అగ్రి బిల్లులపై ఆందోళన తీవ్రతరం.. కొత్త చట్టాలు యూజ్‌ఫుల్ అంటున్న బీజేపీ.. వ్యవసాయరంగ ప్రస్థానం హైలైట్స్ ఇవే!
వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరిట మోదీ ప్రభుత్వం తాజాగా తెచ్చిన మూడు చట్టాలపై దేశవ్యాప్తంగా రేగిన అన్నదాత ఆగ్రహజ్వాలలు ఇప్పట్లో చల్లారేలా లేవు .
వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరిట మోదీ ప్రభుత్వం తాజాగా తెచ్చిన మూడు చట్టాలపై దేశవ్యాప్తంగా రేగిన అన్నదాత ఆగ్రహజ్వాలలు ఇప్పట్లో చల్లారేలా లేవు . భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక గా ఉంది వ్యవసాయ రంగం. స్వతంత్రం లభించే నాటికి దేశంలో తిండి కొరత తీవ్రంగా ఉండేది. ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటే తప్ప తిండి దొరకని గడ్డు పరిస్థితి నుంచి కేవలం రెండు దశాబ్దాల్లోనే హరిత విప్లవం సాధించిన ఘనత అన్నదాతలది. దేశంలో కేవలం రెండు ఎకరాలు కలిగిన చిన్న, సన్నకారు రైతులు 12కోట్ల మందికి పైగా ఉన్నారు. వీరు పండించిన ఉత్పత్తులను ఇప్పటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలిచ్చి కొనుగోలు చేస్తున్నాయి. కనీస మద్దతుధర కంటే అధికంగా ధర పలికినపుడు మాత్రమే రైతులు తమ ఉత్పత్తులను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముతారు. తాజాగా అమలులోకి వచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతాంగానికి ఇకపై ప్రభుత్వపరంగా ఎటువంటి అండ లభించదు. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై పెల్లుబుకుతున్న నిరసన నేపథ్యంలో దేశంలో వ్యవసాయ రంగ ప్రస్థానం.. స్థితిగతులు ఒక్క సారి చూద్దాం…
మన దేశంలో నీటి వసతులలో చూసినట్లయితే మొత్తంలో 4 శాతం ఉంది. అలాగే ప్రపంచ జనాభాలో 17 శాతం మంది ప్రజలు భారతదేశంలో నివాసం ఉంటున్నారు. ప్రపంచ పశుగణంలో భారతదేశం వాటా 15 శాతంగా ఉంది. ఇంత జనాభాకు, పశుగణానికి, ఆహారం సమకూర్చడం ఈ దేశపు వ్యవసాయ రంగ ప్రధాన బాధ్యత, భారతదేశపు స్థూల జాతీయోత్పత్తిలో ఈ రంగం వాటా ఇప్పుడు 14.5 శాతంగా ఉంది. వ్యవసాయ రంగంలో భారత్ నుంచి ఎగుమతుల వాటా 11 శాతం, భారత్ లో 57 శాతం ప్రజలు, తెలంగాణ, ఏపిలో 60 శాతం ప్రజలు వ్యవసాయ రాంగానే జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నారు. దేశంలో 50 శాతం పైగా వ్యవసాయ భూములను కౌలుదార్లు సాగుచేస్తున్నారు. గ్రామ జనాభాలో 27 శాతం వ్యవసాయ కూలీలు ఉన్నారు. వ్యవసాయ రంగంపై పనిచేసే జనాభాలో వీరు 46 శాతం మంది ఉన్నారు.
మరో వైపు దేశంలో ఆహార పంటల సాగు తగ్గి వాణిజ్య పంటలకు ప్రాధాన్యత పెరిగింది. మెట్ట వ్యవసాయం విస్తరించి, పంట భూముల విస్తీర్ణము కూడా పెరిగింది. 60 శాతం వరకు సాగునీరు బావులు, గొట్టపు బావుల నుండి, 32 శాతం వరకు నీరు కాల్వల నుండి, 96 లక్షల పంప్‌సెట్‌లను నేడు వ్యవసాయ రంగంలో వాడుతున్నారు. వీటివాడకం పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువ. అదేవిధంగా 2022 నాటికి ఇండియా రూ.4,41,441 కోట్ల వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎగుమతి చెయ్యాలని టార్గెట్ పెట్టుకుంది. గత రెండేళ్లుగా రూ.2,94,294 కోట్లు ఎగుమతులు చేసింది.
ఇక కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త వ్యవసాయ చట్టాలు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలో సగటు భూ కమతాలు 2.43 హెక్టార్లు నుండి 1.25 హెక్టార్లకు తగ్గింది. సగటు కమతము ఇండియాలో 1.55 హెక్టారుగా నమోదు అయ్యింది. రాష్ట్రంలో సగటు భూ కమతం తగ్గడము ఒకవైపు జనాభా పెరగడం వల్ల కమతాల సంఖ్య పెరగడం జరుగుతోంది. దేశంలో కమతాల సమీకరణ 1973లో ప్రారంభం అయ్యింది. అలాగే కౌలు సంస్కరణలు 1956లో ప్రారంభం అయ్యింది. అదేవిధంగా 1960 సంవత్సరానికి మధ్య వర్తుల తొలగింపు పూర్తయ్యింది. 2012-2013 రాష్ట్ర సగటు కమతం 1.07 నమోదు కాగా 2011-2012 సంవత్సరంతో పోల్చితే -01 హెక్టార్లకు తగ్గింది.
