Aam Aadmi Party: పంజాబ్‌లో ఆప్ కార్యకర్త దారుణ హత్య.. కారులో వెళ్తుండగా ఒక్కసారిగా తుపాకులతో దాడి!
పంజాబ్‌లో అధికార పార్టీ ఆప్‌కు చెందిన ఓ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త గురుప్రీత్ సింగ్‌పై శుక్రవారం (మార్చి 1) పంజాబ్‌లోని తరన్ తరన్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. గుర్‌ప్రీత్ సింగ్ అలియాస్ గోపీ చోహల్ కోర్టు కేసు విషయమై కపుర్తలా వైపు కారులో వెళ్తుండగా.. ఒక్కసారిగా దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు..
అమృత్‌సర్, మార్చి 2: పంజాబ్‌లో అధికార పార్టీ ఆప్‌కు చెందిన ఓ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త గురుప్రీత్ సింగ్‌పై శుక్రవారం (మార్చి 1) పంజాబ్‌లోని తరన్ తరన్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. గుర్‌ప్రీత్ సింగ్ అలియాస్ గోపీ చోహల్ కోర్టు కేసు విషయమై కపుర్తలా వైపు కారులో వెళ్తుండగా.. ఒక్కసారిగా దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటన గోయింద్వాల్ సాహిబ్ రైల్వే క్రాసింగ్ వద్ద జరిగింది. దాడిలో గురుప్రీత్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
కోర్టుకు బయల్దేరిని గుర్‌ప్రీత్ సింగ్ కారును దుండగులు వెంబడించారు. ముగ్గురు వ్యక్తులు మరో కారులో ఆయనను ఫాలో చేశారు. సింగ్ ఫతేబాద్, గోయిండ్వాల్ సాహిబ్ మధ్యలోని రైల్వే క్రాసింగ్ వద్ద గురుప్రీత్ సింగ్ కారు ఆపు చేయగానే దుండగులు కూడా అతని కారు వెనకే తమ కారును కూడా ఆపారు. ఆనంతరం అతడిపైకి ఐదు సార్లు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి, అనంతరం పరారైనట్లు అక్కడి స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా కారులో ఉన్న గుర్‌ప్రీత్ సింగ్ అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. దుండగులను పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశామని, ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. శత్రుత్వాల వల్ల హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అధికారి తెలిపారు.
కాగా AAP కహదూర్ సాహిబ్ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ లాల్‌పురాకు మృతుడు గుర్‌ప్రీత్ సింగ్ సన్నిహితుడు. చోలా చోహ్లా సాహిబ్ బ్లాక్‌కు ఆయన ఇటీవల ఆహార సరఫరా ఇంచార్జ్‌గా నియమితులయ్యారు. ఇంతలో ఆయన హత్యకు గురికావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఇదే మాదిరి ఈ ఏడాది జనవరి 15న కూడా మరో ఆప్ నేత హత్యకు గురయ్యాడు. తరన్ తరణ్ జిల్లాలోని ఝబల్ ప్రాంతంలోని సెలూన్‌లో మరో స్థానిక ఆప్ నాయకుడు సోనూ చీమాను గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్చి చంపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.