Agnipath Scheme: ‘అగ్నిపథ్’పై హింసాత్మక నిరసనలు! పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు..
భారత రక్షణ విభాగానికి చెందిన త్రివిద దళాల్లో రాడికల్ రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం జూన్ 14న ప్రకటించిన 'అగ్నిపథ్' పథకానికి (Agnipath Scheme) వ్యతిరేకంగా దేశంలో పలు చోట్ల హింసాత్మక నిరసనలు..
Agnipath protest at Bihar: భారత రక్షణ విభాగానికి చెందిన త్రివిద దళాల్లో రాడికల్ రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం జూన్ 14న ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకానికి (Agnipath Scheme) వ్యతిరేకంగా దేశంలో పలు చోట్ల హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీహార్ (Bihar)లో వరుసగా రెండో రోజు చేపట్టిన నిరసనలు నేడు మిన్నంటాయి. పలు చోట్ల రైలు, రోడ్డు రవాణాకు నిరసనకారులు అంతరాయం కలిగించారు. భభువా రోడ్ రైల్వే స్టేషన్‌లో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు అద్దాలను పగులగొట్టి, రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ఒక కోచ్‌కు ఏకంగా నిప్పంటించారు. ‘ఇండియన్ ఆర్మీ లవర్స్’ అనే బ్యానర్ పట్టుకుని కొత్త రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా విద్యార్ధులు నినాదాలు చేశారు.
బీహార్‌లోని అర్రా, జెహానాబాద్, నవాడా.. ఇలా దాదాపు ఆర డజను ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్ల వద్ద విద్యార్ధులు భారీ స్థాయిలో పోగయ్యి పోలీసులపై రాళ్లు రువ్వారు. అంతేకాకుండా ఫర్నీచర్‌ను రైల్వే ట్రాక్‌పై విసిరి, తగులబెట్టారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు, నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్ప వాయువును ప్రయోగించారు. ఈ భారీ నిరసనలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలలో కూడా నిరసనలు తలెత్తుతున్నాయి.
आरा स्टेशन पर उग्र छात्रों को हटाने के लिए आश्रु गैस के गोले देखिए अब दागे जा रहे हैं @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/s0YP3bq1Tx
— manish (@manishndtv) June 16, 2022
అగ్నిపథ్ పథకంలో ఏయే నిబంధనలు ఉన్నాయంటే..
- తాజాగా కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకం ప్రకారం.. 17 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సున్న 45,000 మందిని నాలుగేళ్ల కాంట్రాక్టు ప్రాతిపదికన జవాన్లుగా రిక్రూట్ చేయనున్నారు.
- ఈ నాలుగేళ్ల సమయంలో వీరికి నెల జీతంగా రూ. 30 వేల నుంచి 40 వేలతోపాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
- ఆ తర్వాత వీరిలో 25 శాతం మందిని మాత్రమే శాశ్వత ఉద్యోగులుగా ఎంపిక చేస్తారు.
- వీరు15 ఏళ్లపాటు పాటు ఏడాదికి రూ.11 నుంచి 12 లక్షల ప్యాకేజీతో నాన్ ఆఫీసర్లుగా సర్వీసులో కొనసాగుతారు.
- మిగతా వారికి ఎటువంటి గ్రాట్యుటీ, పెన్షన్ సదుపాయం లేకుండా నిర్భంద పదవీవిరమణ చేయిస్తారు.
- జవాన్లకు చెల్లించే భారీ జీతాలు, పెన్షన్లను తగ్గించుకుని ఆయుధాల సేకరన కోసం అధిక నిధులను వ్యచ్చించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పాత విధానం ఎలా ఉండేది? పాత విధానం ప్రకారం.. 16 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్ధులను 15 ఏళ్లపాటు దేశ సేవకు ఎంపిక చేస్తారు. అనంతరం పెన్షన్‌తో కూడిన రిటైర్‌మెంట్ ఉంటుంది.
#WATCH | Bihar: Youth demonstrate in Chhapra, burn tyres and vandalise a bus in protest against the recently announced #AgnipathRecruitmentScheme pic.twitter.com/Ik0pYK26KY
— ANI (@ANI) June 16, 2022
దేశ ప్రతిష్ఠకు గొడ్డలి పెట్టు..
ఉద్యోగంలో చేరాక నాలుగేళ్లకే రిటైర్‌మెంటా? యుక్త వయసులోనే రిటైర్‌మెంట్ తీసుకుంటే మా భవిష్యత్తు ఏమికావాలి? అని విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు. పాత పద్ధతినే కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. నాలుగేళ్ల పదవీకాలం సర్వీసులకు ఎంపిక చేస్తే, వారిలో పోరాట స్ఫూర్తి దెబ్బతింటుందని, రిస్కు తీసుకోవడానికి వెనకాడుతారని విద్యావేత్తలు, సీనియర్ ఆర్మీ అధికారులు సైతం విమర్శిస్తున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.