ఇక స్థూల దేశీయోత్పత్తిలో వాటా చూసుకున్నట్లయితే .. భారతదేశంలో నిలకడ ధరల వద్ద స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 1950-51 సంవత్సరంలో 53.71% శాతంగా ఉంది. 2001-01 సంవత్సరానికి 25.20 శాతానికి చేరింది. 2011-12 నాటికి ఇది 16.17% శాతానికి తగ్గింది. ఇక దేశంలో ఉద్యోగిత చూసుకున్నట్లయితే…2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 1029 మిలియన్లు, 401 బిలియన్ల శ్రామిక జనాభా. వీరిలో వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నవారు 235 మిలియన్ల మంది ఉన్నారు. మొత్తం శ్రామిక జనాభాలో 59 శాతం మంది వ్యవసాయ రంగం మీదనే జీవనం సాగిస్తున్నారు. మొత్తం వ్యవసాయ శ్రామికులలో వ్యవసాయ దారుల విషయానికొస్తే ..
1951 సంవత్సరంలో – 71.9 శాతం నుండి, 1961 సంవత్సరంలో – 76.0 శాతానికి పెరిగింది. 1991 సంవత్సరంలో – 59.7 శాతం,2001 సంవత్సరంలో – 54.4 శాతం, 2011 సంవత్సరంలో – 45.1 శాతానికి తగ్గింది. అదేవిధంగా వ్యవసాయ కూలీల శాతంవిషయానికొస్తే 1951 సంవత్సరంలో 28.1 శాతం నుండి 1961 సంవత్సరంలో 24 శాతంకు, 1991 సంవత్సరంలో 40 శాతంకు, 2001 సంవత్సరంలో 45.6 శాతం 2011 సంవత్సరంలో 54.9 శాతానికి పెరిగింది. మొత్తం వ్యవసాయ రంగంలో వ్యవసాయ దారుల శాతం తగ్గుతుంటే వ్యవసాయ కూలీల సంఖ్య పెరుగుతూ వస్తుంది.
తెలంగాణలో గోదావరి, కృష్ణా నుంచి వ్యవసాయ రంగానికి నీరు అందుతుంది. నదీ వ్యవస్థల వల్ల రాష్ట్రము పొందగలిగే నీరు- 1463 టీఎంసీలు. అదేవిధంగా రాష్ట్రంలో స్థూల సాగుబడి మొత్తం విస్తీర్ణంలో 55% పైనే ఉంది. తెలంగాణలో వర్షాలు పడితే మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 50 % భూమి సేద్యం అవుతుంది. ఒక వేళ వర్షం రానట్లయితే సేద్యం చేసే భూమి అంటే సాగు భూమి 25% శాతం ఉంటుంది. 2000 సంవత్సరం నాటికి ప్రపంచంలో సేద్యం చేస్తున్న భూమి 1512 మి.హెక్టార్లు గా ఉంది. అదేవిధంగా 164.9 మిలియన్ హెక్టార్లు భారతదేశంలో స్థూల సేద్యపు భూమి ఉంది. ఇక 1950-51లో 131.83 శాతం నుంచి 2000-01 నాటికి 187.94 మిలియన్ హెక్టార్లకు సేద్యం భూమి పెరిగింది. నికర సేద్యపు భూమి ఇదే కాలంలో 118.75 నుండి 141.10 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. 1961 సంవత్సరంలో ఆహార ధాన్యాల తలసరి నికర లభ్యత రోజుకు 468.7 గ్రాములు. 2001 నాటికి 416.2 గ్రాములకు లభ్యత తగ్గింది. ధాన్య సేకరణలో సమస్యల చుస్కున్నట్టయితే.. 1951లో 38 మిలియన్ల టన్నులు నుంచి 2001లో 42.6 మిలియన్ల టన్నులకు, 2010లో 56.1 మిలియన్ల టన్నులకు సేకరణ పెరిగింది. అదేవిధంగా 2014లో 72.1 మిలియన్ల టన్నుల ధాన్య సేకరణ, 2018లో 86 మిలిటన్ టన్నుల ధాన్య సేకరణ జరిగింది.ఇక హార్టికల్చర్ చుస్కున్నటైతే . పండ్లు, కూరగాయల వాడకం పెరిగింది. రోజుకు 23 మిలియన్ల హెక్టార్లలో పండ్లు, కూరగాయలు, పూలు పెంపకం జరుగుతుంది. ప్రతి ఏటా 257 మిలియన్ టన్నులు హార్టికల్చర్ ఉత్పత్తులు జరుగుతున్నాయి. ఇందులో కూరగాయల వాటా 60 శాతము. పండ్ల వాటా 30 శాతంగా ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగ కేటాయింపులు చూసుకున్నటైతే .. 2015.16లో రూ. 11,601 కోట్లు , 2016-17లో రూ.47,912 కోట్లు (313 శాతం పెరుగుదల),2017-18లో రూ.51,026 కోట్లు (6.4 శాతం పెరుగుదల),2018-19లో రూ. 1,40,764 కోట్లు (170.8 శాతం పెరుగుదల).2019-20లో రూ. 1,30,485 కోట్లు (6.6 శాతం తగ్గుదల),2020-21లో రూ. 1.60 లక్షల కోట్లు (22.6 శాతం పెరుగుదల)గా ఉన్నాయి. ప్రస్తుతం కొత్తగా తెచ్చిన చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లు మారుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఇప్పటికైనా దిగివచ్చి రైతులను ఆదుకోవాలని, రైతులకు వ్యతిరేకంగా రూపొందించిన బిల్లులను వెంటనే రద్దుచేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.