Watch Video: అడవిలో సింహాన్ని చూసి గుక్కపట్టి ఏడుస్తున్న నెటిజన్లు.. ఇంతకీ ఏం జరిగిందంటే?
సాటి మనిషి చనిపోతే ఎంతవరకు మనం బాధ పెడతామో.. పోయినవాళ్లను తలచుకుని ఎంత కుమిలిపోతామో.. స్పష్టంగా తెలియని పరిస్థితులు ప్రస్తుత సమాజంలో నెలకొన్నాయి. అలాంటిది ఓ మూగజీవి మృతితో సోషల్ మీడియాలో ఎంతో మంది విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆ మూగజీవి ఫోటోలను షేర్ చేస్తూ తమ బాధను పంచుకుంటున్నారు. ఇంతకీ ఇదంతా దేని గురించంటే.. క్రూర మృగమైన ఓ సింహం గురించి. క్రూర మృగం గురించి ఏంటి జనాలు బాధ పడిపోవడమేంటని ఆశ్చర్యంగా ఉంది కదూ.! ఆ సింహం కథాకమామీషు ఏంటో తెలుసుకుందాం..

గుజరాత్‌లోని గిర్ అడవిలో జరిగిన విషాదకర సంఘటనలో ఎంతో ప్రసిద్ధమైన సింహాల జంట ‘జై-వీరూ’లో ఒకటైన వీరూ ఈ నెల జూన్ 10న మరణించింది. బాలీవుడ్ క్లాసిక్ ‘షోలే’లోని పాత్రల పేర్లు పెట్టబడిన ఈ ఐకానిక్ సింహాల జంట ఎనిమిదేళ్లకుపైగా గిర్ అడవిలోనే జీవిస్తున్నాయి. గిర్ ఈస్ట్ డివిజన్‌లోని తులసిష్యం రేంజ్‌లో తరచూ కలిసి కనిపించేది ఈ సింహాల జంట. అయితే.. తాజాగా ఆ జంటలో ఒకటైన వీరూ అనే సింహం మరణించింది. వీరూకు దాదాపు పదేళ్ల వయస్సు ఉంటుంది. పైగా ఆ సింహం ఇటీవల అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది.
తీవ్ర అస్వస్థతకు గురవడంతో వీరూ కుంటుతూ కనిపించడంతో అటవీ శాఖ చికిత్స కోసం జసధర్ జంతు సంరక్షణ కేంద్రానికి తరలించింది. జంతు వైద్య నిపుణులు వీరూని కాపాడే ప్రయత్నాలు ఎంతగా చేసినప్పటికీ లాభం లేకపోయింది. వైద్యానికి వీరూ ఆరోగ్యం మెరుగవకపోవడానికి బదులు మరింత క్షీణించింది. దీంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోస్ట్‌మార్టంలో అంతర్గతంగా కడుపులో వాపు ఉన్నట్లు తేలింది. అది ముదిరిపోవడం వల్లే వీరూ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.
కాగా, సింహాల జంట వన్యప్రాణుల ప్రేమికులకు మాత్రమే కాకుండా అటవీ సిబ్బంది, పర్యాటకులను కూడా ఎంతగానో ఆకర్షించేవి. తరచుగా జై-వీరూ కలిసి నడుస్తూ, పక్కపక్కనే విశ్రాంతి తీసుకుంటూ చూపరులను ఆకట్టుకునేవి. అయితే.. తాజాగా అనారోగ్యం బారిన పడి వీరూ మరణించడంతో ఇప్పుడు జై అడవిలో ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. జై తన చిరకాల సహచరుడిని కోల్పోయిన తర్వాత సదరు సింహం ఆరోగ్య పరిస్థితిపై అటవీ అధికారులు ప్రత్యేక దృష్టి నిలిపారు. ఈ సింహాల జంట గురించి తెలిసినవారంతా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.