస్తే అదెందుకు దేవతలు కొలువై ఉండే ప్రాంతమో అర్థమవుతుంది. ఎవరైనా దేవుడు ఎక్కడుంటాడని ప్రశ్నిస్తే… స్వర్గలోకంలో, స్త్రీలలో ఇంకా కేరళలో అని జవాబిచ్చుకోవచ్చు. అసలు గాడ్స్ ఓన్ కంట్రీ అందాలకు ముగ్ధులు కానివారు ఎవరైనా ఉంటే అది వారి దృష్టి లోపమేననుకోవచ్చు.. అంత అందమైన కేరళలో ఆదివారం మధ్యాహ్నం నుంచి మరింత అందమైన స్నేక్ బోట్‌రేసు జరగబోతున్నది..! చూచువారలకు అదో చూడముచ్చట! నెహ్రూ ట్రోఫీ పేరిట జరిగే ఈ బోటు రేసును వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకలు రెక్కలు కట్టుకుని వాలిపోయారు. ఫోటోలు…వీడియోలతో పాటు కొన్ని స్వీట్ మెమొరీలను వెంటేసుకుని వెళ్లిపోతారు.
1952లో మొదలైన ఈ పడవపందాలు ఏటేటా మరింత గొప్పగా రూపుదిద్దుకుంటున్నాయి.. పర్యాటకులూ పెరుగుతున్నారు. అసలు ఒక్కో బోటులో వందకు పైగా క్రీడాకారులు వేగంగా తెడ్లు వేస్తూ పడవలను గాల్లో దూసుకెళ్లాలా నడుపుతుంటుంటే ఆ దృశ్యం బహు గొప్పగా ఉంటుంది.. ఇందులో పాల్గొనడమే గొప్పగా భావిస్తారు క్రీడాకారులు.. వివిధ ప్రాంతాలలో ఉన్న సుప్రసిద్ధ బోటు క్లబ్‌లన్నీ ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటాయి.. 1952లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ ప్రాంతాన్ని సందర్శించి పులకించిపోయారు.. బోటులో ప్రయాణిస్తూ ఆనందానికి లోనయ్యారు.. సరంగులను ఎంకరేజ్ చేయాలన్న సంకల్పంతో ఈ పోటీలను ప్రారంభించారు నెహ్రూ.. ఈ పడవపందాలలో గెలిచిన జట్టకు రోలింగ్ ట్రోఫీని బహూకరించడం కూడా అప్పుడే మొదలయ్యింది.. ట్రావెన్కోర్-కొచ్చిన్‌లలోని ప్రత్యేకమైన సామాజిక జీవితాన్ని తెలియచేసే ఈ బోట్‌రేసు విజేతలకు ఈ ట్రోఫీ అనే అక్షరాలు ఈ ట్రోఫీలో పొదిగి ఉంటాయి.
నెహ్రూ ట్రోఫీ బోటు రేసుకు ఇప్పుడు అరవై ఎనిమిదేళ్లు.. ఇప్పటికీ సందర్శకులలో అదే ఉత్సాహం.. పోటీదారులలో అదే ఉద్వేగం… గెలిచినవారిలో అదే ఉల్లాసం.. ప్రశాంతంగా సాగిపోయే పున్నమడ సరస్సును ఉత్తేజపరుస్తుంది. ఉరకలెత్తిస్తుందీ బోటురేసు. సరస్సును కేరింతలు కొట్టిస్తుంది. వర్షాకాలంలో కేరళలో జరిగే తొలి అతి పెద్ద ఉత్సవం ఇదే! అందుకే టూరిస్టుల అడుగులన్నీ అలెప్పీవైపు సాగుతుంటాయి.. అసలు కేరళ అనగానే అప్రయత్నంగా గుర్తుకొచ్చేది అందమైన అమ్మాయిలు. ఆ తర్వాత స్నేక్ బోటు రేసు! దీన్ని మలయాళంలో వల్లమ్‌కలి అంటారు.. బోట్లు స్నేక్ ఆకారంలో ఉండటం వల్ల స్నేక్ బోటు రేసు అయ్యింది. .స్నేక్ బోట్లే కాకుండా ఇంకా అనేక రకాల పడవ పందాలు ఇక్కడ జరుగుతాయి.. ఈ పోటీతో కేరళలో బోటు రేసుల సీజన్ మొదలవుతుందని చెప్పుకొవచ్చు.
నెహ్రూ ట్రోఫీ మొదలుకాక ముందు కూడా ఇక్కడ పడవపందాలు జరిగేవి.. నాలుగు శతాబ్దాల కిందటి నుంచే ఇక్కడ పడవపందాలు జరుగుతున్నాయి.. అంబలపూళలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయానికి గుర్తుగా బోటు రేసును చేపట్టారు.. ఇప్పుడు జరిగే నెహ్రూ ట్రోఫీతో అలెప్పీకి ప్రపంచ ఖ్యాతి లభించింది.. అన్నట్టు ఈ బోటు రేసులో కుల మతాలతో సంబంధం లేకుండా సమస్త ప్రజలు పాల్గొంటారు. అప్పట్లో అలెప్పీలో చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి.. సాధారణంగా ఒక రాజుకు మరో రాజుకు పడదు కదా! సరస్సుల మీదుగా …పడవల ద్వారా వచ్చి కొట్లాడుకునేవారు. ఈ చిన్నపాటి యుద్ధాల కారణంగా ఓ రాజు తీవ్రంగా నష్టపోయాడు.. ఏం చేయాలో పాలుపోలేదు.. యుద్ధంలో విజయం సాధించేట్టుగా ఓ మంచి పడవను తయారు చేసివ్వమని పడవ నిర్మాతలను అడిగాడు రాజు.. వారు చక్కటి స్నేక్ బోటును తయారు చేసి ఇచ్చారు.. ఆ బోటులో వెళ్లిన రాజు విజయగర్వంతో వెనక్కి తిరిగి వచ్చాడు.. ప్రత్యర్థి రాజులకు గుబులేసింది.. అసలు స్నేక్ బోటును ఎలా తయారు చేస్తారో తెలుసుకుని రమ్మని వేగులను పంపారు.. వారైతే వచ్చారు కానీ స్నేక్ బోటు తయారీ కిటుకులను కనిపెట్టలేకపోయారు. ఆనాటి నుంచే స్నేక్‌బోటు రేసులు మొదలయ్యాయట!